ఎనిమిదేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్
న్యూఢిల్లీ: భారత మహిళా క్రికెట్ జట్టు ఎనిమిదేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లండ్ పర్యటనలో నాలుగు రోజుల పాటు జరిగే టెస్టు మ్యాచ్ లో టీమిండియా వుమెన్ ఆడనున్నారు. ఆగస్టు 7 నుంచి రెండున్నర వారాల పాటు ఇంగ్లండ్ లో భారత మహిళా క్రికెట్ జట్టు పర్యటించనుంది. 19 రోజుల ఈ పర్యటనలో ఒక టెస్టు, మూడు వన్డేలు, రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడనుంది.
మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత జట్టు వర్మస్లే క్రికెట్ మైదానంలో ఆగస్టు 13 నుంచి 16 వరకు టెస్టు మ్యాచ్ లో పాల్గొననుంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో చివరి, మూడో వన్డే ఆడుతుంది. 2006లో టాంటన్ లో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ ను భారత్ వుమెన్ టీమ్ ఓడించింది. అప్పటి జట్టులోని మిథాలీ, జులన్ గోస్వామి, కరుణ జైన్ ఇప్పటి టీమ్ లోనూ ఉన్నారు.