
సిడ్నీ: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన ఆరంభపు మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసి 132 పరుగులే చేసినా, దాన్ని కాపాడుకుని చిరస్మరణీయమైన గెలుపును అందుకుంది. ఆసీస్‌ను తన స్పిన్ మ్యాజిక్‌తో పూనమ్ యాదవ్ హడలెత్తించింది. పూనమ్ యాదవ్ బౌలింగ్ దెబ్బకు ఆసీస్ దాసోహమైంది. ఆమె బౌలింగ్‌లో ఎదురుదాడి చేయడాన్ని పక్కన పెడితే అసలు వికెట్లను ఎలా కాపాడుకోవాలో తెలియక నానా తంటాలు పడింది.
పూనమ్ నాలుగు ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి నాలుగు కీలక వికెట్లను సాధించి భారత్ విజయంలో ముఖ్య భూమిక పోషించింది. ఓపెనర్ అలైసా హీలే(51), రాచెల్ హెయిన్స్(6), ఎలీసె పెర్రీ(0), జొనాసెన్(2)లను స్వల్ప విరామాల్లో ఔట్ చేసి ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. పూనమ్‌కు జతగా పేసర్ శిఖా పాండే మూడు వికెట్లు సాధించగా, రాజేశ్వరి గైక్వాడ్‌కు వికెట్ దక్కింది. మరో ఇద్దరు రనౌట్ కావడంతో ఆసీస్ 19.5 ఓవర్లలో 115 పరుగులకే పరిమితమై పరాజయం చెందింది.
అంతకుముందు భారత జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. దీప్తి శర్మ(49 నాటౌట్; 46 బంతుల్లో 3 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడగా, షెఫాలీ వర్మ(29; 15 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడగా, ఆపై జెమీయా రోడ్రిగ్స్(26)లు ఫర్వాలేదనిపించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరును చేసింది. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా బరిలోకి దిగిన మంధాన, షెఫాలీ వర్మ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. షెఫాలీ వర్మ ధాటిగా ఆడటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 4 ఓవర్లలో 41 పరుగులతో టీమిండియా ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో జోనాసెన్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి మంధాన ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. అనంతరం పెర్రీ ఊరిస్తూ వేసిన బంతిని షెఫాలీ వర్మ భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔట్ అవుతుంది. ఇక ఏడో ఓవర్‌లో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. జోనాసెన్ వేసిన ఏడో ఓవర్ నాలుగో బంతిని భారీ షాట్ ఆడటానికి ముందుకు వచ్చిన హర్మన్ ప్రీత్ స్టంపౌటై తీవ్రంగా నిరుత్సాహపరిచింది.
ఆ సమయంలో రోడ్రిగ్స్- దీప్తి శర్మల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది.వీరిద్దరూ నాల్గో వికెట్‌కు 53 పరుగులు జోడించిన తర్వాత రోడ్రిగ్స్ వెనుదిరిగింది. కిమ్మిన్సె వేసిన 16 ఓవర్ ఆఖరి బంతికి వికెట్లు ముందు దొరికిపోయింది. దాంతో భారత స్కోరు 100 పరుగుల వద్ద ఉండగా నాల్గో వికెట్‌ను కోల్పోయింది. కాగా, దీప్తి శర్మ స్టైక్ రొటేట్ చేస్తూ కుదురుగా ఆడి అజేయంగా నిలిచింది.