పుణె : దక్షిణాఫ్రికాతో పుణెలో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజూ టీమిండియా జోరు కొనసాగుతోంది. అద్భుత బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమిండియా మరోమారు సత్తా చాటింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 108, చతేశ్వర్ పుజారా 58, కెప్టెన్ విరాట్ కోహ్లి 254 నాటౌట్, అజింక్య రహానే 59 కు తోడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 91 రెచ్చిపోవడంతో భారత్ 601 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 273/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లి సేన ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల వరద పారించింది. తొలిరోజు 73 బంతుల్లో 27 పరుగులే చేసిన కోహ్లి రెండోరోజు జూలు విదిల్చాడు. రెండో రోజు ఏకంగా 227 సాధించి ఔరా అనిపించాడు.
(చదవండి : కోహ్లి ‘డబుల్ సెంచరీ’ల రికార్డులు)
ఇకనాలుగో వికెట్‌గా రహానే ఔటైన అనంతరం క్రీజులోకొచ్చిన జడేజా వన్డే మ్యాచ్‌ను తలపించేలా బ్యాట్ ఝళిపించాడు. 104 బంతుల్లోనే 91 పరుగులు సాధించాడు. అయితే, సెంచరీకి చేరువైన జడేజా ఐదో వికెట్‌గా డీ బ్రూయిన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. అతను ఔటైన అనంతరం ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు కోహ్లి ప్రకటించాడు. ఇక 254 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లికి ఇది 26వ టెస్టు సెంచరీ కాగా.. సారథిగా 19వది కావడం విశేషం. ఇక ఈ టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడిగా కోహ్లి- రహానేలు సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు నాలుగో వికెట్‌కు అత్యధిక పరుగులు(145) చేసిన జోడిగా ద్రవిడ్-గంగూలీ పేరిట ఉన్న రికార్డును తాజాగా కోహ్లి-రహానేలు బ్రేక్ చేశారు.
(చదవండి : నోరు పారేసుకున్న రబడ.. సర్దిచెప్పిన కెప్టెన్..!)
త్వరత్వరగా రెండు వికెట్లు ఢమాల్..!
తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టిన సఫారీ జట్టును పేసర్ ఉమేష్ యాదవ్ దెబ్బ తీశాడు. తొలిటెస్టులో స్థానం దక్కించుకోలేకపోయిన ఉమేష్ రెండో టెస్టులో రాణిస్తున్నాడు. జట్టు స్కోరు రెండు పరుగుల వద్ద అయిడెన్ మార్కరమ్ (0), 13 పరుగుల వద్ద డీన్ ఎల్గర్ (6)ను పెవిలిన్ పంపి పర్యాటక జట్టు వెన్నులో వణుకు పుట్టించాడు. ఇక బవుమా (8)ను మూడో వికెట్‌గా షమీ తన ఖాతాలో వేసుకున్నాడు. సఫారీ జట్టు 15 ఓవర్లకు 36/3 గా ఉన్న సమయంలో రెండో రోజు ఆట ముగిసింది. డి బ్రూయిన్ (20), నూర్జె (2) క్రీజులో ఉన్నారు. దక్షిణాష్రికా 565 పరుగులు వెనుకబడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment