
ప్రయోగాలు చేస్తారా!
కొత్త కుర్రాళ్లను భారత్ పరీక్షించే అవకాశం
నేడు ఇంగ్లండ్‌తో చివరి వన్డే
మ. గం. 3.00 నుంచి స్టార్ స్పోర్ట్స్ 1,
దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం
సాధారణంగా భారత జట్టు విజయాల బాటలో ఉన్నప్పుడు, సిరీస్ గెలిచిన తర్వాత కూడా తుది జట్టును మార్చేందుకు ధోని-ఫ్లెచర్ ప్రయత్నించరు. క్లీన్‌స్వీప్‌పై వారి దృష్టి ఉంటుంది. అయితే ఇప్పుడు టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి కూడా వ్యూహకర్తగా ఉన్నాడు. ప్రపంచ కప్‌కు ముందు ఇంగ్లండ్ పరిస్థితుల్లో కొత్త ఆటగాళ్లను పరీక్షించాలని శాస్త్రి భావిస్తే ఆఖరి వన్డేలో భారత్ కొన్ని ప్రయోగాలు చేయొచ్చు.
లీడ్స్: ఇంగ్లండ్ గడ్డపై 24 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ విజయంతో ఒక లాంఛనం ముగిసింది. టెస్టు సిరీస్‌లో పరాభవానికి టీమిండియా తమదైన శైలిలో జవాబు ఇచ్చింది. ఇక మిగిలింది ప్రత్యర్థికి ఒక్క గెలుపు కూడా దక్కకుండా చావుదెబ్బ కొట్టడమే. ఇదే లక్ష్యంతో ధోని సేన చివరి, ఐదో వన్డేకు సిద్ధమైంది. నేడు (శుక్రవారం) ఇక్కడి హెడింగ్లీ మైదానంలో జరిగే ఆఖరి వన్డేలో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. భారత్ ఇప్పటికే 3-0తో సిరీస్ గెలుచుకుంది. కాబట్టి ఓడినా పోయేదేమీ లేదు. మరోవైపు సొంతగడ్డపై కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని కుక్ బృందం భావిస్తోంది.
ఐదుగురి ఎదురుచూపులు
సిరీస్‌లో రహానే అద్భుతంగా ఆడుతుండగా... నాలుగో వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఫామ్‌లోకి రావడంతో మన జట్టుకు ప్రధాన సమస్య ఒకటి తీరిపోయింది. అయితే జట్టులో నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ హోదాతో ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన విరాట్ కోహ్లి మాత్రం భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. ఇంగ్లండ్‌లో ఈసారి ఆడిన 13 ఇన్నింగ్స్‌లలో అతని అత్యధిక స్కోరు 40 మాత్రమే! చివరి వన్డేలోనైనా అతను మెరుపులు మెరిపించాలని జట్టు ఆశిస్తోంది. ఇక మిడిలార్డర్‌లో రైనా, రాయుడులకు మరి కొంత బ్యాటింగ్ ప్రాక్టీస్ అవసరం ఉంది. అయితే ఇప్పటివరకు అవకాశం రాకుండా బెంచ్ మీద ఐదుగురు ఆటగాళ్లు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. కరణ్‌శర్మ, శామ్సన్, విజయ్, బిన్నీ, ఉమేశ్ యాదవ్‌లలో ఎవరికి అవకాశం వస్తుందో చూడాలి.
అయోమయంలో కుక్
సిరీస్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ వ్యూహ, ప్రతివ్యూహాలపై అన్ని వైపులనుంచి విమర్శలు వస్తున్నా...కుక్‌లో మాత్రం నిస్సహాయత కనిపిస్తోంది. గత మూడు వన్డేల్లో కనీస ప్రతిఘటన కూడా ఇవ్వకుండా ఇంగ్లండ్ బేలగా ఆడి చేతులెత్తేసింది. ఓపెనర్‌గా కుక్ ఘోరంగా విఫలమవుతుండగా, గత మ్యాచ్‌లో హేల్స్ కూడా రాణించలేకపోయాడు. బాలెన్స్, రూట్, మోర్గాన్‌లలో ఎవరిలోనూ ధాటిగా వన్డే ఇన్నింగ్స్ ఆడే సత్తా కనిపించడం లేదు.
భారత్‌పై ఇంగ్లండ్ ఏ దశలోనూ ఒత్తిడి పెంచలేకపోయింది. ఇక స్పిన్‌ను ఎదుర్కోవడం ఇంగ్లండ్ తరం కావడం లేదు. అందరూ విఫలమవుతున్న చోట ఎవరిని తీసుకోవాలనేది కూడా సమస్యగా మారింది. ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో ఇంగ్లండ్ చివరి మ్యాచ్ నెగ్గాలంటే అద్భుతమే జరగాలి.
పిచ్, వాతావరణం
ఫ్లాట్ వికెట్, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ మైదానంలో గత ఐదు వన్డేల్లో మూడు భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యాయి. అయితే వాతావరణ శాఖ నివేదిక ప్రకారం శుక్రవారం వర్షం పడేందుకు 5 శాతం మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి మ్యాచ్‌కు అవరోధం కలుగకపోవచ్చు.
‘గత మూడు వన్డేల్లో మా ఆట పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. అయితే మేం ఉదాసీనంగా లేము. అదే తీవ్రతతో బరిలోకి దిగుతాం. సిరీస్‌లో గెలిచిన వన్డేలకు ఏ తరహాలో సిద్ధమయ్యామో ఈ మ్యాచ్‌కు కూడా అదే తరహాలో సిద్ధంగా ఉన్నాం. ఆరంభాన్ని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్న నా బలహీనతను గుర్తించి రవిశాస్త్రి తగిన సలహా ఇచ్చారు. ఆయన వల్లే నాలుగో వన్డేలో సెంచరీ సాధించగలిగా’
-రహానే, భారత ఆటగాడు