అద్భుతం... 500వ విజయం | Indias Thrilling Eight Run Win Over Australia In Second ODI | Sakshi
Sakshi News home page

అద్భుతం... 500వ విజయం

Published Wed, Mar 6 2019 2:02 AM | Last Updated on Wed, Mar 6 2019 8:44 AM

Indias Thrilling Eight Run Win Over Australia In Second ODI - Sakshi

పిచ్‌ దాదాపు తొలి వన్డేలాగే ఉంది. బ్యాటింగ్‌ చేయడం కష్టంగా అనిపిస్తోంది. బంతి తక్కువ ఎత్తులో వస్తూ షాట్లు ఆడటం గగనంగా మారింది. కానీ ఎప్పటిలాగే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకే ఒక్కడు విరాట్‌ కోహ్లి మాత్రం నేనున్నానంటూ నిలబడ్డాడు. తనకే సాధ్యమైన రీతిలో అతను లెక్కలు వేసుకొని పరిస్థితికి తగినట్లుగా ఆడాడు. బౌండరీలు సాధ్యం కాని స్థితిలో ఏకంగా 76 పరుగులు సింగిల్స్‌ ద్వారా రాబట్టి మరో క్లాసిక్‌ సెంచరీతో భారత్‌కు చెప్పుకోదగ్గ స్కోరును అందించాడు. 

మంగళవారం మ్యాచ్‌కు ముందు లక్ష్యాన్ని ఛేదించే సమయంలో గత పది వన్డేల్లో తొమ్మిది ఓడిన ఆస్ట్రేలియా మళ్లీ అంతే తడబాటుకు గురైంది. చెప్పుకోదగ్గ ఆరంభం లభించినా... భారత బౌలర్ల ముందు మిడిలార్డర్‌ నిలవలేకపోయింది. ఒత్తిడిలో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు చేతులెత్తేసింది. ఫలితంగా టీమిండియా తమ వన్డే చరిత్రలో 500వ విజయాన్ని సాధించి ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకుంది. వరుసగా రెండో గెలుపుతో సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.   

నాగపూర్‌: సమష్టి ప్రదర్శన కనబర్చిన భారత్‌ జామ్తా మైదానంలో సాధారణ లక్ష్యాన్ని కాపాడుకుంది. మంగళవారం జరిగిన రెండో వన్డేలో కోహ్లి సేన 8 పరుగుల స్వల్ప తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 48.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (120 బంతుల్లో 116; 10 ఫోర్లు) వన్డేల్లో 40వ సెంచరీ సాధించడం విశేషం. ఇతర బ్యాట్స్‌మెన్‌లో విజయ్‌ శంకర్‌ (41 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా అంతా విఫలమయ్యారు.

ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌ (4/29) చెలరేగగా... ఆడమ్‌ జంపాకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. మార్క్‌ స్టొయినిస్‌ (65 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ చేయగా... హ్యాండ్స్‌కోంబ్‌ (59 బంతుల్లో 48; 4 ఫోర్లు), ఉస్మాన్‌ ఖాజా (37 బంతుల్లో 38; 6 ఫోర్లు), ఫించ్‌ (53 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. కుల్దీప్‌కు 3 వికెట్లు... బుమ్రా, విజయ్‌ శంకర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. సిరీస్‌లో భారత్‌ ప్రస్తుతం 2–0తో ఆధిక్యంలో నిలవగా... మూడో వన్డే ఈ నెల 8న రాంచీలో జరుగుతుంది.  

రోహిత్‌ డకౌట్‌
కోహ్లి క్రీజ్‌లోకి వచ్చేసరికి జట్టు స్కోరు 0... కోహ్లి ఔటయ్యాక వచ్చిన పరుగులు 2... మధ్యలో 248 పరుగులు వచ్చిన సమయంలో అతను క్రీజ్‌లో బ్యాట్స్‌మన్‌గా పరుగులు చేశాడు లేదంటే సహచరులను మార్గనిర్దేశనం చేస్తూ కెప్టెన్‌గా నడిపించాడు. కమిన్స్‌ వేసిన తొలి ఓవర్‌ చివరి బంతిని కట్‌ చేయబోయి రోహిత్‌ శర్మ (0) క్యాచ్‌ ఇవ్వడంతో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఒక దశలో ఎనిమిది బంతుల వ్యవధిలో మూడు ఫోర్లు కొట్టి ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన ధావన్‌ (21) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో ఎల్బీ అప్పీల్‌ను అంపైర్‌ తిరస్కరించగా, ఆసీస్‌ రివ్యూ చేసి సానుకూల ఫలితం పొందింది. క్రీజ్‌లో ఎక్కువ సేపు తడబడిన రాయుడు (18) కూడా విఫలమయ్యాడు. లయన్‌ బౌలింగ్‌లో అంపైర్‌ ఇచ్చిన ఎల్బీ నిర్ణయాన్ని రాయుడు సవాల్‌ చేసినా చివరకు ఔట్‌గానే తేలింది. దాంతో భారత్‌ రివ్యూ కూడా కోల్పోయింది.  

ఆకట్టుకున్న శంకర్‌
ఈ దశలో కోహ్లి, విజయ్‌ శంకర్‌ కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించారు. ముఖ్యంగా ఈ భాగస్వామ్యంలో కోహ్లి కంటే శంకర్‌ ఎక్కువ దూకుడు ప్రదర్శిస్తూ కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు. స్టొయినిస్‌ ఓవర్లో కొట్టిన ఫోర్, సిక్స్‌ అతని ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. మరోవైపు 55 బంతుల్లో కోహ్లి అర్ధసెంచరీ పూర్తయింది. అయితే శంకర్‌ను దురదృష్టం వెంటాడింది. జంపా బౌలింగ్‌లో కోహ్లి నేరుగా కొట్టిన బలమైన షాట్‌ బౌలర్‌ చేతి వేళ్లను తాకుతూ వెళ్లి నాన్‌ స్ట్రయికింగ్‌ ఎండ్‌ వికెట్లను పడగొట్టింది. ఆ సమయంలో క్రీజ్‌ బయట ఉన్న శంకర్‌ అర్ధసెంచరీ సాధించకుండానే నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. శంకర్, కోహ్లి నాలుగో వికెట్‌కు 87 పరుగులు జోడించగా... అందులో 46 శంకర్, 31 మాత్రమే కోహ్లి చేయడం విశేషం.  

లోయరార్డర్‌ విఫలం
ఒక వైపు కోహ్లి పట్టుదలగా నిలబడి తనదైన శైలిలో చక్కటి స్ట్రోక్స్‌తో పరుగులు చేస్తూ పోయాడు. అయితే  మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడ్డాయి. జంపా వరుస బంతుల్లో జాదవ్‌ (11), ధోని (0)ను ఔట్‌ చేసి భారత్‌ను దెబ్బ కొట్టాడు. జడేజా (21) పెద్దగా పరుగులు చేయకపోయినా కెప్టెన్‌కు అండగా నిలవడంతో ఏడో వికెట్‌కు 67 పరుగులు జత చేరాయి. కూల్టర్‌ నీల్‌ బౌలింగ్‌లో బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా కొట్టిన ఫోర్‌తో కోహ్లి అద్భుత శతకం పూర్తయింది. కొద్ది సేపటికి కమిన్స్‌ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి డీప్‌ స్క్వేర్‌ లెగ్‌లో క్యాచ్‌ ఇవ్వడంతో ఎనిమిదో వికెట్‌గా కోహ్లి వెనుదిరిగాడు. మరో రెండు పరుగులు జోడించిన తర్వాత భారత్‌ తమ చివరి 2 వికెట్లు కోల్పోయింది. 

రాణించిన ఓపెనర్లు
చాలా కాలంగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఆసీస్‌ కెప్టెన్‌ ఫించ్‌ ఈ మ్యాచ్‌లో కాస్త మెరుగ్గా కనిపించాడు. విజయ్‌ శంకర్‌ తొలి ఓవర్లో మూడు ఫోర్లతో 13 పరుగులు రాబట్టిన ఆస్ట్రేలియా పవర్‌ప్లే ముగిసేసరికి 60 పరుగులు చేసింది. అయితే ఫించ్, ఖాజా ఒకే స్కోరు వద్ద వెనుదిరిగారు. ఫించ్‌ను కుల్దీప్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో 83 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యం ముగియగా, ఖాజాను జాదవ్‌ ఔట్‌ చేశాడు.

ఆ తర్వాత 10 పరుగుల వ్యవధిలో షాన్‌ మార్‌ (16), మ్యాక్స్‌వెల్‌ (4) ఔట్‌ కావడంతో కంగారూల కష్టాలు పెరిగాయి. మరోవైపు హ్యాండ్స్‌కోంబ్‌ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. అయితే జడేజా అద్భుత ఫీల్డింగ్‌తో అతని ఆట ముగిసింది. చివరి ఎనిమిది ఓవర్లలో 59 పరుగులు చేయాల్సిన స్థితిలో కుల్దీప్‌ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 15 పరుగులు రాబట్టి ఆసీస్‌ జోరు పెంచే ప్రయత్నం చేసింది. అయితే క్యారీ (22)ని కుల్దీప్‌ ఔట్‌ చేయగా, ఒకే ఓవర్లో బుమ్రా రెండు వికెట్లు తీసి ఆసీస్‌కు అడ్డుకట్ట వేశాడు. స్టొయినిస్‌ నిలబడి గెలిపించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.

