మెల్‌బోర్న్: భారత్- ఆస్ట్రేలియా రెండో టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ గెలిచే అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలన్న టీమిండియా ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్‌ను దిగిన ఆసీస్ ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. భారత బౌలర్లు పదునైన బంతులు సంధించడంతో కంగారూలు పెవిలియన్‌కు వరుస కట్టారు. టీమిండియా బౌలర్ల ధాటికి 74 పరుగులకే 6 వికెట్లు నష్టపోయింది. మెక్ డెర్మొట్ (32 నాటౌట్) పోరాడటంతో ఆసీస్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. 19 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 132 పరుగులు చేసింది. అప్పుడే వరుణుడి దోబుచులాట మొదలైంది.
మళ్లీ వరుణుడే అడ్డుకున్నాడు..!
ఆసీస్ జట్టు కేవలం 132 పరుగులు చేయడంతో.. కోహ్లి సేనకు ఇదేమంత పెద్ద టార్గెట్ కాదని, ఈజీగా మ్యాచ్ గెలిచేయొచ్చని అభిమానులు భావించారు. ఊహించినట్టుగానే అంపైర్లు భారత్ లక్ష్యాన్ని 137 పరుగులుగా నిర్దేశించారు. కానీ మరోసారి వర్షం కురవడంతో మ్యాచ్‌ను11 ఓవర్లకు కుదించి టీమిండియాకు 90 పరుగుల టార్గెట్ పెట్టారు. వరుణుని దోబూచులాట కొనసాగడంతో మరోసారి మ్యాచ్‌ను కుదించారు. 5 ఓవర్లలో భారత్‌కు 46 పరుగుల లక్ష్యం నిర్దేశించారు. కానీ ఎంతకూ వర్షం వీడకపోవడంతో చివరకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.
కాగా వర్షం కారణంగా తొలి టీ20లో అనూహ్యంగా ఓటమి మూటగట్టుకున్న టీమిండియా.. రెండో టీ20 రద్దవడంతో సిరీస్ సమం చేసే అవకాశమే తప్ప నెగ్గే ఆస్కారం లేకుండా పోయింది. ఈ క్రమంలో వరుసగా ఎనిమిదో టీ20 సిరీస్ గెలిచే ఘనతను భారత్ చేజార్చుకున్నట్లయింది. ఇక చివరి మ్యాచ్‌లో భారత్ గెలిస్తేనే సిరీస్ సమం అవుతుంది లేదంటే కంగారూల సొంతమవుతుంది. ఈ రెండూ కాకుండా మళ్లీ వరుణుడు రంగంలోకి దిగితే మాత్రం కష్టం.
Comments
Please login to add a commentAdd a comment