
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12 ఫైనల్ మ్యాచ్‌కు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ మైదానం వేదికకానుంది. ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ వేదిక హైదరాబాద్‌ను ఖరారు చేస్తూ బీసీసీఐ పాలకుల కమిటీ సోమవారం అధికారికంగా ప్రకటించింది. మే 12న జరగనున్న ఈ మ్యాచ్ కోసం చెన్నై స్టేడియంలో ఐ, జే, కే స్టాండ్స్‌ని ప్రారంభించడానికి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అనుమతి ఇవ్వకపోవడంతో ఫైనల్ మ్యాచ్ వేదికను హైదరాబాద్‌కు మారుస్తున్నామని అధికారులు తెలిపారు.
చెన్నైలోని చెపాక్‌లో క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరగనుండగా విశాఖపట్నం వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్, క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరగనున్నాయి. మే 7న చెన్నైలో క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. అయితే ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లు రెండూ హైదరాబాద్ లోనే జరుగుతాయని భావించినప్పటికీ.. మే 6, 10, 14 తేదీల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున భద్రతా పరమైన చిక్కులు తలెత్తె అకాశం ఉండటంతో మ్యాచ్‌లను విశాఖకు తరలించినట్టు తెలుస్తోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మే 8న ఎలిమినేటర్, మే 10న క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లు రెండూ విశాఖలో జరగనున్నాయి.