గంటలోపే ఖేల్ ఖతం | India vs England, 4th Test: All-round India cap off resounding series win | Sakshi
Sakshi News home page

గంటలోపే ఖేల్ ఖతం

Published Tue, Dec 13 2016 1:05 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM

గంటలోపే ఖేల్ ఖతం

గంటలోపే ఖేల్ ఖతం

ముంబై టెస్టులో భారత్‌ ఘనవిజయం 
ఇంగ్లండ్‌పై ఇన్నింగ్స్, 36 పరుగుల ఆధిక్యంతో గెలుపు 
సిరీస్‌ 3–0తో కైవసం


ఊహించినట్టుగానే జరిగింది.. ఎలాంటి సంచలనాలు చోటు చేసుకోలేదు. బరిలో దిగిన గంటలోపే భారత బౌలర్లు విజయ            లాంఛనాన్ని ముగించారు. మన బ్యాట్స్‌మెన్ కు మరో ఇన్నింగ్స్‌ ఆడే పరిస్థితి లేకుండా ఇంగ్లండ్‌ చివరి వరుస బ్యాట్స్‌మన్ ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా ఐదు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే కోహ్లి సేన 3–0తో దక్కించుకుంది. చివరి రోజు కూడా అశ్విన్ తన స్పిన్ మ్యాజిక్‌ను ప్రదర్శించి మిగిలిన నాలుగు వికెట్లను కేవలం నాలుగు ఓవర్లలోనే తన ఖాతాలో వేసుకుని సూపర్‌ ఫినిషింగ్‌ ఇచ్చాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసినా... భారత బౌలర్ల ప్రతిభ కారణంగా ఇంగ్లండ్‌ జట్టుకు ఇన్నింగ్స్‌ ఓటమి తప్పలేదు. కోహ్లి నేతృత్వంలో భారత జట్టుకిది వరుసగా ఐదో టెస్టు సిరీస్‌ విజయం కావడం విశేషం. అలాగే దాదాపు 24 ఏళ్ల అనంతరం ఇంగ్లండ్‌ జట్టుపై స్వదేశంలో తొలిసారిగా మూడు టెస్టులను నెగ్గినట్టయ్యింది.

ముంబై: లాంఛనం ముగిసింది. భారత్‌ ఖాతాలో మరో విజయం చేరింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. సోమవారం ముగిసిన నాలుగో టెస్టులో కోహ్లి సేన ఇన్నింగ్స్, 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ జట్టును చిత్తుగా ఓడించింది. చివరి రోజు ఇంగ్లండ్‌ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో కనీస పోటీని కూడా ప్రదర్శించలేదు. దీంతో 55.3 ఓవర్లలో 195 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. మరోవైపు వరుసగా మూడు విజయాలతో ఐదు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు 3–0తో కైవసం చేసుకుంది.
1993లో అజహరుద్దీన్ కెప్టెన్సీలో చివరిసారిగా భారత జట్టు ఇంగ్లండ్‌పై మూడు టెస్టులను నెగ్గింది. అశ్విన్ కు ఆరు, జడేజాకు రెండు వికెట్లు దక్కాయి. మొత్తం ఈ మ్యాచ్‌లో అశ్విన్ 12 వికెట్లు తీశాడు. అలాగే ఈ విజయంతో 2012లో ఇంగ్లండ్‌కు కోల్పోయిన ఆంథోనీ డి మెల్లో ట్రోఫీని తిరిగి కైవసం చేసుకున్నట్టయ్యింది. సిరీస్‌లో చివరి టెస్టు ఈనెల 16 నుంచి 20 వరకు చెన్నైలో జరుగుతుంది.

ఓవర్‌నైట్‌ స్కోరు 182/6తో తమ రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ భారత బౌలర్లకు ఎలాంటి శ్రమను ఇవ్వలేదు. అశ్విన్  దెబ్బకు కేవలం ఎనిమిది ఓవర్లలో 13 పరుగులు మాత్రమే చేసి తమ ఇన్నింగ్‌్సను ముగించింది. బెయిర్‌స్టో (107 బంతుల్లో 51; 2 ఫోర్లు) చక్కటి క్యారమ్‌ బంతికి వికెట్ల ముందు దొరికిపోగా తను రివ్యూకు వెళ్లాడు. అయితే అంపైర్‌ నిర్ణయమే సరైందని తేలింది. అలాగే క్రిస్‌ వోక్స్‌ (0), రషీద్‌ (7 బంతుల్లో 2)లను అవుట్‌ చేసిన అశ్విన్ తన కెరీర్‌లో 24సార్లు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఫీట్‌ను పూర్తి చేశాడు. ఆ తర్వాత అండర్సన్ (2)ను కూడా అశ్వినే పెవిలియన్ కు పంపి భారత శిబిరంలో విజయోత్సాహాన్ని నింపాడు.

అండర్సన్ తో భారత ఆటగాళ్ల వాగ్వాదం
640 పరుగులు... ఈ సిరీస్‌లో కెప్టెన్ విరాట్‌ కోహ్లి ఇప్పటిదాకా సాధించిన పరుగులు. అయితే 128 సగటుతో భీకర ఫామ్‌లో ఉన్న తన బ్యాటింగ్‌ను ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్ తేలిగ్గా తీసుకుంటున్నాడు. అసలు అతడి బ్యాటింగ్‌ టెక్నిక్‌ ఏమంత గొప్పగా లేదని, తను భారత్‌లోనే బాగా ఆడతాడని ఆదివారం ఆట అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో విమర్శించాడు. ఇది చివరి రోజు తను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు మాటల యుద్ధానికి తెర తీసింది. భారత ఫీల్డర్లు అండర్సన్ చుట్టూ చేరి ఏదో అనడం కనిపించింది. వెంటనే రంగంలోకి దిగిన అంపైర్లు అశ్విన్ , జడేజాలతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే అండర్సన్ కామెంట్స్‌ తనకు తెలీదని కెప్టెన్ కోహ్లి అన్నాడు.

స్కోరు వివరాలు
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 400; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 631
ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: కుక్‌ ఎల్బీడబ్ల్యూ (బి) జడేజా 18; జెన్నింగ్స్‌ ఎల్బీడబ్ల్యూ (బి) భువనేశ్వర్‌ 0; రూట్‌ ఎల్బీడబ్ల్యూ (బి) జయంత్‌ యాదవ్‌ 77; మొయిన్ అలీ (సి) విజయ్‌ (బి) జడేజా 0; బెయిర్‌స్టో ఎల్బీడబ్ల్యూ (బి) అశ్విన్ 51; స్టోక్స్‌ (సి) విజయ్‌ (బి) అశ్విన్ 18; బాల్‌ (సి) పార్థీవ్‌ పటేల్‌ (బి) అశ్విన్ 2; బట్లర్‌ నాటౌట్‌ 6; వోక్స్‌ (బి) అశ్విన్ 0; అదిల్‌ రషీద్‌ (సి) రాహుల్‌ (బి) అశ్విన్ 2; అండర్సన్ (సి) ఉమేశ్‌ (బి) అశ్విన్ 2; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (55.3 ఓవర్లలో ఆలౌట్‌) 195.
వికెట్ల పతనం: 1–1, 2–43, 3–49, 4–141, 5–180, 6–182, 7–185, 8–189, 9–193, 10–195. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–1–11–1; ఉమేశ్‌ 3–0–10–0, జడేజా 22–3–63–2, అశ్విన్ 20.3–3–55–6, జయంత్‌ యాదవ్‌ 6–0–39–1.

1  పర్యాటక జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసినా ఓడడం భారత్‌లో ఇదే తొలిసారి. ప్రపంచ క్రికెట్‌లో ఇంగ్లండ్‌ రెండుసార్లు, శ్రీలంక ఒక సారి ఇలా ఇన్నింగ్స్‌ ఓటమిని పొందాయి.
7  మ్యాచ్‌లో పది వికెట్లకు పైగా తీయడం అశ్విన్ కు ఇది ఏడోసారి. భారత్‌ నుంచి  కుంబ్లే (8) టాప్‌లో ఉన్నాడు.
17  స్వదేశంలో భారత్‌ వరుసగా 17 టెస్టుల్లో ఓటమి లేకుండా సాగుతోంది. 1980ల్లో కపిల్‌ దేవ్‌ కెప్టెన్సీలో జట్టు సాధించిన ఫీట్‌ను సమం చేసింది.
27  ఇప్పటిదాకా ఈ సిరీస్‌లో అశ్విన్ తీసిన వికెట్లు.
  భారత జట్టు వరుసగా ఐదో సిరీస్‌ను సొంతం చేసుకొని తమ అత్యుత్తమ ప్రదర్శనను సమం చేసింది. 2008–2010 మధ్యలో కూడా భారత్‌ ఐదు సిరీస్‌లు నెగ్గింది.

ఈ విజయం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఐదు సిరీస్‌లలో ఇదే మధురమైన విజయం. నేను వాస్తవిక ధోరణిలో ఉంటాను. ఇతరుల టెక్నిక్, బలహీనతల గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. ఎవరికి వారు అర్థం చేసుకుని దానిపై కృషి చేయాలి. నా దృష్టి అంతా మంచి క్రికెట్‌పైనే ఉంటుంది. వ్యక్తిగత మైలురాళ్ల గురించి ఆలోచించను. అండర్సన్ వ్యాఖ్యల గురించి నాకు తెలీదు. మైదానంలో అశ్వినే నాతో చెప్పాడు. వెంటనే నవ్వాను. అయితే అశ్విన్ అతడితో వాగ్వాదానికి దిగితే నేనే వెళ్లి సర్దిచెప్పాను. పరిస్థితిని శాంతింపజేయడం నాకు ఇదే తొలిసారి.       –విరాట్‌ కోహ్లి (భారత కెప్టెన్)

మేం చాలా అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం. దీంతో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ వికెట్‌పై 400 పరుగులు మంచి స్కోరు. మొయిన్అలీ, రషీద్‌లను తక్కువ చేసినట్టు కాదు గానీ మా జట్టులో 2012లో స్వాన్, పనేసర్‌లాంటి అత్యుత్తమ స్థాయి స్పిన్నర్లు ఉన్నారు. ఈ పిచ్‌లపై అలాంటి బౌలర్లే కావాలి. ఇక్కడి మైదానాల్లో భారత్‌ను ఓడించాలంటే ఉత్తమ స్థాయిలో ఆడాల్సిందే. అదే మాలో లోపించింది. చక్కటి లెంగ్త్‌తో అశ్విన్ అద్భుతంగా రాణిస్తున్నాడు.  నిజంగా ఇక్కడి పిచ్‌లపై అతడిని ఎదుర్కోవడం కష్టమే. ఇక జో రూట్‌కు కెప్టెన్‌ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి       –అలిస్టర్‌ కుక్‌ (ఇంగ్లండ్‌ కెప్టెన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement