ముంబైలో ‘మూడు’ కావాలి | India v England, 4th Test: Injured Ajinkya Rahane out of series | Sakshi
Sakshi News home page

ముంబైలో ‘మూడు’ కావాలి

Published Thu, Dec 8 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM

ముంబైలో ‘మూడు’ కావాలి

ముంబైలో ‘మూడు’ కావాలి

సిరీస్ విజయంపై భారత్ కన్ను
నేటినుంచి ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు
గాయంతో రహానే అవుట్, షమీ డౌట్!  
తీవ్ర ఒత్తిడిలో కుక్ సేన   

 
 సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే వాంఖెడే మైదానంలో ఇంగ్లండ్ జట్టు భారత్‌ను చిత్తు చేసి ఆపై సిరీస్ విజయానికి బాటలు వేసుకుంది. ఆ మ్యాచ్‌లో ఆడిన ఆటగాళ్లలో ప్రస్తుతం ముగ్గురు భారత జట్టులో ఉన్నారు. నాటితో పోలిస్తే పరిస్థితులు, బలాబలాలు మారిపోయినా... అదే వేదికపై కుక్ సేనను ఓడించి మనం సిరీస్‌ను సొంతం చేసుకుంటే ఆ కిక్ వేరు. ఇప్పుడు భారత్ కూడా సరిగ్గా అదే ఆలోచనతో ఉంది.
 
 ప్రస్తుత ఫామ్, గత రెండు టెస్టుల్లో ప్రదర్శన చూస్తే నిస్సందేహంగా భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అయితే సిరీస్‌లో కొన్ని కీలక అవకాశాలను అంది పుచ్చుకోలేకపోయిన ఇంగ్లండ్, ఈసారి మెరుగ్గా ఆడాలని పట్టుదలగా ఉంది. వారం రోజుల విశ్రాంతితో కాస్త ఉత్సాహంగా ఆ జట్టు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో నాలుగో టెస్టు కూడా ఆసక్తికరంగా మారింది.
 
 విరాట్ కోహ్లి కెప్టెన్సీలో వరుసగా నాలుగు టెస్టు సిరీస్‌లు సొంతం చేసుకున్న టీమిండియా, ఇదే జోరు కొనసాగించి మరో మ్యాచ్ గెలిస్తే ఆ అంకె ఐదుకు పెరుగుతుంది. పైగా దాదాపు మూడు దశాబ్దాల క్రితం కపిల్‌దేవ్ నేతృత్వంలో వరుసగా 17 మ్యాచ్‌లలో ఓడని భారత రికార్డు కూడా సమమవుతుంది.  

 
 ముంబై: వరుసగా రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ పని పట్టిన భారత్ ఇప్పుడు సిరీస్ సొంతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేడు (గురువారం) ఇక్కడి వాంఖెడే మైదానంలో నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. సిరీస్‌లో ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు మరో గెలుపుపై పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించినా సిరీస్ కోహ్లి సేన సొంతమవుతుంది. మరోవైపు రాజ్‌కోట్ టెస్టు తర్వాత ఇంగ్లండ్ ఆట దిగజారింది. ఇప్పటికే భారీ తేడాతో రెండు మ్యాచ్‌లు కోల్పోయిన ఆ జట్టు, పరువు నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉంది. భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అజింక్య రహానే బుధవారం నెట్ ప్రాక్టీస్‌లో గాయపడటంతో సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రధాన పేసర్ మొహమ్మద్ షమీ కూడా గాయంతో బాధపడుతున్నాడు. దాంతో వారి స్థానాల్లో మనీశ్ పాండే, శార్దుల్ ఠాకూర్‌లను ఎంపిక చేశారు.
 
 జోరు కొనసాగాలి...
 ఈ సిరీస్‌లో భారత్ ఇంత పటిష్ట స్థితిలో నిలిచిందంటే బ్యాటింగ్‌లో కోహ్లి, పుజారాలే కారణం. వీరిద్దరు తొలి మ్యాచ్ నుంచి జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించారు. 405 పరుగులతో కోహ్లి అగ్రస్థానంలో ఉండగా, పుజారా 338 పరుగులు చేశాడు. మరోసారి వీరిద్దరు జట్టు ఇన్నింగ్‌‌సలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఓపెనర్ మురళీ విజయ్ ఫామ్ కాస్త ఆందోళనపరుస్తోంది. రాజ్‌కోట్ టెస్టులో తొలి ఇన్నింగ్‌‌సలో సెంచరీ చేసిన తర్వాత అతను వరుసగా ఐదు ఇన్నింగ్‌‌సలలో విఫలమయ్యాడు. ఇప్పుడైనా అతను రాణించి కోచ్ కుంబ్లే నమ్మకాన్ని నిలబెట్టాలి. గాయంతో గత టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్ మళ్లీ ఓపెనింగ్‌కు సిద్ధమయ్యాడు. వైజాగ్ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్‌‌సలలోనూ విఫలమయ్యాడు. గాయాలతో వస్తూ, పోతూ ఉన్నా... టీమ్ మేనేజ్‌మెంట్ అతనికి ఎంతో అండగా నిలుస్తున్న నేపథ్యంలో చెప్పుకోదగ్గ ఇన్నింగ్‌‌స ఆడాల్సిన బాధ్యత రాహుల్‌పై ఉంది.
 
  వేలి గాయంతో రహానే దూరం కావడంతో కరుణ్ నాయర్‌కు మరో అవకాశం దక్కనుంది. మనీశ్ పాండేను కూడా ఎంపిక చేసినా... గత టెస్టులో కోహ్లి కారణంగా రనౌటైన కరుణ్‌కు మరో అవకాశం ఇవ్వడమే సరైందిగా జట్టు భావిస్తోంది. రాహుల్ రాకతో పార్థివ్ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడు. ముగ్గురు ఆల్‌రౌండర్లు అశ్విన్, జడేజా, జయంత్‌లు ఆడుతున్న తీరు భారత్‌కు మరో విజయంపై నమ్మకాన్ని కలిగిస్తున్నారుు. వీరు ఈ సారి ఎంతగా చెలరేగిపోతారో చూడాలి. షమీ ఫిట్‌నెస్‌పై మ్యాచ్‌కు ముందే స్పష్టత వస్తుంది. అతను ఫిట్‌గా లేకపోతే భువనేశ్వర్ బరిలోకి దిగుతాడు.
 
 కోలుకుంటారా...
 మరోవైపు ఇంగ్లండ్ కూడా వరుస ఓటముల నుంచి తప్పించుకోవాలని పట్టుదలగా ఉంది. గత రెండు టెస్టుల లోపాలను అధిగమించి ఈసారి గట్టిగా నిలబడాలని కుక్ సేన భావిస్తోంది. రెండు సార్లు ఆట చివరి ఓవర్లో వికెట్ కోల్పోవడం, మొహాలీ మ్యాచ్‌లో భారత్‌ను 156/5 నుంచి 417 పరుగులు చేయనీయడం ఆ జట్టును బాగా దెబ్బ తీశాయి. భారత గడ్డపై దీనికంటే ముందు జరిగిన సిరీస్‌లతో పోలిస్తే ఈసారి పిచ్‌లు స్పిన్‌కూ మరీ అనుకూలంగా ఏమీ లేవు. అలాంటి చోట కూడా ఇంగ్లండ్ తడబడింది. రూట్ (299 పరుగులు), కుక్ (246 పరుగులు) బ్యాటింగ్ ఆశించిన స్థారుులో లేదు. ఇంగ్లండ్ పరిస్థితి మెరుగవ్వాలంటే వీరిద్దరు భారీ స్కోర్లు చేయాల్సిందే. బెన్ స్టోక్స్ ఆల్‌రౌండర్‌గా సమర్థంగా తన పాత్ర పోషించగా, ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. కొత్త కుర్రాడు కీటన్ జెన్నింగ్‌‌స, కుక్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తాడు. బెరుుర్‌స్టో, మొరుున్ అలీ మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంది. మన స్పిన్ త్రయాన్ని ఇంగ్లండ్ ఎలా ఎదుర్కొంటుందనేదే కీలకం.
 
 గత మ్యాచ్‌కు భిన్నంగా ఈసారి ఇంగ్లండ్ ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకున్న బ్రాడ్ ఈ మ్యాచ్ ఆడితే జట్టు బలం పెరగడం ఖాయం. ఆదిల్ రషీద్ పేరుకు 18 వికెట్లు పడగొట్టినా, అతను భారత బ్యాట్స్‌మెన్‌ను పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయాడు. ఇంగ్లండ్ ఎంతో నమ్మకం పెట్టుకున్న మొయిన్ అలీ (7 వికెట్లు) స్పిన్ ఎందుకూ పనికి రాలేదు. ఈ నేపథ్యంలో పిచ్ ఎలా ఉన్నా, ఇంగ్లండ్  తమ పేస్ బలంపైనే ఆశలు పెట్టుకుంటూ నలుగురికి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తోంది.
 
 41  కోహ్లి మరో 41 పరుగులు చేస్తే టెస్టుల్లో 4 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు.
 
 10 వాంఖెడే మైదానంలో భారత్ 24 టెస్టులు ఆడగా, 10 గెలిచి, 7 ఓడింది. మరో 7 డ్రాగా ముగిశాయి. అయితే ఇంగ్లండ్ ఇక్కడ ఆడిన గత రెండు టెస్టుల్లోనూ (2006, 2012) గెలిచింది.
 
