
జకర్తా: ఇండోనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో మెరుగైన క్రీడాకారులను చిత్తుచేస్తూ దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ సైనా 21–19, 21–19తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)పై 48 నిమిషాల్లోనే విజయం సాధించింది. ఈ విజయంతో ముఖాముఖి రికార్డులో సైనా 9–5తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఫైనల్లో టాప్‌సీడ్, ప్రపంచ నం.1 క్రీడాకారిణి తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో అమీతుమీ తేల్చుకుంటుంది. ముఖాముఖి రికార్డులో తై జు యింగ్ 5–8తో ఆధిక్యంలో ఉంది.
సాత్విక్ జోడి ఓటమి
పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడీ పోరాటం సెమీస్‌లో ముగిసింది. సెమీఫైనల్లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 14–21, 11–21తో టాప్ సీడ్ మార్కస్ ఫెర్నాల్డి గిడెయోన్ – కెవిన్ సంజయ సుకముల్జో (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది.