
'అండర్సన్.. నీ గురించి తెలుసుకో'
కరాచీ:భారత్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ టెక్నిక్ ను ప్రశ్నించే స్థాయి ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ కు లేదంటూ పాకిస్తాన్ దిగ్గజం, పీసీబీ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ వుల్ హక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. విరాట్ కోహ్లి బ్యాటింగ్ ను విమర్శించే ముందు భారత్ లో వికెట్లు ఎలా తీయాలో తెలుసుకుంటే మంచిదని ఇంజమామ్ సూచించాడు.
'విరాట్ బ్యాటింగ్ టెక్నిక్ను విమర్శిస్తూ అండర్సన్ చేసిన వ్యాఖ్యలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. విరాట్ ను ప్రశ్నించే ముందు నువ్వు భారత్లో వికెట్లు తీసే పాఠాలు నేర్చుకుంటే మంచిది. ఇప్పటివరకూ అండర్సన్ భారత్లో వికెట్లు తీయడం నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఒక బ్యాట్స్మన్ టెక్నిక్ను ప్రశ్నించే స్థాయిలో నీవు ఉన్నావా అనేది తెలుసుకుని ఆ తరువాత మాట్లాడు. నా బౌలింగ్ను ఇంగ్లండ్లో విరాట్ ఎదుర్కోలేకపోయాడన్నావు. ఇంగ్లండ్లో ఆడితేనే నాణ్యమైన బ్యాట్స్మన్ అని సర్టిఫికెట్ ఇస్తారా?, ఉప ఖండం పిచ్ల్లో ఆడేటప్పుడు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడకపోతేనే మంచిది. ఇది కేవలం అనుచిత వ్యాఖ్యలు చేసే విదేశీ ఆటగాళ్లకు నేనిచ్చే సూచన మాత్రమే. ఒక ఆటగాడు ఎక్కడ పరుగులు చేసినా వాటిని పరుగుల గానీ పరిగణిస్తారని విషయం బోధ పడితే మంచిది'అని ఇంజమామ్ ఘాటుగా వ్యాఖ్యానించాడు.