జోరుగా.. హుషారుగా !
భారత జట్టు ప్రాక్టీస్
సాక్షి, హైదరాబాద్: కొంత విరామం తర్వాత టెస్టు మ్యాచ్ బరిలోకి దిగుతున్న భారత జట్టు తమ సాధనను మొదలు పెట్టింది. బంగ్లాదేశ్‌తో గురువారం నుంచి జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లంతా తొలి రోజు సోమవారం ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. దాదాపు మూడు గంటల సుదీర్ఘ సమయం పాటు జట్టు సభ్యులు తీవ్రంగా శ్రమించారు.
నో ఫుట్‌బాల్...
భారత జట్టు సభ్యులంతా సోమవారమే ఒక్కొక్కరుగా నగరానికి చేరుకున్నారు. టెస్టు జట్టు సభ్యులు వేర్వేరుగా తమ స్వస్థలాల్లోనే ఉండటంతో వీరంతా జట్టుగా కాకుండా విడివిడిగా వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో జట్టు రాజీవ్‌గాంధీ స్టేడియానికి చేరుకుంది. సాధారణంగా జట్టు అలవాటుగా పాల్గొనే ఫుట్‌బాల్ వార్మప్ సెషన్‌కు ఈ సారి క్రికెటర్లు దూరంగా ఉన్నారు. ముందుగా కోచ్ అనిల్ కుంబ్లే నేరుగా పిచ్ వద్దకు వెళ్లి దానిని పరిశీలించిన అనంతరం క్యురేటర్‌తో మాట్లాడారు. ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్ నుంచి నేరుగా నెట్స్‌లోకి వెళ్లిపోయారు. అక్కడే కాస్త వార్మప్ తర్వాత క్రికెటర్ల ప్రాక్టీస్ కొనసాగింది. ముందుగా విరాట్ కోహ్లి, లోకేశ్ రాహుల్, మురళీ విజయ్ మూడు వేర్వేరు వికెట్‌లపై సాధన చేయగా, ఆ తర్వాత మిగతావారు వీరిని అనుసరించారు. ఆరంభంలోనే నెట్స్ బౌలర్స్‌ను ఎక్కువ సేపు ఎదుర్కొన్న కోహ్లికి ఆ తర్వాత అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ బౌలింగ్ చేశారు. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ప్రత్యేకంగా త్రోడౌన్స్ విసిరి రాహుల్‌తో సాధన చేయించారు. అనంతరం ప్రధాన మైదానంలో జట్టు ఫీల్డింగ్ సెషన్ కూడా కొనసాగింది. ఇక్కడ ఆటగాళ్లంతా కాస్త సరదాగా ఆడుతూ పాడుతూ సాధన చేశారు. గత టెస్టు ‘ట్రిపుల్ సెంచరీ హీరో’ కరుణ్ నాయర్‌తో కోహ్లి ప్రత్యేకంగా సుదీర్ఘ సమయం పాటు సంభాషించాడు.
షెడ్యూల్ బాగా బిజీగా ఉన్నా క్రికెటర్లుగా మేం ఎప్పుడైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. పైగా అంతా యువకులే కాబట్టి నిరంతరాయంగా ఆడటాన్ని ఆస్వాదించాలే తప్ప ఇబ్బంది అనుకోవద్దు. ఈ టెస్టుకు ముందు కూడా అందరికీ కావాల్సిన విశ్రాంతి లభించింది. బంగ్లాదేశ్‌ను మేం తేలిగ్గా తీసుకోవడం లేదు. ఇటీవల మేం చాలా బాగా ఆడుతున్నాం కాబట్టి అదే జోరును కొనసాగిస్తాం. పిచ్‌ల పరంగా భారత్, బంగ్లాదేశ్‌లలో పెద్దగా తేడాలు ఉండవు కాబట్టి ఈ మ్యాచ్ పోటాపోటీగా సాగుతుందని భావిస్తున్నా. మా జట్టులో అటు బ్యాట్స్‌మెన్, ఇటు బౌలర్లు అంతా సమష్టిగా రాణిస్తున్నారు కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. బంగ్లా స్పిన్ బౌలర్ మెహదీ హసన్‌లో మంచి ప్రతిభ ఉందని విన్నాను. ఇంగ్లండ్‌పై అతని ఆటను టీవీలో మాత్రమే చూశాను. అతడిని ఎదుర్కొంటే తప్ప ప్రత్యేకంగా ఇప్పుడే ఏమీ చెప్పలేను.
–చతేశ్వర్ పుజారా, భారత బ్యాట్స్‌మన్