 0 భారత గడ్డపై తొలి టెస్టు జరిగిన 1933 నాటి నుంచి గత 83 ఏళ్లలో ముంబైకి చెందిన ఆటగాడు భారత తుది జట్టులో లేకుండా ముంబైలో ఒక్క టెస్టు కూడా జరగలేదు. శార్దుల్ ఠాకూర్‌కు అవకాశం లభించకపోతే ఇదే మొదటిసారి అవుతుంది.

 
 మా జట్టులో ఒకరు విఫలమైతే మరొకరు బాధ్యత తీసుకొని రాణిస్తున్నారు. కాబట్టి ఒకరు బాగా ఆడుతున్నారని, మరొకరు విఫలమవుతున్నారని అనుకోవద్దు. దీనిని ఏ ఒక్కరి గురించో కాకుండా మొత్తం జట్టు కోసం అన్నట్లుగా భావించాలి. గాయాల వల్ల లేదా ఆయా వికెట్ స్వభావాన్ని బట్టే తుది జట్టులో తరచుగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏం చేసినా జట్టు గెలవడమే ముఖ్యం. ఆ స్థానంలో రాణించేందుకు మరొకరు సిద్ధంగా ఉన్నారని భువీ చూపించాడు. అవకాశాలు అంది పుచ్చుకోవడమే ముఖ్యం. సిరీస్ మధ్యలో వారికి ఎనిమిది రోజుల విశ్రాంతి, వన్డే సిరీస్‌కు ముందు సెలవులు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. ఇది షెడ్యూల్‌లో భాగం కాబట్టి నేనేమీ చెప్పలేను గానీ మేం కూడా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మాకూ ఇలాంటి విరామమే కావాలని కోరుతున్నా. మేం మూడున్నర నెలలు అక్కడ ఉంటే ప్రతీ రోజు మీడియా కంట్లో కనిపిస్తూనే ఉంటాం. ఇప్పుడు దుబాయ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎలా గడిపారో నాకై తే తెలీదు. అలాంటిది మాకూ కావాలి.
 -విరాట్ కోహ్లి, భారత కెప్టెన్
 
 రాజ్‌కోట్ టెస్టు మాకు బ్లూప్రింట్‌లాంటిది. మేం ఇక్కడ సరిగ్గా అదే తరహాలో ఆడాలి. తర్వాతి రెండు టెస్టుల్లో ఆ పట్టుదల తగ్గడం వల్లనేమో మ్యాచ్‌లు కోల్పోయాం. మరీ నత్తనడక బ్యాటింగ్‌తో పోలిస్తే మేం దూకుడుగా ఆడాల్సి ఉంది. కొత్త ఓపెనర్ కీటన్‌లో మంచి ప్రతిభ ఉంది. గతంలో మాకు బాగా అచ్చొచ్చిన మైదానంలో తిరిగి అడుగు పెట్టడం ఆనందంగా ఉంది. పరిస్థితులు మారినా ఈ గ్రౌండ్‌లో ఈ సారీ బాగా ఆడాలని కోరుకుంటున్నాం. దుబాయ్‌లో సెలవులు గడిపిన తర్వాత మేం మరింత ఉత్సాహంతో ఉన్నాం.
 -అలిస్టర్ కుక్, ఇంగ్లండ్ కెప్టెన్  
 
 పిచ్, వాతావరణం
 ఈ సిరీస్‌లో జరిగిన మూడు టెస్టుల్లోనూ పిచ్‌లపై ఎలాంటి ఫిర్యాదు రాలేదు. అనూహ్యంగా స్పందించకుండా చక్కగా ఆటకు అవకాశం కల్పించారుు. స్పిన్‌కు గానీ, బ్యాటింగ్‌కు గానీ పూర్తిగా అనుకూలించలేదు. ఈసారి కూడా అలాంటి పిచ్‌నే రూపొందించారు. అయితే మూడు రోజు నుంచి బంతి తిరిగేందుకు అవకాశం ఉంది. వర్ష సూచన లేదు.
 
 తుది జట్ల వివరాలు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టెన్), రాహుల్, విజయ్, పుజారా, కరుణ్ నాయర్/మనీశ్ పాండే, అశ్విన్, పార్థివ్, జడేజా, జయంత్, ఉమేశ్, షమీ/భువనేశ్వర్.
 
 ఇంగ్లండ్: కుక్ (కెప్టెన్), కీటన్, రూట్, అలీ, బెయిర్‌స్టో, స్టోక్స్, బట్లర్, వోక్స్, రషీద్, అండర్సన్, బ్రాడ్/ఫిన్.
 

 ఉ. గం. 9.30 నుంచి
 స్టార్ స్పోర్‌‌ట్స-1లో
  ప్రత్యక్ష ప్రసారం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement