అసలు సమరానికి సై | India VS Australia First ODI On 14/01/2020 | Sakshi
Sakshi News home page

అసలు సమరానికి సై

Published Tue, Jan 14 2020 2:38 AM | Last Updated on Tue, Jan 14 2020 4:56 AM

India VS Australia First ODI On 14/01/2020 - Sakshi

ప్రాక్టీస్‌ సెషన్‌లో శ్రేయస్‌ అయ్యర్, విరాట్‌ కోహ్లి, నవదీప్‌ సైనీ

సొంతగడ్డపై బలహీన దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంకలతో వరుసగా ఏమాత్రం ఆసక్తి రేపని మ్యాచ్‌లతో మొహం వాచిన భారత క్రికెట్‌ అభిమానులు అసలైన సమరం చూసే సమయం ఆసన్నమైంది. ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌ తర్వాత చెప్పుకోదగ్గ ప్రత్యర్థితో తలపడని టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియాతో పోరుకు సన్నద్ధమైంది. మరోవైపు సెమీస్‌లోనే ఓడిన ఆసీస్‌ ఆ తర్వాత ఇప్పుడే మళ్లీ వన్డే బరిలోకి దిగుతోంది. పూర్తి స్థాయి జట్టుతో కంగారూలు పటిష్టంగా కనిపిస్తుండగా, స్వదేశంలో కోహ్లి సేన ఏ రకంగా చూసినా బలమైనదే. అయితే దాదాపు ఏడాది క్రితం ఇక్కడే జరిగిన సిరీస్‌ను ఆసీస్‌ 3–2తో గెలుచుకున్న విషయాన్ని హెచ్చరికగా తీసుకుంటే కోహ్లి సేన గెలుపు కోసం మరింతగా శ్రమించాల్సిందే.

ముంబై: ప్రపంచ క్రికెట్‌లో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య వన్డే సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఇది మూడు మ్యాచ్‌లకే పరిమితం కావడం కొంత నిరాశపరుస్తున్నా... ప్రేక్షకులకు మాత్రం మంచి వినోదం లభించేందుకు పూర్తి అవకాశం ఉంది. మూడు వన్డేల సిరీస్‌లో నేడు వాంఖడే మైదానంలో జరిగే తొలి మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఇరు జట్లు కూడా పూర్తి స్థాయి బలగంతో బరిలోకి దిగుతుండటంతో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. 2019 మార్చిలో భారత్‌లోనే జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు టీమిండియా నెగ్గగా... చివరి మూడు గెలిచిన ఆసీస్‌ సిరీస్‌ సొంతం చేసుకుంది.

ముగ్గురికీ చోటు!  
విశ్రాంతి అనంతరం రోహిత్‌ శర్మ పునరాగమనం చేయడంతో అతనితో పాటు రెండో ఓపెనర్‌ స్థానం విషయంలో ఆసక్తికర చర్చ నడిచింది. రాహుల్‌ అద్భుత ఫామ్‌లో ఉండటంతో, ధావన్‌ వరుస వైఫల్యాల వల్ల తుది జట్టులో రాహుల్‌కే అవకాశం వస్తుందనిపించింది. అయితే శ్రీలంకతో చివరి టి20లో రాణించిన తర్వాత ధావన్‌ కూడా తానూ రేసులో ఉన్నానని ప్రకటించాడు. కెప్టెన్‌ కోహ్లి కూడా ఇదే ఆలోచించినట్లున్నాడు. జట్టు కోసం అవసరమైతే తాను నాలుగో స్థానంలో ఆడతానని ప్రకటించాడు.

దాంతో టాప్‌–3పై స్పష్టత వచ్చేసింది. రోహిత్, ధావన్‌లతో పాటు రాహుల్‌ మూడో స్థానంలో బరిలోకి దిగడం ఖాయమైంది. ఇందు కోసం పంత్‌ను పక్కన పెట్టి రాహుల్‌తోనే కీపింగ్‌ చేయించాలని మేనేజ్‌మెంట్‌ నిర్ణయించింది. ఆసీస్‌పై ఘనమైన రికార్డు ఉన్న (24 మ్యాచ్‌లలో 4 సెంచరీలు సహా 975 పరుగులు) ధావన్‌ ప్రపంచ కప్‌లో కూడా అదే జట్టుపై సెంచరీ చేసిన తర్వాతే టోర్నీకి దూరమయ్యాడు. ఇక్కడా అతను చెలరేగిపోతే భారత్‌కు శుభారంభం లభిస్తుంది.

రోహిత్, కోహ్లి ఫామ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే వన్డే జట్టులో తన స్థానం దాదాపుగా సుస్థిరం చేసుకున్న శ్రేయస్‌ అయ్యర్‌ ఐదో స్థానంలో ఆడతాడు. కేదార్‌ జాదవ్‌ వన్డే కెరీర్‌ ఈ సిరీస్‌ తర్వాత తేలిపోవచ్చు. చాలా కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వని జాదవ్‌ ఇక్కడా ఆడకపోతే భారత్‌ మరో ప్రత్యామ్నాయం చూసుకోవడం ఖాయం. ఆల్‌రౌండర్‌గా జడేజా, ఏకైక స్పిన్నర్‌గా కుల్దీప్‌ కూడా చోటు నిలబెట్టుకున్నారు. బుమ్రా కూడా వరల్డ్‌ కప్‌ ఇప్పుడే వన్డే ఆడబోతున్నాడు. అతనికి తోడుగా షమీ, నవదీప్‌ సైనీలలో ఒకరికే అవకాశం దక్కవచ్చు. బ్యాటింగ్‌లో కూడా ఉపయోగపడే అవకాశం ఉండటంతో శార్దుల్‌ చోటుకు ఢోకా లేకుండా పోయింది.

స్మిత్, వార్నర్‌ రెడీ...

టీమ్‌ ఫొటో సెషన్‌లో లబ్‌షేన్, స్మిత్, వార్నర్, జంపా (ఎడమ నుంచి)
గత భారత్‌–ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు, ఈసారి సమరానికి ప్రధాన తేడా వారిద్దరే. ఏడాది క్రితం నిషేధం కారణంగా అందుబాటులో లేని వార్నర్, స్మిత్‌ ఈసారి భారత గడ్డపై తమ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. ఐపీఎల్‌ కారణంగా ఇక్కడ సహచరులందరికంటే వీరిద్దరికే ఎక్కువ అనుభవం ఉంది. వార్నర్, ఫించ్‌ ఓపెనింగ్‌ జోడి ఆసీస్‌కు శుభారంభం అందిస్తే మూడో స్థానంలో స్మిత్‌ దానిని కొనసాగించగలడు. 2019లో టెస్టు క్రికెట్‌లో పలు ఘనతలు నమోదు చేసిన లబ్‌షేన్‌ తొలిసారి వన్డేల్లో అరంగేట్రం చేయబోతున్నాడు.

నాలుగో స్థానంలో ఆడబోతున్న అతను ఈ ఫార్మాట్‌లో ఎలాంటి ప్రదర్శన ఇస్తాడనేది ఆసక్తికరం. మిడిలార్డర్‌లో హ్యాండ్స్‌కోంబ్, అలెక్స్‌ క్యారీ బ్యాటింగ్‌ భారం మోస్తారు. క్యారీ ఇటీవల బ్యాటింగ్‌లో చాలా మెరుగయ్యాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్లకంటే పూర్తి స్థాయి బౌలర్లనే ఈ సిరీస్‌లో నమ్ముకుంది. అందుకే మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, మిషెల్‌ మార్‌‡్షలాంటి వాళ్లను పక్కన పెట్టేసింది. ఆసీస్‌ టెస్టు క్రికెట్‌ స్టార్‌ పేసర్లు అయిన స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్‌ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.

ఈ ముగ్గురు కలిసి సుదీర్ఘ కాలం తర్వాత ఒకేసారి కలిసి ఆడబోతున్నారు. 2010లో విశాఖపట్నంలో వన్డేల్లో అరంగేట్రం చేసిన తర్వాత స్టార్క్‌ ఇప్పటి వరకు భారత్‌లో మరో మ్యాచ్‌ ఆడకపోగా, హాజల్‌వుడ్‌ అయితే ఒక్క వన్డే కూడా ఆడలేదు. అయితే  స్పిన్నర్‌గా ఆడమ్‌ జంపా జట్టులో ఉండగా, ఆల్‌రౌండర్‌ స్థానంలో అగర్‌ ఆడవచ్చు. ఓవరాల్‌గా చూస్తే అన్ని రంగాల్లో కూడా పటిష్టంగా కనిపిస్తున్న ఆస్ట్రేలియా సిరీస్‌ను ఆసక్తికరంగా మార్చనుంది.

►మరో సెంచరీ చేస్తే స్వదేశంలో 20 వన్డే సెంచరీల సచిన్‌ రికార్డును కోహ్లి (ప్రస్తుతం 19) సమం చేస్తాడు.
►మరో వికెట్‌ తీస్తే వన్డేల్లో కుల్దీప్‌ యాదవ్‌ 100 వికెట్లు పూర్తవుతాయి.

ఆటగాళ్లందరూ ఫామ్‌లో ఉండటం జట్టుకు శుభసూచకం. ఇలాంటి స్థితిలో నా బ్యాటింగ్‌ స్థానాన్ని సంతోషంగా మార్చుకుంటా. స్థానం గురించి అభద్రతాభావం నాలో లేదు. మ్యాచ్‌లో రోహిత్, రాహుల్, ధావన్‌ ముగ్గురూ ఆడే అవకాశం ఉంది. కెప్టెన్‌గా ప్రస్తుత జట్టు బాగోగులు చూసుకోవడంతో పాటు దూరదృష్టితో ఆలోచించడం కూడా ముఖ్యం. ఇతరులకు అవకాశాలు ఇవ్వడం కూడా నా బాధ్యత.

నా వ్యక్తిగత ఘనతలు చూసుకుంటూ నేను పరుగులు చేస్తే చాలనుకోవడం సరైంది కాదు. గత ఏడాది వచ్చిన ఆస్ట్రేలియా జట్టుకంటే ఈ జట్టు మరింత పటిష్టంగా కనిపిస్తోంది. ఈ సిరీస్‌కు ప్రాధాన్యత ఉందా లేదా అనేది జనం నిర్ణయించాలి. మా దృష్టిలో మాత్రం రెండు అత్యుత్తమ జట్ల మధ్య జరుగుతున్న పోరు. అలాంటి పటిష్ట  జట్టుతో తలపడటం ఎప్పుడైనా ఆసక్తికరమే. –విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్‌  

బుమ్రాకు ఎవరైనా ఒకటే...

భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను ఎదుర్కోవడం ఎంత కష్టమో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు బాగా తెలుసు. అయితే  నెట్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌కు బుమ్రా ఎలాంటి బౌలింగ్‌ చేస్తాడనేదానికి కెప్టెన్‌ కోహ్లి ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. సోమవారం అతను బుమ్రా బౌలింగ్‌లో అవుటయ్యాడు. సాధన సమయంలో బుమ్రాకు ఎవరైనా ఒకటేనని, తన పూర్తి సామర్థ్యంతో అతను బౌలింగ్‌ చేస్తాడని విరాట్‌ అన్నాడు. ‘నా దృష్టిలో ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లోని ఏ ఫార్మాట్‌లోనైనా  బుమ్రా అత్యుత్తమ బౌలర్‌.

ప్రాక్టీస్‌ సెషన్‌లో కూడా అతను మ్యాచ్‌ ఆడినప్పుడు ఎలా ఉంటాడో అంతే తీవ్రతతో బౌలింగ్‌ చేస్తాడు. మా తల, పక్కటెముకలు లక్ష్యంగా బౌలింగ్‌ చేసేందుకు అతను ఎప్పుడూ వెనుకాడడు. అతడిని ఎదుర్కోవడాన్ని నేను సవాల్‌గా భావిస్తాను. నెట్స్‌లో అతని బౌలింగ్‌లో బౌండరీలు బాదడం కూడా చాలా కష్టం. అయితే అతని బౌలింగ్‌లో నేను అవుట్‌ కావడం నాలుగేళ్లలో ఇది రెండో సారి మాత్రమే’ అని కోహ్లి వివరించాడు.

హార్దిక్‌ పాండ్యా సాధన...

గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో భారత ‘ఎ’ జట్టుకు, న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌కు దూరమైన హార్దిక్‌ పాండ్యా సోమవారం భారత జట్టు సభ్యులతో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. కోచ్‌ భరత్‌ అరుణ్‌ పర్యవేక్షణలో అతను నెట్స్‌లో బౌలింగ్‌ చేశాడు. బోర్డు నుంచి ఎలాంటి ప్రత్యేక సూచనలు లేవని, తన ఫిట్‌నెస్‌ స్థాయిని పరీక్షించుకునేందుకే అతను సాధన చేసినట్లు సమాచారం. వెన్నుకు గాయంతో ఆటకు దూరమైన అనంతరం పాండ్యాకు శస్త్రచికిత్స కూడా జరిగింది. 

తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, రాహుల్, అయ్యర్, జాదవ్, జడేజా, శార్దుల్, కుల్దీప్, బుమ్రా, షమీ/సైనీ. 
ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్, స్మిత్, లబ్‌షేన్, హ్యాండ్స్‌కోంబ్, క్యారీ, అగర్, జంపా, స్టార్క్, హాజల్‌వుడ్, కమిన్స్‌.

పిచ్, వాతావరణం
వాంఖడే పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. ఇటీవల విండీస్‌తో జరిగిన టి20లోనే భారత్‌ 240 పరుగులు చేసింది. మ్యాచ్‌ రోజు వర్ష సూచన లేదు. అయితే మంచు కారణంగా టాస్‌ గెలిచే జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement