
చివరి వన్డే భారత మహిళలదే
మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన చివరి మ్యాచ్ లో భారత మహిళలు సత్తా చాటారు.
హోబార్ట్:మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన చివరి మ్యాచ్ లో భారత మహిళలు సత్తా చాటారు. భారత మహిళలు 232 పరుగుల లక్ష్యాన్ని 47.0 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఛేదించి క్లీన్ స్వీప్ చేయాలనుకున్న ఆసీస్ను అడ్డుకున్నారు. భారత ఓపెనర్ మందనా(55) హాఫ్ సెంచరీతో రాణించగా, మరో ఓపెనర్ వేదా కృష్ణమూర్తి(12) నిరాశపరిచింది. ఆ తరువాత కెప్టెన్ మిథాలీ రాజ్(89) బాధ్యాతయుత ఇన్నింగ్స్ ఆడటంతో స్కోరు బోర్డు ముందుకు కదిలింది. రెండో వికెట్ కు 58 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మిథాలీ.. మూడో వికెట్ కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంలో సహకరించింది.
అయితే భారత స్కోరు 196 పరుగుల వద్ద ఉండగా మిథాలీ రాజ్ రనౌట్ రూపంలో పెవిలియన్ కు చేరింది. అప్పటికి భారత్ విజయానికి 46 పరుగులు అవసరం కాగా, ఎనిమిదికిపైగా ఓవర్లున్నాయి. ఆ తరుణంలో పూనమ్ రౌత్(24 నాటౌట్), శిఖా పాండే(17)లు తమ వంతు సహకారం అందించడంతో భారత్ ఇంకా మూడు ఓవర్లు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. అంతకుముందు టాస్ గెలిచిన ఆసీస్ మహిళలు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 231 పరుగులు నమోదు చేశారు.