శంభో శివ ‘శంకర’ 
చివరి ఓవర్లో ఆస్ట్రేలియా విజయానికి 11 పరుగులు కావాలి. ప్రధాన బౌలర్ల కోటా పూర్తి కావడంతో 50వ ఓవర్‌ను మీడియం పేసర్‌ విజయ్‌ శంకర్‌తో వేయించాల్సి వచ్చింది. అయితే ఇలాంటి క్లిష్ట స్థితిలో అనుభవం లేకపోవడంతో పాటు వైజాగ్‌ టి20లో ఉమేశ్‌ యాదవ్‌ వైఫల్యం వెంటాడుతుండగా అందరికీ అతనిపై సందేహాలు. పైగా అప్పటి వరకు బుమ్రా, షమీ బౌలింగ్‌ను అతి జాగ్రత్తగా ఆడుకొని చివరి ఓవర్‌ కోసం వేచి చూస్తున్న స్టొయినిస్‌ జోరు మీదున్నాడు. సరిగ్గా ఏడాది క్రితం నిదాహస్‌ ట్రోఫీ ఫైనల్లో ఔటై తీవ్రంగా విమర్శలకు గురైన శంకర్‌ బౌలింగ్‌లో రెండు భారీ షాట్లు పడితే అంతే సంగతులు..! అయితే ఈసారి అలా జరగలేదు.

తొలి బంతికే అతను స్టొయినిస్‌ను ఎల్బీగా ఔట్‌ చేసి దాదాపుగా మ్యాచ్‌ను ముగించాడు. రివ్యూలో కూడా ఫలితం భారత్‌కే అనుకూలంగా వచ్చింది. 6 వన్డేల కెరీర్‌లో అతనికి ఇదే తొలి వికెట్‌ కావడం విశేషం. మరో రెండు బంతులకు జంపాను బౌల్డ్‌ చేసి విజయ్‌ గెలిపించాడు. 46వ ఓవర్‌నే శంకర్‌తో వేయించాలని తాను అనుకున్నానని, అయితే బుమ్రా, షమీ వరుసగా నాలుగు ఓవర్లు వేసి 49వ ఓవర్లోనే ఆట ముగిస్తారని ధోని, రోహిత్‌  చెప్పిన సలహాను పాటించానని కోహ్లి ఆ తర్వాత చెప్పాడు.  

నన్ను పట్టుకో చూద్దాం..! 
క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో అభిమానులు మైదానంలోకి దూసుకురావడం కొత్త కాదు. ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నా ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రెండో వన్డేలో కూడా అలాంటిదే జరిగింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ ప్రారంభానికి ముందు భారత జట్టు మొత్తం మైదానంలోకి అడుగు పెడుతుండగా అనూహ్య సంఘటన జరిగింది. ధోని వీరాభిమాని ఒకడు అతడిని కలిసేందుకు ఫీల్డ్‌లోకి దూసుకొచ్చాడు. అయితే ధోని అంత సులువుగా అతడికి ఆ అవకాశం ఇవ్వలేదు. తన వైపు వస్తున్న వ్యక్తిని గమనించిన ధోని వెంటనే మరోవైపు పరుగందుకున్నాడు.


ఆ అభిమాని కూడా తగ్గకుండా ధోనిని వెంటాడాడు. ఈ క్రమంలో జట్టు సభ్యులందరినీ దాటుకుంటూ ‘జిగ్‌జాగ్‌’ తరహాలో మాజీ కెప్టెన్‌ పరుగెడుతూ ఉంటే అభిమాని కూడా అలాగే వెంబడించాడు. కానీ ధోనిని అందుకోవడం మాత్రం అతని వల్ల కాలేదు. చివరకు ధోనినే స్టంప్స్‌ వద్దకు వెళ్లి ఆగిపోయాడు. దగ్గరకు వచ్చిన ఆ అభిమానికి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వగా... తన అభిమాన ఆటగాడిని కౌగిలించుకొని అతను సంబరపడ్డాడు. అయితే ఇదే తరహాలో మళ్లీ కోహ్లి వైపు వెళ్లబోతే అతను సరదాగా తీసుకోకుండా కళ్లతోనే ఆగ్రహం చూపించాడు! ఆలోగా పోలీసులు వచ్చి ఆ ఫ్యాన్‌ను బయటకు లాక్కెళ్లారు.  

2 వన్డేల్లో 500 విజయాలు పూర్తి చేసుకున్న రెండో జట్టు భారత్‌. ఈ జాబితాలో ఆస్ట్రేలియా 558 విజయాలతో అగ్రస్థానంలో ఉంది.

33 కోహ్లి సెంచరీ చేసిన 40 పర్యాయాల్లో 33 సార్లు భారత్‌ గెలిచింది. ఈ విషయంలో సచిన్‌ (49 సెంచరీల్లో 33 విజయాలు) సరసన కోహ్లి నిలిచాడు.  
 

40 కోహ్లి సెంచరీలు... ఏ దేశంపై ఎన్ని... 
శ్రీలంక – 8                 ఇంగ్లండ్‌ – 3 
వెస్టిండీస్‌ – 7              బంగ్లాదేశ్‌ – 3 
ఆస్ట్రేలియా –7              పాకిస్తాన్‌ – 2 
న్యూజిలాండ్‌ – 5          జింబాబ్వే – 1   
దక్షిణాఫ్రికా – 4 



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement