
గతంలో దక్షిణాఫ్రికాలో పర్యటించిన ఏ భారత జట్టుకూ సాధ్యం కాని రికార్డును ప్రస్తుత టీమ్ సృష్టిస్తుందని ఈ టూర్‌కు బయల్దేరే ముందు కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. అయితే... ఇప్పుడు అది నిజంగానే నిజం కాకూడదని సగటు భారత క్రికెట్ అభిమాని బలంగా కోరుకుంటున్నాడు. ఎందుకంటే 1992 నుంచి ఆరు సార్లు దక్షిణాఫ్రికాకు వెళ్లిన ఏ భారత జట్టు కూడా క్లీన్‌స్వీప్‌కు గురి కాలేదు. కనీసం ఒక మ్యాచ్ గెలవడం లేదా ఒకటైనా డ్రా చేసుకోగలిగింది. ఇప్పుడు సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఓడే ప్రమాదం ముందు నిలిచింది. తొలి రెండు టెస్టుల్లో ఓడి ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన టీమిండియా మూడో టెస్టులో కోలుకోగలుగుతుందా... ప్రత్యర్థికి పోటీనిచ్చి పరువు కాపాడుకుంటుందా అనేది చూడాలి.
జొహన్నెస్‌బర్గ్: ప్రతిష్టాత్మక వాండరర్స్ మైదానంలో ఇప్పటి వరకు నాలుగు టెస్టులు ఆడిన భారత్ ఒకటి గెలిచి మూడు ‘డ్రా’ చేసుకోగా ఒక్కటి కూడా ఓడలేదు. టి20 ప్రపంచ కప్ గెలిచింది కూడా ఈ మైదానంలోనే. ఇలా అచ్చొచ్చిన వేదికపై తమ అదృష్టాన్ని మార్చుకునేందుకు కోహ్లి సేన సన్నద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్ నేడు ప్రారంభం కానుంది. ఇప్పటికే 2–0తో సిరీస్ గెలుచుకొని దక్షిణాఫ్రికా అమిత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా, నంబర్‌వన్ టీమ్ హోదాలో పరువు కాపాడుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. అయితే పేస్, బౌన్స్ కలగలిసిన పచ్చిక వికెట్ భారత్ కోసం ఎదురు చూస్తోంది. సిరీస్ ఫలితం తేలిపోయినా సరే ఇరు జట్లు ఈ మ్యాచ్‌ను కీలకంగానే భావిస్తుండటం ఆసక్తికరం.
రహానే ఖాయం...
తొలి రెండు టెస్టుల్లో పరాజయం తర్వాత తుది జట్టు కూర్పు గురించి తగిన రీతిలో వివరణ ఇచ్చుకోలేక భారత కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి ఇప్పటికే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మిడిలార్డర్‌లో అజింక్య రహానేను తీసుకోవడం ఖరారైనట్లే. మరోవైపు పేసర్ భువనేశ్వర్ కూడా తిరిగి జట్టులోకి రానున్నాడు. అయితే ఎవరి స్థానంలో వీరిని ఎంచుకోవాలనేది కూడా భారత్‌కు సమస్యగా మారింది. రోహిత్ శర్మను తప్పించేటట్లు కనిపిస్తున్నా... అతనికి మరో అవకాశం ఇవ్వాలనే ఆలోచన కూడా టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఉంది. భువీని ఎవరి స్థానంలో ఎంచుకోవాలో కూడా సందిగ్ధత కనిపిస్తోంది. షమీ, బుమ్రా గత మ్యాచ్‌లో బాగా ఆడగా... ఇక్కడి బౌన్సీ పిచ్‌పై ఇషాంత్ అవసరమూ ఉంది. మీడియా సమావేశంలో కోహ్లి చూచాయగా చెప్పినట్లు ఐదుగురు పేసర్ల వ్యూహాన్ని కూడా అనుసరించవచ్చు. కెప్టెన్ చివరి వరకు దానికి కట్టుబడి ఉంటే ఏకైక స్పిన్నర్ అశ్విన్‌ను పక్కన పెట్టాల్సి వస్తుంది. అయితే తుది జట్టులోకి ఎవరు వచ్చినా ఈ మ్యాచ్‌లో పరువు నిలవాలంటే భారత బ్యాటింగ్‌పైనే భారం ఉంది. పిచ్ బౌలింగ్‌కు బాగా అనుకూలించే అవకాశం ఉండగా...దానిని తాము కూడా వాడుకోగలగమని మన బౌలర్లు ఇప్పటికే నిరూపించారు. కాబట్టి బ్యాట్స్‌మెన్ శ్రమిస్తే మన రాత మారుతుంది. సిరీస్‌లో కోహ్లి సెంచరీ తప్ప ప్రధాన బ్యాట్స్‌మెన్ కనీసం అర్ధసెంచరీ కూడా చేయలేదు. ఆ 153ని పక్కన పెడితే రెండు టెస్టుల్లో కలిపి భారత టాప్–6 బ్యాట్స్‌మెన్ సగటు 14.08 మాత్రమే కావడం పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూపిస్తుంది. కాబట్టి బ్యాటింగ్‌లో సమష్టితత్వమే వాండరర్స్‌లో మనకు విజయావకాశం కల్పించవచ్చు.
మార్పులు లేకుండానే...
దక్షిణాఫ్రికా జట్టు కూడా పేస్ బౌలర్ల ప్రదర్శనతోనే ఇప్పటికే సిరీస్ గెలుచుకోగలిగింది తప్ప టీమ్ బ్యాటింగ్ ఇంకా నాసిరకంగానే ఉంది. రెండు మ్యాచుల్లోనూ డివిలియర్స్ కీలక ఇన్నింగ్స్‌లలో ఆ జట్టు కోలుకోగలిగింది. మిగతావారి బ్యాటింగ్ మొత్తం వైఫల్యం కిందే లెక్క. భారత్‌ను పేస్ ఉచ్చులో బిగించే ప్రయత్నంలో ఆ జట్టు ఆటగాళ్లు కూడా దానిని సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. ఓపెనర్లలో నిలకడ లేకపోగా, ఆమ్లా కూడా స్థాయికి తగినట్లుగా ఆడలేకపోతున్నాడు. కెప్టెన్ డు ప్లెసిస్ ఆట కూడా అంతంత మాత్రమే. ఇలాంటి స్థితిలో ఆ జట్టు కూడా క్లీన్‌స్వీప్ చేయాలంటే బ్యాట్స్‌మెన్ మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో మాత్రం తిరుగులేకుండా నలుగురు పేసర్లు జట్టు భారం మోస్తున్నారు. పిచ్‌ను బట్టి చివరి నిమిషంలో ఏదైనా మార్పు జరిగితే స్పిన్నర్ మహరాజ్ స్థానంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఫెలుక్‌వాయో రావచ్చు. 2015లో భారత గడ్డపై 0–3తో ఓడిన దక్షిణాఫ్రికా... సరిగ్గా లెక్క సరి చేయాలని పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ఈ పోరులో కూడా హోరాహోరీ తప్పదు.
పిచ్, వాతావరణం
పిచ్‌పై కనిపిస్తున్న పచ్చిక మరో మాటకు తావు లేకుండా ఇది పేస్, బౌన్సీ వికెట్ అని చెబుతోంది. బ్యాట్స్‌మెన్‌కు కూడా ఈ వికెట్ పరీక్ష పెట్టనుంది. కొద్ది సేపు కుదురుకోగలిగితే ఆ తర్వాత పరుగులు రాబట్టవచ్చు. టాస్ కూడా కీలకం. మ్యాచ్ జరిగే ఐదు రోజులూ వర్ష సూచన ఉంది. ఈ వాతావరణం కూడా పిచ్‌పై ప్రభావం చూపించవచ్చు.
తుది జట్లు (అంచనా)
భారత్: విజయ్, రాహుల్/ ధావన్, పుజారా, కోహ్లి, రహానే, పాండ్యా/రోహిత్, పార్థివ్, ఇషాంత్, భువనేశ్వర్, షమీ, బుమ్రా.
దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్ (కెప్టెన్), ఎల్గర్, మార్‌క్రమ్, ఆమ్లా, డివిలియర్స్, డి కాక్, మహరాజ్/ ఫెలుక్‌వాయో, ఫిలాండర్, రబడ, మోర్కెల్, ఇన్‌గిడి.
Comments
Please login to add a commentAdd a comment