
నయా చరిత్ర
ఆసీస్ గడ్డపై తొలిసారి సిరీస్ గెలిచిన భారత మహిళల జట్టు
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా గడ్డపై... భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. అద్భుతమైన ఆటతీరుతో పటిష్టమైన కంగారూలకు చెక్ పెట్టి తొలిసారి టి20 సిరీస్ (2-0)ను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లోనూ 10 వికెట్ల తేడాతో ఆసీస్‌ను ఓడించి ఈ ఘనత సాధించింది. మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో 18 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 18 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులు చేసింది. లాన్నింగ్ (39 బంతుల్లో 49; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. జొనాసేన్ (26 బంతుల్లో 27; 1 సిక్స్), బ్లాక్‌వెల్ (12) మోస్తరుగా ఆడారు.
భారత బౌలర్ల ధాటికి ఆసీస్ 5 ఓవర్లలో 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా... లాన్నింగ్, జొనాసేన్‌లు నాలుగో వికెట్‌కు 70 పరుగులు జోడించి ఆదుకున్నారు. జులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 9.1 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 69 పరుగులు చేసి నెగ్గింది. మిథాలీ రాజ్ (32 బంతుల్లో 37 నాటౌట్; 6 ఫోర్లు), మందన (24 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) నిలకడగా ఆడారు.
టీమిండియా స్కోరు 7.5 ఓవర్లలో 52 పరుగులు ఉన్న దశలో వర్షం పడటంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం లక్ష్యాన్ని 10 ఓవర్లలో 66 పరుగులుగా సవరించారు. దీంతో 12 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన దశలో మిథాలీ రెండు, మందన ఓ ఫోర్‌తో జట్టును గెలిపించారు. ఇరుజట్ల మధ్య మూడో టి20 సిడ్నీలో ఆదివారం జరుగుతుంది. గోస్వామికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
స్కోరు వివరాలు:-
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: మూనీ (సి) పాటిల్ (బి) గోస్వామి 10; హారిస్ (బి) గోస్వామి 0; లాన్నింగ్ రనౌట్ 49; పెర్రీ రనౌట్ 4; జొనాసేన్ (సి) కృష్ణమూర్తి (బి) కౌర్ 27; హీలే (సి) మిథాలీ రాజ్ (బి) పూనమ్ 1; బ్లాక్‌వెల్ నాటౌట్ 12; కోయ్‌టి (సి) పాండే (బి) గైక్వాడ్ 3; ఫర్రెల్ (స్టంప్) వర్మ (బి) గైక్వాడ్ 0; చీట్లి నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 18 ఓవర్లలో 8 వికెట్లకు) 125.
వికెట్ల పతనం: 1-1; 2-28; 3-33; 4-103; 5-105; 6-106; 7-112; 8-113.
బౌలింగ్: గోస్వామి 4-0-16-2; పాండే 1-0-12-0; నిరంజన 3-0-23-0; అనుజా పాటిల్ 3-0-20-0; గైక్వాడ్ 4-0-27-2; పూనమ్ యాదవ్ 2-0-17-1; హర్మన్‌ప్రీత్ కౌర్ 1-0-2-1.
భారత్ ఇన్నింగ్స్: మిథాలీ రాజ్ నాటౌట్ 37; మందన నాటౌట్ 22; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (9.1 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా) 69.
బౌలింగ్: జొనాసేన్ 2-1-7-0; ఫర్రెల్ 2-0-17-0; చీట్లి 2-0-9-0; ఫెర్లింగ్ 2-0-16-0; కోయ్‌టి 1-0-12-0; పెర్రీ 0.1-0-4-0.
2-0తో టి20 సిరీస్ సొంతం