వెల్లింగ్టన్ : న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన చివరి వన్డేలో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో 4-1తో సిరీస్ నెగ్గి 52 ఏళ్లుగా సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకుంది. 1967 నుంచి కివీస్ పర్యటనకు వెళుతున్న టీమిండియా ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే 3-1 తేడాతో సిరీస్ విజయాన్ని (2008-09 పర్యటనలో) అందుకుంది. తాజాగా 4-1తో అతిపెద్ద సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుని నయా చరిత్రను సృష్టించింది. చివరి మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో సమిష్టిగా రాణించి విజయాన్నందుకున్న రోహిత్ సేన నాలుగో వన్డే పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను హైదరాబాదీ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు (90: 113 బంతులు, 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ (45: 64 బంతులు, 4 ఫోర్లు)లు అద్భుత భాగస్వామ్యంతో ఆదుకున్నారు. చివర్లో కేదార్ జాదవ్ (34: 45 బంతుల్లో, 3ఫోర్లు), పాండ్యా (45: 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు)లు రాణించడంతో భారత్ ఆతిథ్య జట్టుకు 253 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.
అనంతరం ఈ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన కివీస్ 217 పరుగులకు కుప్పకూలింది. దీంతో రోహిత్ సేన 35 బంతులు మిగిలి ఉండగానే 35 పరుగులతో విజయం సాధించింది. అంతకు ముందు లక్ష్యఛేదనకు దిగిన కివీస్‌ను షమీ దెబ్బతీశాడు. ఓపెనర్లు హెన్రీ నికోల్స్(8), కొలిన్ మున్రోలను పెవిలియన్‌కు చేర్చాడు. ఆ మరుసటి ఓవర్లోనే రాస్ టేలర్‌ను పాండ్యా ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. ఈ క్రమంలో లాథమ్, విలియమ్సన్‌లు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. క్రీజులో పాతుకుపోతూ ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని పార్ట్‌టైమ్ బౌలర్ కేదార్ జాదవ్ విడగొట్టాడు. కెప్టెన్ విలియమ్సన్(39)ను క్యాచ్‌ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దీంతో ఐదో వికెట్‌కు నమోదైన 67 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరికొద్ది సేపటికే లాథమ్(37), గ్రాండ్‌హోమ్(11)లను చహల్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. మరో 41 పరుగుల అనంతరం నీషమ్(44) రనౌట్‌గా వెనుదిరిగాడు. చివర్లో సాట్నర్(22), అశ్లే(10), బోల్ట్(1)ల వికెట్లు కూడా త్వరగా కోల్పోవడంతో కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో చహల్‌కు మూడు, పాండ్యా, షమీలకు రెండు వికెట్లు పడగా.. భువన్వేశర్, జాదవ్‌లకు తలో వికెట్ దక్కింది.
గట్టెక్కించిన రాయుడు-శంకర్
భారత ఇన్నింగ్స్‌లో కివీస్ పేసర్ ద్వయం హెన్రీ, బౌల్ట్‌లు పదునైన బంతులతో చెలరేగడంతో భారత టాప్-4 బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ(2), శిఖర్ ధావన్ (6), శుభ్‌మన్ గిల్(7), ఎంఎస్ ధోని(1)లు స్వల్పస్కోర్లకే పెవిలియన్ క్యూ కట్టారు. దీంతో భారత్ 18 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట పరిస్థితిలో అంబటి రాయుడు- విజయ్ శంకర్ భారత ఇన్నింగ్స్‌ను గట్టెక్కించారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీకి చేరువైన విజయ్ శంకర్(45: 64 బంతులు, 4 ఫోర్లు) లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జాదవ్‌తో రాయుడు ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ దశలో రాయుడు 86 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో కెరీర్‌లో 10వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీకి చేరువయ్యే క్రమంలో అనవసర షాట్‌కు ప్రయత్నించి రాయుడు(90) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో ఆరో వికెట్‌కు నమోదైన 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే మరో 13 పరుగుల వ్యవధిలో జాదవ్ (34: 45 బంతుల్లో, 3ఫోర్లు)ను హెన్రీ బౌల్డ్ చేశాడు.
కసి కసిగా.. పాండ్యా!
అనంతరం క్రీజులోకి వచ్చిన హర్దిక్ పాండ్యా వచ్చి రావడంతోనే కసిగా ఆడాడు. ముఖ్యంగా అస్లే వేసిన 47 ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్స్‌లతో చెలరేగాడు. వచ్చిన బంతి వచ్చినట్టు బౌండరీకి తరలించాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్స్‌లతో 45 పరుగులు చేసిన పాండ్యా.. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలతో నిషేధానికి గురై ఆటకు దూరమైన పాండ్యా.. ఆడుతున్నంత సేపు ఆ కసిని బంతి మీద చూపించినట్లు కనిపించింది. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన సత్తా ఏంటో నిరూపించి జట్టుకు తన అవసరం ఏంటో గుర్తు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment