
డీన్ ఎల్గర్
జోహెన్నెస్‌బర్గ్: టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసకందాయంలో పడింది. ఇరు జట్లకు విజయావకాశాలు సమంగా ఉండటంతో శనివారం నాలుగో రోజు ఆట కీలకం కానుంది. భారత్ నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. హషీమ్ ఆమ్లా(2 బ్యాటింగ్), డీన్ ఎల్గర్( 11 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్ మర్‌క్రామ్(4) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. రేపటి ఆటలో భారత జట్టు బౌలింగ్‌పైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. పిచ్ అనూహ్యంగా బౌన్స్ అవుతున్న నేపథ్యంలో సఫారీలకు లక్ష్యాన్ని ఛేదించడం కష్టమనే చెప్పాలి. మరి దీన్ని టీమిండియా ఎంతవరకూ ఉపయోగించుకుంటుందో చూడాలి.
ముందుగానే నిలిచిన మ్యాచ్..
మూడో రోజు కొనసాగడానికి సమయం ఉండగానే మ్యాచ్‌ను ముందుగా నిలిపివేశారు. సఫారీల ఇన్నింగ్స్‌లో భాగంగా బూమ్రా వేసిన తొమ్మిదో ఓవర్ మూడో బంతి అనూహ్యంగా దూసుకొచ్చి ఎల్గర్ ముఖానికి తగిలింది. దీంతో పిచ్ క్రమేపీ మరింత ప్రమాదకరంగా మారుతుందని భావించిన ఫీల్డ్ అంపైర్లు.. రిఫరీతో చర్చించిన తరువాత మ్యాచ్‌ను నిలిపేశారు. ఇరు జట్ల కెప్టెన్ల అంగీకారంతో మ్యాచ్‌ను 16 ఓవర్లు మిగిలుండగానే ముగించారు.
అంతకుముందు టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌట్ కావడంతో పోరాడే లక్ష్యాన్ని సఫారీల ముందుంచింది. శుక్రవారం 49/1 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియా.. మరో 198 పరుగులు చేసి మిగతా తొమ్మిది వికెట్లను కోల్పోయింది. ఈ రోజు ఆటలో కేఎల్ రాహుల్(16), చతేశ్వర పుజారా(1) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరి నిరాశపరిచారు.
ఆ క్రమంలో ఓవర్‌నైట్ ఆటగాడు మురళీ విజయ్‌కు జత కలిసిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ నాల్గో వికెట్‌కు 43 పరుగులు జోడించిన తర్వాత విజయ్(25;127 బంతుల్లో 1 ఫోర్) అవుటయ్యాడు. అటు తరువాత కోహ్లి-రహానేల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. కాగా, రబడా బౌలింగ్‌లో కోహ్లి(41) బౌల్డ్ కావడంతో 134 పరుగుల వద్ద భారత్ జట్టు ఐదో వికెట్‌ను నష్టపోయింది. వెంటనే హార్దిక్ పాండ్యా(4) కూడా నిష్క్రమించడంతో భారత జట్టు రెండొందల పరుగులు చేయడం కష్టంగా అనిపించింది.
రహానే-భువన్వేశ్వర్ భాగస్వామ్యం..
ఆ తరుణంలో రహానే -భువనేశ్వర్ కుమార్‌ల జోడి 55 పరుగుల్ని జత చేయడంతో భారత్ తేరుకుంది. అయితే రహానే(48) హాఫ్ సెంచరీకి దగ్గరగా ఏడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో భువీకి జత కలిసిన మొహ్మద్ షమీ దూకుడుగా ఆడాడు. 28 బంతుల్లో రెండు సిక్సర్లు, 1 ఫోర్‌తో 27 పరుగులు సాధించి విలువైన భాగస్యామ్యాన్ని జత చేశాడు.ఇక తొమ్మిదో వికెట్‌గా భువీ(33;76 బంతుల్లో 2 ఫోర్లు) అవుట్ కాగా, చివరి వికెట్‌గా బూమ్రా(4) పెవిలియన్ చేరడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇషాంత్ శర్మ(7 నాటౌట్) అజేయంగా క్రీజ్‌లో మిగిలాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా, మోర్నీ మోర్కెల్, ఫిలాండర్ తలో మూడు వికెట్లు సాధించగా, ఎన్‌గిడికి వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment