మాటతో కాదు... ఆటతో చూపించారు | India vs England: Super Ravi Ashwin wraps up innings victory to secure series win | Sakshi
Sakshi News home page

మాటతో కాదు... ఆటతో చూపించారు

Published Tue, Dec 13 2016 1:20 AM | Last Updated on Thu, Apr 4 2019 5:21 PM

మాటతో కాదు... ఆటతో చూపించారు - Sakshi

మాటతో కాదు... ఆటతో చూపించారు

ప్రతీకారం తీర్చుకున్న భారత్‌  
కసిగా కొట్టిన కోహ్లి
ఇది ఆల్‌రౌండ్‌ విజయం   


ఐదేళ్ల క్రితం భారత జట్టు ఇంగ్లండ్‌ గడ్డపై నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడి 0–4తో చిత్తుగా ఓడింది. మరుసటి ఏడాదే ఇంగ్లండ్, నాలుగు టెస్టుల సిరీస్‌ కోసం భారత్‌కు వచ్చింది. అంతే... ఆటగాళ్లు, మాజీలు, అభిమానులు అంతా సిరీస్‌కు ముందు మాటలతో చెలరేగిపోయారు. ఇది ప్రతీకార సిరీస్, దెబ్బకు దెబ్బ తీస్తాం అన్నట్లుగా వార్తలు, టీవీ ప్రకటనలు కూడా సాగాయి. కానీ ఇక్కడా సీన్‌ రివర్సయింది. భారత్‌లో కూడా ఇంగ్లండ్‌ 2–1తో సిరీస్‌ గెలుచుకొని వెళ్లడంతో అంతా తెల్లమొహాలు వేయాల్సి వచ్చింది.

2014లో భారత్‌ మళ్లీ ఇంగ్లండ్‌ వెళ్లి 1–3తో సిరీస్‌ కోల్పోయింది. ఇప్పుడు రెండేళ్ల తర్వాత అదే జట్టు మన దేశంలో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం అడుగు పెట్టింది. ఈసారి మాటలు లేవు, రెచ్చగొట్టడాలు అసలు కనిపించలేదు. కానీ ఆటలో మాత్రమే మన జట్టు పదును చూపించింది. మరో టెస్టు ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. రెండేళ్ల క్రితం 10 ఇన్నిగ్స్ లలో కలిపి 134 పరుగులు చేసి పరువు పోగొట్టుకున్న కోహ్లి, ఇప్పుడు 7 ఇన్నింగ్స్ లలోనే 640 పరుగులు బాది తానేంటో నిరూపించుకున్నాడు.  

సాక్షి క్రీడా విభాగం
పటిష్ట జట్టు దక్షిణాఫ్రికాను సొంతగడ్డపై గత ఏడాది చిత్తుగా ఓడించినప్పుడే మన టీమ్‌ సత్తా ఏమిటో అందరికీ అర్థమైపోయింది. భారత్‌లో ఆడి భారత్‌ను ఓడించడం అంత సులువు కాదనే సందేశం అన్ని జట్లకూ వెళ్లింది. స్పిన్ ను ఎదుర్కోవడం ఆషామాషీ వ్యవహారం కాదని డివిలియర్స్, ఆమ్లాలాంటి స్టార్లను కూడా అశ్విన్, రవీంద్ర జడేజా ఆటాడుకున్నప్పుడే అనిపించింది. అయితే షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా స్పిన్‌ పిచ్‌లపైనే రాణిస్తారనే అపవాదు కూడా ఆ సిరీస్‌ వెంట తోడుగా వచ్చింది. ఇలాంటి సమయంలో పిచ్‌లతో సంబంధం లేకుండా నంబర్‌వన్ స్థాయి ఆటను ప్రదర్శించేందుకు ఇంగ్లం డ్‌తో సిరీస్‌ అవకాశం కల్పించింది. న్యూజిలాండ్‌ను కూడా క్లీన్ స్వీప్‌ చేసినా... టెస్టుల్లో కివీస్‌ బలహీన జట్టే. పైగా చాలా కాలం తర్వాత ఐదు టెస్టుల సిరీస్‌ ఆడుతుండటంతో దీనిపై ఎంతో ఆసక్తి కనిపించింది. ఇప్పుడు అన్ని రంగాల్లో రాణించిన మన జట్టు సిరీస్‌ సొంతం చేసుకొని 2014 సిరీస్‌కు తిరుగులేని రీతిలో జవాబిచ్చింది. అన్నింటికి మించి ఒక్క పిచ్‌ గురించి విమర్శలు రాకపోవడం చూస్తే ఇది పూర్తిగా మన బలం, బలగంతో సాధించిన విజయమని గర్వంగా చెప్పవచ్చు.

హ్యాట్రిక్‌...
రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ ఆట భారత్‌ను కాస్త ఆందోళనలో పడేసిన మాట వాస్తవం. ఒక దశలో విజయం సంగతేమో కానీ, పరాజయం నుంచి తప్పించుకునేందుకు పోరాడాల్సి వచ్చింది. కానీ విశాఖపట్నం నుంచి భారత్‌ ఆట ఒక్కసారిగా పైకి ఎగసింది. 246 పరుగులతో దక్కిన భారీ గెలుపు సిరీస్‌ రాతను మార్చింది. బ్యాటింగ్‌లో కోహ్లి, పుజారా మెరిస్తే, బౌలింగ్‌లో అశ్విన్‌ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన జయంత్‌ యాదవ్‌ తర్వాతి టెస్టు సమయానికి ఆల్‌రౌండర్‌గా మరింత రాటుదేలాడు. ముగ్గురు స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు అశ్విన్, జడేజా, జయంత్‌ ఈ సిరీస్‌లో భారత్‌ భాగ్యచక్రాన్ని తిప్పడంలో కీలకపాత్ర పోషించారు. షమీ, ఉమేశ్‌ పరిమితంగానే అయినా కీలక దశలో వికెట్లతో అండగా నిలిచారు.

పేస్‌ను ఎదుర్కోవడంలో సమర్థులైన ఇంగ్లండ్‌ను కూడా వారిద్దరు రివర్స్‌ స్వింగ్‌తో కొట్టారు. ఇక సిరీస్‌లో రహానే మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ అంతా తమ పాత్రను సమర్థంగా పోషించారు. అదృష్టం ఏమిటంటే ఏ ఒక్కరు విఫలమైనా, నేనున్నానంటూ మరొకరు ఆ బాధ్యతను తీసుకున్నారు. మురళీ విజయ్‌పై ఉంచిన నమ్మకం ముంబై టెస్టులో కనిపించింది. ఇక కోహ్లి, పుజారా నిలకడగా ఆడగా... లోయర్‌ ఆర్డర్‌ చేసిన పరుగులు మొహాలీ, ముంబై టెస్టుల స్వరూపాన్ని మార్చేశాయి.

కోహ్లి తడాఖా...
రెండేళ్ల క్రితం ఇంగ్లండ్‌ సిరీస్‌లో షమీకంటే కూడా తక్కువ సగటుతో పరుగులు చేశాక కోహ్లి ఇంటా, బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత అతని ఆట ఒక అద్భుతంలా మారిపోయినా... ఇదే ఇంగ్లండ్‌ సిరీస్‌ కోసం అతను కూడా ఎదురు చూశాడు. 40, 49 నాటౌట్, 167, 81, 62, 6 నాటౌట్, 235... సిరీస్‌లో అతను చేసిన పరుగులు. అతని అసాధారణ బ్యాటింగ్‌ నైపుణ్యానికి నాటి కసి కూడా తోడైనట్లుగా కనిపించింది. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా, పిచ్‌ ప్రతికూలంగా మారుతున్నా ఒకే ఒక్కడులా నిలబడి సిరీస్‌ మొత్తం తన ముద్రను చూపించాడు. ఈ క్రమంలో మహామహులను తలదన్నే ఎన్నో రికార్డులను సవరిస్తూ, అధిగమిస్తూ పోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కోహ్లి సిరీస్‌. అటు నాయకుడిగా కూడా అతను రచించిన వ్యూహాలు అద్భుతంగా పని చేయడమే కాదు... తన సహచరులపై అపార విశ్వాపం ఉంచుతూ అతడు నడిపించిన తీరు కూడా అందరినీ కట్టి పడేసింది. సిరీస్‌లో మరో టెస్టు ఉండటంతో అతనెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

ఇంగ్లండ్‌ విషాదం...
ముంబై టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ చూస్తే ఆ జట్టు ఏ మాత్రం సిరీస్‌కు సన్నద్ధమై వచ్చిందో అర్థమవుతోంది. 53 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అలీ నాలుగో స్థానంలో, 180 ఓవర్లు కీపింగ్‌ చేసిన బెయిర్‌ స్టో ఐదో స్థానంలో ఆడేందుకు వస్తే... స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మ¯ŒSగా జట్టులోకి వచ్చిన జోస్‌ బట్లర్‌ ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగాడు. తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌ మినహా ఎక్కడా ఇంగ్లండ్‌ సాధికారికంగా ఆడలేదు. వైజాగ్, మొహాలీ టెస్టులలో కొన్నిసార్లు పట్టు బిగించే అవకాశం వచ్చినా ఆ జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. వాస్తవానికి భారత్‌లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేయడం అంటే కచ్చితంగా ఎంతో కొంత అదనపు ప్రయోజనం ఉంటుంది. కానీ మూడు, నాలుగు టెస్టులలో టాస్‌ గెలిచి కూడా కుక్‌ సేన ఎలాంటి ప్రభావం చూపలేదు.

400 పరుగుల స్కోరు కూడా ఆ జట్టును ఓటమి నుంచి రక్షించలేదు. కుక్, రూట్, స్టోక్స్, బెయిర్‌స్టో కొండొకచో మెరుగైన ఇన్నింగ్స్‌లు ఆడినా అది వారు మ్యాచ్‌ను కాపాడుకునేందుకు సరిపోలేదు. నాణ్యమైన స్పిన్నర్‌ లేకపోవడం కూడా ఇంగ్లండ్‌ అవకాశాలను దెబ్బ తీసింది. 2012లో ఉన్న గ్రేమ్‌ స్వాన్, మాంటీ పనేసర్‌లతో పోలిస్తే ఇక్కడి పిచ్‌లపై బంతిని బాగా తిప్పటం మొయిన్‌ అలీ, రషీద్‌ల వల్ల కాలేదు. సక్లాయిన్‌ సూచనలు కూడా పెద్దగా పనికి రాలేదు. వీరిద్దరు పరుగులు సమర్పించుకోవడంలోనే పోటీ పడ్డారు. కుక్‌ కెప్టెన్సీ వైఫల్యాలు కూడా ఆ జట్టును దెబ్బ తీశాయి. ముంబై టెస్టులో రెండో రోజు అశ్విన్‌ ఆరు వికెట్లు తీస్తే... అదే ఎండ్‌ నుంచి అలీ ఒక్క ఓవర్‌ కూడా బౌలింగ్‌ చేయలేదు!  

ఎదురులేనట్లే...
సొంతగడ్డపై వరుసగా 13 టెస్టుల సీజన్ లో ఇప్పటికి 7 టెస్టులు ముగిశాయి. ఇందులో ఆరింటిలో భారత్‌ విజేతగా నిలిచింది. రానున్న చెన్నై టెస్టు తర్వాత మరో పెద్ద జట్టు ఆస్ట్రేలియా వచ్చే మార్చిలో నాలుగు టెస్టుల కోసం భారత్‌కు రానుంది. 2013లోనే ఆసీస్‌ ఇక్కడ 0–4తో ఘోరంగా ఓడింది. ఇటీవల ఆ జట్టు పరిస్థితి, సొంత మైదానాల్లోనే పరాజయాలు చూస్తే ఇంత తక్కువ వ్యవధిలో వారు కోలుకొని భారత్‌కు పోటీ ఇవ్వగలరనుకోవడం అత్యాశే. కాబట్టి ఆ టీమ్‌తో కూడా ఇదే రికార్డు కొనసాగవచ్చు. అయితే దానికి ముందు ఏకైక టెస్టు కోసం బంగ్లాదేశ్‌ కూడా భారత్‌ రానుంది. కోహ్లి సేన సాగిస్తున్న ఆధిపత్యం, జోరు చూస్తుంటే రాబోయే రోజుల్లో సీజన్‌ ముగిసే సరికి ఎన్ని ఘన విజయాలు జట్టు ఖాతాలో చేరుతాయో, ఎన్ని రికార్డులు గల్లంతవుతాయో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement