
ఇంగ్లండ్‌పై తొలి టి20లో భారత్ ఏకపక్ష విజయం సాధించడం అమితానందం కలిగింది. లోపాలు లేని ‘సూపర్ కార్’ తరహాలో అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న జట్టు ఎలాంటి ప్రదర్శన ఇవ్వగలదనేదానికి ఇదో మంచి ఉదాహరణ. మ్యాచ్‌లో కొన్ని సార్లు జోరు తగ్గినట్లు కనిపించినా, మళ్లీ డ్రైవర్ మార్గనిర్దేశనంలో ఈ సూపర్ కార్ దూసుకుపోయింది. చక్కగా, తన అనుభవంతో సరైన దిశలో జట్టును నడిపించిన ఆ డ్రైవర్ విరాట్ కోహ్లి ఈ పర్యటనలో మరిన్ని విజయాలు అందిస్తాడని ఆశించవచ్చు. కొందరు ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, జట్టు ఇంత సాధికారికంగా గెలిచిందంటే ఇక వారికి ఆకాశమే హద్దు. భారత్‌లోలాగే వాతావరణం కొంత వేడిగా ఉండటంతో ఇంగ్లండ్‌లో సాధారణంగా కనిపించే విధంగా స్వెటర్లు వేసుకొని మన ఆటగాళ్ళు బరిలోకి దిగాల్సిన అవసరం రాలేదు. నిజానికి వాతావరణం చూసి ఇంగ్లండ్ జట్టే కొంత ఆశ్చర్యపడి ఉండవచ్చు. వాస్తవానికి భారత అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి వస్తారని వారు కూడా ఊహించే ఉంటారు.
అయితే కుల్దీప్ యాదవ్ మాయను మాత్రం వారు కచ్చితంగా అంచనా వేయలేకపోయారు. అతని బౌలింగ్ ముందు ఇంగ్లిష్ బ్యాట్స్‌మన్ తోలుబొమ్మల్లా మారిపోయారు. మణికట్టు స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఇంగ్లండ్ బలహీనత గురించి తెలిసినవారు బెయిర్‌స్టో, రూట్ ఔటైన బంతులు చూసి గట్టిగా నవ్వుకొని ఉంటారు. బంతిపై సరిగా పట్టు చిక్కకపోవడంతో చహల్ అంత గొప్పగా రాణించకపోయినా... కుల్దీప్ మాత్రం బట్లర్ చెలరేగిపోతున్న కీలక సమయంలో బంతిని అందుకొని ఒక్కసారిగా మ్యాచ్‌ను మార్చేశాడు. అతని బౌలింగ్ నిజంగా అద్భుతం. ఆ తర్వాత ఒక కళాత్మక ఆట మరో బ్యాట్స్‌మన్‌నుంచి జాలువారింది. భవిష్యత్తులో మరింత గొప్పవాడిగా ఎదిగే అవకాశం ఉన్న రాహుల్ ఆ ఇన్నింగ్స్ ఆడాడు. తన తొలి పర్యటనలో ఆస్ట్రేలియా గడ్డపై మిచెల్ జాన్సన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నప్పుడే అతని ప్రత్యేకత ఏమిటో తెలిసింది. ఇంగ్లండ్ బౌలర్లను అతను చితక్కొట్టిన తీరు చూసి డగౌట్‌లో ఉన్న కెప్టెన్ కోహ్లి కూడా చప్పట్లతో ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. అతి సాధా రణ ఇంగ్లండ్ బౌలింగ్‌లో నేనేంటి ఆడేది అన్నట్లుగా రోహిత్ శర్మ ఔటయ్యాక రాహుల్ ఆటను కోహ్లి మరింత దగ్గరనుంచి ఆస్వాదించాడు. రాబోయే రోజుల్లో ఇంగ్లండ్ వెంటనే లోపాలు సవరించుకుంటేనో, లేక వాతావరణం ఒక్కసారిగా మారిపోతేనో తప్ప రాహుల్ ఇన్నింగ్స్ మున్ముందు ప్రత్యర్థికి ఎలాంటి రోజులు రాబోతున్నాయనేదానికి సూచిక.