తొలి రోజు మనదే! | India vs New Zealand 2016: Virat Kohli century takes India to 267/3 on Day 1 | Sakshi
Sakshi News home page

తొలి రోజు మనదే!

Published Sun, Oct 9 2016 1:21 AM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

తొలి రోజు మనదే!

తొలి రోజు మనదే!

స్వల్పకాలిక వైఫల్యం తర్వాత గత మ్యాచ్‌లోనే తన క్లాస్ చూపించిన విరాట్ కోహ్లి ఇప్పుడు అదే ఫామ్‌ను మరో మ్యాచ్‌కు పొడిగించాడు. విదేశాల్లో అదరగొడుతున్నా... సొంతగడ్డపై 17 ఇన్నింగ్‌‌సలుగా అందని శతకాన్ని ఇప్పుడు సాధించి ఆ వెలితిని దూరం చేసుకున్నాడు. మొదటి రోజే బ్యాటింగ్‌కు ఇబ్బందిగా కనిపించిన పిచ్... మరోవైపు ప్రత్యర్థి బౌలర్లు విసురుతున్న బంతులు అనూహ్యంగా ఇబ్బంది పెడుతున్న స్థితిలో అతను తనలోని అసలు సిసలు టెస్టు బ్యాట్స్‌మన్‌ను బయటకు తెచ్చాడు.
 
 తొలిసారి టెస్టుకు ఆతిథ్యమిచ్చిన చారిత్రక మైదానంలో అపూర్వ ఇన్నింగ్‌‌స ఆడిన విరాట్... రహానే సహకారంతో తన జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. మరోవైపు న్యూజిలాండ్ ఆట మళ్లీ రీప్లేలా కనిపించింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఒక దశలో చక్కటి బౌలింగ్‌తో భారత్‌ను కట్టడి చేయడం, ఆ తర్వాత పట్టు సడలించి కోలుకునే అవకాశం ఇవ్వడం... వెరసి ఆ జట్టు ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా తొలి రోజు ఆట సాగింది. రెండో రోజూ భారత బ్యాట్స్‌మెన్ చెలరేగితే ఇక ఆ జట్టు ఆశలు వదులుకోవాల్సిందే.  
 
 భారత్ 267/3
 విరాట్ కోహ్లి సెంచరీ
 రాణించిన రహానే
 న్యూజిలాండ్‌తో
 మూడో టెస్టు

 
 ఇండోర్: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే దిశగా భారత్ తొలి అడుగును విజయవంతంగా వేసింది. మొదటిసారి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఇక్కడి హోల్క ర్ మైదానంలో అభిమానులకు గుర్తుండిపోయే ఆరంభాన్ని అందించింది. కివీస్‌తో శనివారం ఆరంభమైన మూడో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్‌‌సలో 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (191 బంతుల్లో 103 బ్యాటింగ్: 10 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగాడు. అతని కెరీర్‌లో ఇది 13వ సెంచరీ కాగా... ఈ సిరీస్‌లో ఇరు జట్ల తరఫున ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం. కోహ్లికి అండగా నిలిచిన అజింక్య రహానే (172 బంతుల్లో 79 బ్యాటింగ్: 9 ఫోర్లు, 1 సిక్స్) కూడా సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు అభేద్యంగా 167 పరుగులు జోడించారు. మన మిగతా బ్యాటింగ్ లైనప్ కూడా పటిష్టంగా ఉండటంతో భారత్ రెండో రోజు ఆదివారం భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది.
 
 స్కోరు వివరాలు
 భారతదేశం తొలి ఇన్నింగ్స్ : విజయ్ (సి) లాథమ్ (బి) పటేల్ 10; గంభీర్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 29; పుజారా (బి) సాన్‌ట్నర్ 41; కోహ్లి (బ్యాటింగ్) 103; రహానే (బ్యాటింగ్) 79; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (90 ఓవర్లలో 3 వికెట్లకు) 267.  వికెట్ల పతనం: 1-26; 2-60; 3-100.; బౌలింగ్: బౌల్ట్ 16-2-54-1; హెన్రీ 20-3-65-0; పటేల్ 24-3-65-1; సాన్‌ట్నర్ 19-3-53-1; నీషమ్ 11-1-27-0.
 
 తొలి సెషన్: ఓపెనర్లు విఫలం

 ధావన్ గాయపడటంతో రెండేళ్ల తర్వాత గౌతమ్ గంభీర్‌కు టెస్టు ఆడే అవకాశం దక్కగా... గాయపడిన భువనేశ్వర్ స్థానంలో ఉమేశ్ యాదవ్‌ను ఎంపిక చేశారు. కివీస్ జట్టులో కూడా కెప్టెన్ విలియమ్సన్‌తో పాటు నీషమ్ తుది జట్టులోకి వచ్చారు. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా సిరీస్ మొదలు ఇప్పటివరకు ఆడిన 7 టెస్టులలోనూ కోహ్లి టాస్ గెలవడం విశేషం.

 ఇన్నింగ్‌‌స ఆరంభంలోనే హెన్రీ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది గంభీర్ (53 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడు ప్రదర్శించాడు. కానీ ఐదో ఓవర్లోనే స్పిన్నర్‌ను బౌలింగ్‌కు దింపి కివీస్ ఫలితం సాధించింది. జీతన్ పటేల్ తన తొలి ఓవర్లోనే విజయ్ (10)ను అవుట్ చేయడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ స్థితిలో గంభీర్, పుజారా మరో 15 ఓవర్ల పాటు జాగ్రత్తగా ఆడి 34 పరుగులు జోడించారు. అయితే తనకు దక్కిన అవకాశాన్ని గంభీర్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయాడు. క్రీజ్‌లో నిలదొక్కకున్న తర్వాత కూడా అతను పరుగులు చేయడంలో తడబడ్డాడు. చివరకు బౌల్ట్ వేసిన చక్కటి బంతికి గంభీర్ వికెట్ల ముందు దొరికిపోయాడు.
 ఓవర్లు: 26, పరుగులు: 75, వికెట్లు: 2
 
 రెండో సెషన్: కట్టడి చేసిన బౌలర్లు
 లంచ్ తర్వాత కివీస్ బౌలింగ్ మరింత పదునెక్కింది. ఒకవైపు పిచ్ కూడా అనుకూలిస్తుండగా స్పిన్నర్లు సాన్‌ట్నర్, పటేల్ మంచి టర్నింగ్ రాబట్టారు. దాంతో అప్పటి వరకు చక్కగా ఆడుతూ వచ్చిన పుజారా (108 బంతుల్లో 41; 6 ఫోర్లు) కూడా ఏకాగ్రత కోల్పోయాడు. సాన్‌ట్నర్ బౌలింగ్‌లో అతను బౌల్డ్ కావడంతో సరిగ్గా 100 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ఈ స్థితిలో కోహ్లి, రహానే జత కలిశారు. వీరిద్దరు చాలా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్‌‌సను చక్కదిద్దే ప్రయత్నంలో చేశారు. గత రెండు టెస్టులలో తాను వెనుదిరిగేందుకు కారణమైన షాట్లకు దూరంగా ఈ సారి కోహ్లి నియంత్రణతో ఆడాడు. అయితే కివీస్ పేసర్లు కూడా కొద్దిసేపు బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. హెన్రీ, నీషమ్ విసిరిన బంతులు రహానే శరీరాన్ని బలంగా తాకినా అతను పట్టుదల ప్రదర్శించాడు. కివీస్ ఫీల్డర్ల ఏమరుపాటుతో కోహ్లి, రహానే ఒక్కోసారి అవుటయ్యే ప్రమాదం నుంచి కూడా తప్పించుకున్నారు. కొన్ని ఉత్కంఠభరిత క్షణాలు ఎదురైనా మన బ్యాట్స్‌మెన్ ప్రమాదం లేకుండా సెషన్‌ను ముగించారు.
 ఓవర్లు: 30, పరుగులు: 73, వికెట్లు: 1
 
 మూడో సెషన్: తిరుగులేని బ్యాటింగ్
 విరామం తర్వాత మాత్రం భారత బ్యాట్స్‌మెన్ తమదైన శైలిలో దూసుకుపోయారు. స్వేచ్ఛగా బ్యాట్‌ను ఝళిపించారు. ఈ క్రమంలో ముందుగా 108 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత పటేల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో 123 బంతుల్లో రహానే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. శతథా ప్రయత్నించినా ఈ జోడీని విడదీయడంలో కివీస్ బౌలర్లు విఫలం కావడంతో సరిగ్గా 80 ఓవర్లకే ఆ జట్టు కొత్త బంతిని తీసుకుంది. కానీ అది కూడా ప్రభావం చూపించలేకపోయింది. హెన్రీ వేసిన 85వ ఓవర్లో బంతిని పాయింట్ దిశగా నెట్టిన కోహ్లి సింగిల్‌కు ప్రయత్నించాడు. అయితే ఫీల్డర్ విసిరిన త్రో నేరుగా స్టంప్స్‌ను తాకింది. డైవ్ చేస్తూ క్రీజ్‌లోకి చేరిన కోహ్లి ఒక వైపు నమ్మకంతో ఉండగా, మరో వైపు కివీస్ కూడా వికెట్ దక్కిందని సంబరపడింది. రీప్లేలో అది నాటౌట్ అని తేలడంతో కోహ్లి సెంచరీ పూర్తయింది. దాంతో కెప్టెన్ తన సహచరుల వైపు చూస్తూ విజయగర్వం ప్రదర్శించాడు. తొలి రెండు సెషన్లలో భారత్ ఇన్నింగ్‌‌స నెమ్మదిగా సాగినా... చివరి సెషన్లో వేగంగా పరుగులు వచ్చాయి.
 ఓవర్లు: 34, పరుగులు: 119, వికెట్లు: 0
 
 నా స్ట్రరుుక్ రేట్‌పై విమర్శలు అర్థరహితం. టెస్టుల్లో స్ట్రరుుక్ రేట్ ముఖ్యం కాదు. ఇలాంటి వికెట్‌పై ఎవరూ 70-80 స్ట్రరుుక్ రేట్‌తో పరుగులు చేయలేరు. టీం మేనేజ్‌మెంట్ అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం ప్రధానం. పరిస్థితులకు అనుగుణంగా, జట్టు అవసరాలకు తగినట్లుగా ఆడాలి. కోహ్లి, రహానే చాలా బాగా ఆడారు. వీరిద్దరు ఇదే జోరును రెండో రోజూ కొనసాగించాలి. సాధ్యమైనంత ఎక్కువసేపు బ్యాటింగ్ చేసి కనీసం 400 పరుగులు చేయాలని భావిస్తున్నాం. పిచ్ ఇలాగే ఉంటే మన అశ్విన్ చెలరేగిపోగలడు.             
-పుజారా
 
 కెప్టెన్‌గా కోహ్లికిది ఆరో సెంచరీ. 2003 తర్వాత భారత కెప్టెన్ ఒకరు కివీస్‌పై శతకం సాధించడం ఇదే తొలిసారి.
 
 2000  రహానే టెస్టుల్లో రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement