జోరు కొనసాగాలి... | India Vs New Zealand Second T20 At Auckland | Sakshi
Sakshi News home page

జోరు కొనసాగాలి...

Published Sun, Jan 26 2020 2:07 AM | Last Updated on Sun, Jan 26 2020 2:07 AM

India Vs New Zealand Second T20 At Auckland - Sakshi

మైదానం ఎలాంటిదైనా, బౌండరీలు ఎంత చిన్నవైనా టి20ల్లో 200కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువు కాదు. అయితే భారత జట్టు దానిని అలవోకగా చేసి చూపించింది. సొంత మైదానంలో ప్రత్యర్థి ముందు భారీ స్కోరు చేశామనే ఆనందం కివీస్‌కు తొలి మ్యాచ్‌లో మిగల్లేదు.

ఛేజింగ్‌లో కోహ్లి సేన సత్తా ఏమిటో అందరికీ అర్థమైంది. బ్యాటింగ్‌లో భారత్, న్యూజిలాండ్‌ సమ ఉజ్జీలుగా కనిపించినా మన పదునైన బౌలింగ్‌ ఇరు జట్ల మధ్య ప్రధాన తేడాగా కనిపించింది. ఇప్పుడు అదే బలంతో టీమిండియా మరో విజయాన్ని అందుకోవాలని పట్టుదలగా ఉంది. అదే ఈడెన్‌ పార్క్‌ గ్రౌండ్‌లో రెండో మ్యాచ్‌లోనైనా కివీస్‌ పోటీనిస్తుందా చూడాలి.  

ఆక్లాండ్‌: భారత జట్టు ఇటీవల ఫామ్‌ న్యూజిలాండ్‌ పర్యటనలో తొలి టి20లో కనిపించింది. ఎంతటి భారీ స్కోరునైనా ఛేదించగలమని నిరూపిస్తూ మన జట్టు విజయంతో సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇప్పుడు అదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌ జరిగిన మైదానంలో భారత్, న్యూజిలాండ్‌ నేడు రెండో టి20లో తలపడనున్నాయి. మళ్లీ మ్యా చ్‌ గెలిస్తే సిరీస్‌లో టీమిండియాకు తిరుగుండకపోవచ్చు.  

ఒక మార్పుతో...
అద్భుత విజయం అందుకున్న తుది జట్టులో తుది సాధారణంగా మార్పులు చేయడానికి కెపె్టన్‌ కోహ్లి ఇష్ట పడడు. అయితే గత మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న పేసర్‌ శార్దుల్‌ ఠాకూర్‌కు బదులుగా నవదీప్‌ సైనీకి అవకాశం దక్కవచ్చు. ఇది మినహా మరో మార్పు లేకుండా జట్టు బరిలోకి దిగనుంది. తొలి టి20లో రోహిత్‌ విఫలమైనా అతని స్థాయి ఇన్నింగ్స్‌ ఆడేందుకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. రాహుల్‌ గురించి ఇటీవల ఎంత చెప్పినా తక్కువే. అంతర్జాతీయ క్రికెట్‌లో అతని నిలకడైన ప్రదర్శన భారత్‌ విజయాల్లో కీలకంగా మారింది. ఎప్పటిలాగే కోహ్లి కూడా తనదైన శైలిలో చెలరేగిపోగలడు. అయితే తొలి టి20లో చెప్పుకోదగ్గ అంశం శ్రేయస్‌ అయ్యర్‌ దూకుడైన బ్యాటింగ్‌.

ఇప్పుడిప్పుడే టీమ్‌లో కుదురుకుంటున్న అతను చక్కటి ఇన్నింగ్స్‌తో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. అదే జోరు అతను మళ్లీ కొనసాగించాల్సి ఉంది. శివమ్‌ దూబే ఆల్‌రౌండర్‌గా తన విలువ చూపించగా, జడేజా కూడా ఆకట్టుకున్నాడు. భారీ స్కోర్ల మ్యాచ్‌లో బుమ్రా ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ దూసుకుపోతున్న సమయంలో నేనున్నానంటూ చివరి రెండు ఓవర్లలో అతను కివీస్‌ను కట్టడి చేసిన తీరు మ్యాచ్‌ ఫలితాన్ని ప్రభావితం చేసింది. సీనియర్‌ షమీ తన బౌలింగ్‌పై మరింత నియంత్రణ ఉంచాల్సి ఉంది. మొత్తంగా చూస్తే మరోసారి భారత్‌దే ఆధిపత్యం కనిపిస్తోంది.  

కివీస్‌ కోలుకునేనా...
తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు చేసిన తర్వాత కూడా ఓడిపోవడం న్యూజిలాండ్‌ను నిరాశపర్చింది. అయితే ఈ పరాజయానికి జట్టులో ఏ ఒక్కరూ బాధ్యులు కాదు కాబట్టి మార్పుల్లేకుండానే ఆ జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోసారి ఓపెనర్లు మన్రో, గప్టిల్‌లనుంచి కివీస్‌ శుభారంభం ఆశిస్తోంది. అయితే ఈడెన్‌ పార్క్‌ బౌండరీ పరిమితుల దృష్ట్యా వీరిద్దరు దాదాపు 200 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేస్తే గానీ సరిపోయేలా లేదు.

విలియమ్సన్‌ మాత్రం అదే స్థాయిలో బ్యాటింగ్‌ ప్రదర్శనతో తన సత్తా చూపించాడు.తొలి మ్యాచ్‌లో విఫలమైన గ్రాండ్‌హోమ్‌నుంచి టీమ్‌ మెరుగైన ఇన్నింగ్స్‌ను ఆశిస్తోంది. గత మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసిన టేలర్‌పై మళ్లీ కీలక బాధ్యత ఉంది. గాయాల కారణంగా సీనియర్లు సిరీస్‌కు దూరం కావడంతో శుక్రవారం కివీస్‌ బౌలింగ్‌ గత మ్యాచ్‌లో బాగా బలహీనంగా కనిపించింది. బెన్నెట్, టిక్‌నర్‌ మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంది. అనుభవజు్ఞడైన సౌతీ, సాన్‌ట్నర్‌ రాణించడం కూడా కీలకం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement