
శివరాత్రి పర్వదినాన క్రీడాభిమానులను సంతోషంలో ముంచెత్తుతూ టీమిండియా చారిత్రక విజయాన్ని సాధించింది. సఫారీ గడ్డపై భారత్ పాతికేళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలితాన్ని అందించింది. గతంలో ఆరు సార్లు పర్యటించినా ఒక్క వన్డే సిరీస్‌లో కూడా విజేతగా నిలవలేకపోయిన టీమిండియా ఈసారి కోహ్లి నేతృత్వంలో సగర్వంగా నిలిచింది. తొలిసారి వన్డే సిరీస్‌ను గెలుచుకొని సత్తా చాటింది. రెండేళ్ల క్రితం సొంతగడ్డపై ఎదురైన వన్డే సిరీస్ పరాజయానికి కూడా సరైన రీతిలో ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇరు జట్ల మధ్య చివరి వన్డే శుక్రవారం (ఫిబ్రవరి 16న) సెంచూరియన్‌లో జరుగనుంది.
పోర్ట్ ఎలిజబెత్: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు వన్డేల్లో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చింది. ఆరు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 4–1తో గెలుచుకుంది. మంగళవారం జరిగిన ఐదో వన్డేలో భారత్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (126 బంతుల్లో 115; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) వన్డే కెరీర్‌లో 17వ సెంచరీతో సత్తా చాటాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇన్‌గిడి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం దక్షిణాఫ్రికా 42.2 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. హషీం ఆమ్లా (92 బంతుల్లో 71; 5 ఫోర్లు) ఒక్కడే పోరాడగలిగాడు. సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని పటిష్టం చేసుకుంది.
రెండు రనౌట్‌లు...
మోర్కెల్ వేసిన తొలి ఓవర్ మెయిడిన్‌తో భారత్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. అయితే ఆ తర్వాత శిఖర్ ధావన్ (23 బంతుల్లో 34; 8 ఫోర్లు) దూకుడు ప్రదర్శించాడు. రబడ బౌలింగ్‌లోనే ధావన్ ఔట్ కావడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ మరో ఎండ్‌లో పట్టుదలగా ఆడే ప్రయత్నం చేయగా... ఫామ్‌లో ఉన్న కోహ్లి (54 బంతుల్లో 36; 2 ఫోర్లు) మాత్రం కొంత తడబాటుకు లోనయ్యాడు. రెండో వికెట్‌కు 105 పరుగులు జోడించిన తర్వాత సమన్వయ లోపం కోహ్లి రనౌట్‌కు కారణమైంది. మోర్కెల్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడిన రోహిత్ సింగిల్ కోసం ముందుకు వచ్చే ప్రయత్నం చేసి ఆగిపోయాడు. అయితే మరోవైపు నుంచి కోహ్లి సగం పిచ్ దాటి దూసుకొచ్చేశాడు. వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసినా అప్పటికే డుమిని డైరెక్ట్ త్రో నాన్ స్ట్రైకింగ్ వికెట్లకు తాకింది. మరి కొద్ది సేపటికే రహానే (8) కూడా దాదాపు ఇదే తరహాలో అవుటయ్యాడు.
తగ్గిన జోరు...
రోహిత్ 92 పరుగుల వద్ద ఉన్నప్పుడు కీపర్ క్యాచ్ కోసం దక్షిణాఫ్రికా రివ్యూ చేయగా బంతి బ్యాట్‌కు తగల్లేదని తేలింది. తర్వాతి ఓవర్లో ఫోర్‌తో 96కు చేరుకున్న రోహిత్‌కు మళ్లీ అదృష్టం కలిసొచ్చింది. రబడ బౌలింగ్‌లో రోహిత్ అప్పర్‌కట్ ఆడగా బౌండరీ వద్ద నేరుగా చేతుల్లోకి వచ్చిన సునాయాస క్యాచ్‌ను షమ్సీ వదిలేశాడు. అనంతరం షమ్సీ బౌలింగ్‌లోనే బ్యాక్‌వర్డ్ స్క్వేర్‌లెగ్ దిశగా రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ సాంత్వన పొందాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ (37 బంతుల్లో 30; 2 ఫోర్లు) చక్కటి సహకారం అందించడంతో నాలుగో వికెట్‌కు 60 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదైంది. 40 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 219 పరుగులకు చేరింది. అయితే ఆపై వేగంగా పరుగులు తీయడంలో జట్టు విఫలమైంది. ముఖ్యంగా 42–45 మధ్య నాలుగు ఓవర్లలో 10 పరుగులు మాత్రమే చేసిన భారత్ 3 వికెట్లు కోల్పోయింది. ఆఖరి పది ఓవర్లలో భారత్ 55 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఆమ్లా మినహా...
లక్ష్య ఛేదనలో ఓపెనర్లు ఆమ్లా, మార్క్‌రమ్ (32 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్) 52 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే 13 పరుగుల వ్యవధిలో మార్క్‌రమ్‌తో పాటు డుమిని (1), డివిలియర్స్ (6) వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఈ దశలో ఆమ్లా, మిల్లర్ (51 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 62 పరుగులు జత చేసి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే భారత బౌలర్లు కట్టడి చేయడంతో పరుగులు రావడం తగ్గిపోయి సఫారీలపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో ఐదో వికెట్ రూపంలో ఆమ్లా రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో దక్షిణాఫ్రికా మ్యాచ్‌పై ఆశలు కోల్పోయింది. ఇన్నింగ్స్ 42వ ఓవర్లో కుల్దీప్ మూడు వికెట్లు తీసి భారత్‌ను గెలుపునకు చేరువ చేయగా... మరో మూడు బంతులకే దక్షిణాఫ్రికా ఆలౌటైంది.
► ద్వైపాక్షిక సిరీస్‌లో భారత తరఫున ఇద్దరు స్పిన్నర్లు 30 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన ఐదు వన్డేల్లో కుల్దీప్‌కు 16 వికెట్లు, చహల్‌కు 14 వికెట్లు లభించాయి. 2006లో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన ఆరు వన్డేల సిరీస్‌లో భారత స్పిన్నర్లు అత్యధికంగా 27 వికెట్లు తీశారు.
►దక్షిణాఫ్రికాపై ఓ సిరీస్‌లో భారత్ తరఫున 300 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కోహ్లి, ధావన్ గుర్తింపు పొందారు. గతంలో గంగూలీ అత్యధికంగా 285 పరుగులు చేశాడు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: ధావన్ (సి) ఫెలుక్‌వాయో (బి) రబడ 34; రోహిత్ (సి) క్లాసెన్ (బి) ఇన్‌గిడి 115; కోహ్లి (రనౌట్) 36; రహానే (రనౌట్) 8; అయ్యర్ (సి) క్లాసెన్ (బి) ఇన్‌గిడి 30; పాండ్యా (సి) క్లాసెన్ (బి) ఇన్‌గిడి 0; ధోని (సి) మార్క్‌రమ్ (బి) ఇన్‌గిడి 13; భువనేశ్వర్ (నాటౌట్) 19; కుల్దీప్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 274.
వికెట్ల పతనం: 1–48; 2–153; 3–176; 4–236; 5–236; 6–238, 7–265.
బౌలింగ్: మోర్కెల్ 10–2– 44–0; రబడ 9–0–58–1; ఇన్‌గిడి 9–1–51–4; ఫెలుక్‌వాయో 8–0–34–0; డుమిని 4–0–29–0; షమ్సీ 10–0–48–0.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా (రనౌట్) 71; మార్క్‌రమ్ (సి) కోహ్లి (బి) బుమ్రా 32; డుమిని (సి) రోహిత్ (బి) పాండ్యా 1; డివిలియర్స్ (సి) ధోని (బి) పాండ్యా 6; మిల్లర్ (బి) చహల్ 36; క్లాసెన్ (స్టంప్డ్) ధోని (బి) కుల్దీప్ 39; ఫెలుక్‌వాయో (బి) కుల్దీప్ 0; రబడ (సి) చహల్ (బి) కుల్దీప్ 3; మోర్కెల్ (ఎల్బీ) (బి) చహల్ 1; షమ్సీ (సి) పాండ్యా (బి) కుల్దీప్ 0; ఇన్‌గిడి (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (42.2 ఓవర్లలో ఆలౌట్) 201.
వికెట్ల పతనం: 1–52; 2–55; 3–65; 4–127; 5–166; 6–168; 7–196; 8–197; 9–197; 10–201.
బౌలింగ్: భువనేశ్వర్ 7–0–43–0; బుమ్రా 7–0–22–1; పాండ్యా 9–0–30–2; కుల్దీప్ 10–0–57–4; చహల్ 9.2–0–43–2.