కొత్త ఏడాది టి20 పరుగుల వానతో మొదలు అవుతుందనుకుంటే అసలు వర్షం ఆ ఆశలను తుడిచి పెట్టేసింది. దాంతో మూడు మ్యాచ్‌ల పొట్టి పోరు రెండు మ్యాచ్‌ల సిరీస్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆధిక్యంలో నిలిచేందుకు భారత్, శ్రీలంక సిద్ధమయ్యాయి. తొలి మ్యాచ్ గెలిస్తే ఇక సిరీస్ కోల్పోయే అవకాశం ఉండదు కాబట్టి బోణీ కోసం ఇరు జట్లు సై అంటున్నాయి. గువాహటితో పోలిస్తే ఇండోర్‌లో మెరుగైన వాతావరణం ఉండటం అభిమానులకు ఊరటనిచ్చే అంశం.
ఇండోర్: వరుసగా నాలుగో ఏడాది దేశంలో ‘స్వచ్ఛమైన నగరం’గా గుర్తింపు పొందిన వేదికపై క్రికెట్ సమరానికి భారత్, శ్రీలంక సన్నద్ధమయ్యాయి. టి20 సిరీస్‌లో భాగంగా నేడు ఇక్కడి హోల్కర్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతుంది. తొలి మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండా రద్దు కావడంతో తుది జట్లలో ఎలాంటి మార్పు లేకుండానే రెండు టీమ్‌లు కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది.
ధావన్ ఆటపైనే...
రోహిత్ శర్మకు సహచరుడిగా ఇటీవల రాహుల్ రెండో ఓపెనర్ పాత్రలో అద్భుతంగా ఆడుతున్నాడు. అతను చెలరేగుతున్న తీరును బట్టి చూస్తే పక్కన పెట్టే అవకాశమే లేదు. దాంతో సీనియర్ శిఖర్ ధావన్ కెరీర్‌కు సంకటం ఎదురైంది. రోహిత్ విశ్రాంతితో ఈ సిరీస్‌లో ధావన్ అవకాశం దక్కించుకున్నాడు. తనలో ఇంకా టి20 సత్తా ఉందని అతను నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో నిలిచాడు. ధావన్ ఇక ఈ ఫార్మాట్‌కు పనికి రాడంటూ మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ సహా పలువురి నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో... ధావన్ తన పూర్తి సత్తాను ప్రదర్శించాల్సిందే.
కోహ్లి, అయ్యర్, పంత్, దూబేలతో దుర్బేధ్యంగా కనిపిస్తున్న భారత బ్యాటింగ్ గురించి ఏ రకమైన ఆందోళన అవసరం లేదు. గువాహటి మ్యాచ్‌కు ప్రకటించిన తుది జట్టులో మార్పులు చేయడానికి కోహ్లి ఇష్టపడకపోవచ్చు. కాబట్టి బుమ్రా, శార్దుల్, సైనీ రూపంలో ముగ్గురు రెగ్యులర్ పేసర్లూ ఆడే అవకాశం ఉంది.
మలింగ ఆపగలడా!
ఎక్కువ మంది యువ, అనుభవం లేని ఆటగాళ్లతోనే ఉన్న శ్రీలంక జట్టు భారత్‌తో పోలిస్తే బలహీనంగానే కనిపిస్తోంది. కుశాల్ పెరీరా మినహా మిగతా బ్యాట్స్‌మెన్ టీమిండియాను ఎక్కువగా ఎదుర్కొన్నది లేదు. అవిష్క ఫెర్నాండో, గుణతిలక లాంటి ఓపెనర్లు బుమ్రాను ఏ మాత్రం ఎదుర్కోగలరో చూడాలి. ఒషాడా ఫెర్నాండో, రాజపక్స ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది ఆసక్తికరం. అయితే ఇలాంటి స్థితిలోనూ లంక తమ కెప్టెన్, సీనియర్ మలింగపైనే ఆశలు పెట్టుకుంది.
భారత్‌పై రికార్డు అంత గొప్పగా లేకపోయినా ఒక స్పెల్‌లో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సామర్థ్యం అతని సొంతం. మలింగ కెప్టెన్సీలో గత పది మ్యాచ్‌లలో శ్రీలంక ఒకటే గెలిస్తే దానికి ఆ మ్యాచ్‌లో అతని నాలుగు వికెట్ల ప్రదర్శనే కారణం. 2008 తర్వాత భారత్‌పై మూడు ఫార్మాట్‌లలో ఏ ద్వైపాక్షిక సిరీస్‌ను నెగ్గని శ్రీలంక... ఈ మ్యాచ్‌లో గెలిస్తే కనీసం సిరీస్ చేజార్చుకునే ప్రమాదం నుంచి తప్పుకుంటుంది.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, అయ్యర్, పంత్, శివమ్ దూబే, సుందర్, శార్దుల్, కుల్దీప్, బుమ్రా, సైనీ.
శ్రీలంక: మలింగ (కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, గుణతిలక, కుశాల్ పెరీరా, ఒషాడా ఫెర్నాండో, భానుక రాజపక్స, ధనంజయ డి సిల్వ, షనక, ఉడాన, హసరంగ, లాహిరు.
పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. చిన్న మైదానం కూడా. భారీ స్కోరుకు అవకాశం ఉంది. సెహ్వాగ్ డబుల్ సెంచరీ చేసిన మ్యాచ్ సహా వన్డేల్లో ప్రతీసారి భారీ స్కోర్లే నమోదయ్యాయి. హోల్కర్ స్టేడియంలో ఒకే ఒక టి20 మ్యాచ్ సరిగ్గా రెండేళ్ల క్రితం భారత్, శ్రీలంక మధ్య జరిగింది. రోహిత్ (118) సెంచరీ చేసిన నాటి మ్యాచ్‌లో భారత్ 88 పరుగుల భారీ తేడాతో లంకను చిత్తుగా ఓడించింది. మ్యాచ్ రోజు వర్షం కురిసే అవకాశం లేదని స్థానిక వాతావరణ శాఖ సమాచారం. మంచు ప్రభావం కనిపించకుండా ప్రత్యేక తరహా రసాయనాన్ని నిర్వాహకులు వాడనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment