
అదే కథ.. అదే వ్యధ
వ్యూహం పన్నడమే కాదు.. అమలు చేయడం కూడా అంతే ముఖ్యం. తొలి రెండు టెస్టుల మాదిరిగామూడో టెస్టులోనూ భారత్ ఇదే సూత్రాన్ని అమలు చేసింది. అస్త్రం మార్చకుండా.. వ్యూహం చెడకుండా... దక్షిణాఫ్రికాను మళ్లీ బలంగా దెబ్బకొట్టింది. 215 పరుగులకే పరిమితమైనా... ‘మ్యాజిక్’ బౌలింగ్‌తో అప్పుడే సీన్ రివర్స్ చేసింది. బంతిని గింగిరాలు తిప్పుతూ తొలిరోజే ఊహించని షాక్ ఇవ్వడంతో... అటు దక్షిణాఫ్రికా టర్నింగ్ ట్రాక్‌పై మరోసారి ‘వ్యధ’ చెందుతోంది.
* మూడో టెస్టులోనూ తడబడిన బ్యాట్స్‌మెన్
* తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 215 ఆలౌట్
* రాణించిన రవీంద్ర జడేజా, మురళీ విజయ్
* దక్షిణాఫ్రికా 11/2
నాగ్‌పూర్: అందరూ ఊహించినట్లుగానే మూడో టెస్టులోనూ తొలి రోజే తమాషా మొదలైంది. పూర్తిగా స్పిన్ వికెట్‌పై ఇరుజట్ల బ్యాట్స్‌మెన్ తడబడటంతో ఈసారి కూడా భారీ స్కోరు చేసే అవకాశాలు లేకుండా పోయాయి.
జామ్‌తా మైదానంలో బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 78.2 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. మురళీ విజయ్ (84 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (54 బంతుల్లో 34; 6 ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (106 బంతుల్లో 32; 4 ఫోర్లు) మోస్తరుగా ఆడారు. తర్వాత దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో 2 వికెట్లకు 11 పరుగులు చేసింది. ఎల్గర్ (7 బ్యాటింగ్), ఆమ్లా (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్ బిన్నీ, ఆరోన్‌ల స్థానంలో రోహిత్, మిశ్రాలను తుది జట్టులోకి తీసుకుంది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ ఎల్బీడబ్ల్యు (బి) మోర్కెల్ 40; ధావన్ (సి అండ్ బి) ఎల్గర్ 12; పుజారా ఎల్బీడబ్ల్యు (బి) హార్మర్ 21; కోహ్లి (సి) విలాస్ (బి) మోర్కెల్ 22; రహానే (బి) మోర్కెల్ 13; రోహిత్ (సి) డివిలియర్స్ (బి) హార్మర్ 2; సాహా (సి) డుమిని (బి) హార్మర్ 32; జడేజా (బి) రబడ 34; అశ్విన్ (బి) తాహిర్ 15; మిశ్రా ఎల్బీడబ్ల్యు (బి) హార్మర్ 3; ఇషాంత్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 21; మొత్తం: (78.2 ఓవర్లలో ఆలౌట్) 215.
వికెట్ల పతనం: 1-50; 2-69; 3-94; 4-115; 5-116; 6-125; 7-173; 8-201; 9-215; 10-215.
బౌలింగ్: మోర్నీ మోర్కెల్ 16.1-7-35-3; రబడ 17-8-30-1; హార్మర్ 27.2-2-78-4; ఎల్గర్ 4-0-7-1; తాహిర్ 12.5-1-41-1; డుమిని 1-0-6-0.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ బ్యాటింగ్ 7; వాన్ జెల్ (సి) రహానే (బి) అశ్విన్ 0; తాహిర్ (బి) జడేజా 4; ఆమ్లా బ్యాటింగ్ 0; ఎక్స్‌ట్రాలు: 0; మొత్తం: (9 ఓవర్లలో 2 వికెట్లకు) 11.
వికెట్ల పతనం: 1-4; 2-9.
బౌలింగ్: ఇషాంత్ 2-1-4-0; అశ్విన్ 4-2-5-1; జడేజా 3-1-2-1
సెషన్-1 విజయ్ నిలకడ
ఆరంభంలో పిచ్ పేస్‌కు అనుకూలించినా భారత ఓపెనర్లు విజయ్, ధావన్ (12)లు ఓ గంటపాటు మంచి సమన్వయంతో ఆడారు. సింగిల్స్‌తో పాటు వీలైనప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ నిలకడను చూపారు. మోర్కెల్, రబడ 142 కి.మీ వేగంతో బంతులు విసిరినా ఈ జోడి ఎక్కడా తడబడలేదు. దీంతో ఆమ్లా... 9వ ఓవర్‌లోనే స్పిన్నర్‌ను రంగంలోకి తెచ్చాడు.
11వ ఓవర్‌లో హార్మర్ బౌలింగ్‌లో విజయ్ భారీ సిక్సర్ బాదడంతో భారత్ స్కోరు 13.4 ఓవర్లలో 50 పరుగులకు చేరింది. ఈ దశలో ధావన్ ఓ నిర్లక్ష్యమైన షాట్‌కు వికెట్‌ను సమర్పించుకున్నాడు. తర్వాత విజయ్‌తో జతకలిసిన పుజారా (21) కుదురుకోవడానికి సమయం తీసుకున్నాడు. తాహిర్ ఓవర్లలో రెండు ఫోర్లు బాది ఒత్తిడి తగ్గించుకున్నాడు. అయితే రెండో ఎండ్‌లో మోర్కెల్ ఓ ఫుల్ లెంగ్త్ బంతితో విజయ్‌ను అవుట్ చేయడంతో భారత్ లంచ్ వరకు 2 వికెట్లు కోల్పోయింది.
ఓవర్లు: 27; పరుగులు: 85; వికెట్లు: 2
సెషన్-2 మోర్కెల్ ప్రతాపం
లంచ్‌కు కొద్ది ముందు క్రీజులోకి వచ్చిన కోహ్లి (22) జాగ్రత్తగా ఆడినా... తొలి గంటపాటు మోర్కెల్ రివర్స్ స్వింగ్‌తో, హార్మర్ నాణ్యమైన స్పిన్‌తో భారత్‌ను వణికించారు. షాట్ ఎంపికలో పొరపాటు వల్ల పుజారా వెంటనే అవుటైనా.. రహానే (13) వచ్చి రావడంతో సిక్సర్ బాదాడు. కోహ్లితో కలిసి రహానే ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేసినా మోర్కెల్ వరుస ఓవర్లలో ఈ ఇద్దర్ని అవుట్ చేసి షాకిచ్చాడు.
సిరీస్‌లో తొలి టెస్టు ఆడుతున్న రోహిత్ (2) పరుగులు చేయడానికి చాలా ఇబ్బందిపడగా, సాహా నెమ్మదిగా ఆడాడు. 47వ ఓవర్‌లో హర్మర్... రోహిత్‌ను అవుట్ చేయడంతో భారత్ కేవలం 31 పరుగులు మాత్రమే జోడించి 4 కీలక వికెట్లు చేజార్చుకుంది. దీంతో భారత్ స్కోరు 94/2 నుంచి 125/6గా మారింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా షాట్లలో దూకుడు చూపించినా... స్పిన్‌లో చాలా పరిణతితో ఆడాడు.
ఓవర్లు: 28; పరుగులు: 64; వికెట్లు: 4
సెషన్-3 స్పిన్ మ్యాజిక్
టీ తర్వాత రెండు ఎండ్‌ల నుంచి మోర్కెల్, తాహిర్‌లు బౌలింగ్‌కు దిగారు. అయితే సాహా, జడేజా సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశారు. రెండుసార్లు ఎల్బీ అప్పీల్ నుంచి బయటపడిన జడేజా ఫోర్లతో ఇన్నింగ్స్‌లో వేగం పెంచగా, సాహా ఎక్కువగా భాగం సహచరుడికి స్ట్రయికింగ్ వచ్చేలా చూశాడు. అయితే ఏడో వికెట్‌కు 48 పరుగులు జోడించాక జడేజా అవుటయ్యాడు. ఈ దశలో అశ్విన్ (15) నిలబడే ప్రయత్నం చేసినా సాహాను హార్మర్ పెవిలియన్‌కు చేర్చాడు. తర్వాత అశ్విన్ భారత్ స్కోరు 200 పరుగులు దాటించాడు. అయితే మూడు బంతుల వ్యవధిలో అశ్విన్‌తో పాటు మిశ్రా (3) కూడా అవుట్ కావడంతో ఇన్నింగ్స్‌కు తెరపడింది.
తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాను ఆరంభం నుంచే అశ్విన్ ఇబ్బందిపెట్టాడు. ఇషాంత్‌తో కలిసి కొత్త బంతిని పంచుకున్న స్పిన్నర్ నాలుగో ఓవర్‌లో వాన్ జెల్ (0)ను అవుట్ చేసి భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఐదో ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన జడేజా... తన రెండో ఓవర్ (7వ)లో తాహిర్ (4)ను వెనక్కిపంపడంతో ప్రొటీస్ 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
ఓవర్లు: 23.2; పరుగులు: 66; వికెట్లు: 4 (భారత్)
ఓవర్లు: 9; పరుగులు: 11; వికెట్లు: 2 (దక్షిణాఫ్రికా)