ఐపీఎల్-7లో కింగ్స్ లెవెన్ పంజాబ్ దూసుకెళ్తోంది. సూపర్ ఫామ్లో ఉన్న పంజాబ్ బ్యాట్స్మన్ గ్లెన్ మ్యాక్స్వెల్ వరుసగా మూడోసారి విధ్వంసక ఇన్నింగ్స్తో చెలరేగడంతో హ్యాట్రిక్ కొట్టింది.
షార్జా: ఐపీఎల్-7లో కింగ్స్ లెవెన్ పంజాబ్ దూసుకెళ్తోంది. సూపర్ ఫామ్లో ఉన్న పంజాబ్ బ్యాట్స్మన్ గ్లెన్ మ్యాక్స్వెల్ వరుసగా మూడోసారి విధ్వంసక ఇన్నింగ్స్తో చెలరేగడంతో హ్యాట్రిక్ కొట్టింది. మంగళవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో పంజాబ్ 72 పరుగులతో సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తుచేసింది. మ్యాక్స్వెల్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 95 పరుగులు చేశాడు. కాగా వరుసగా మూడోసారి కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. మ్యాక్స్వెల్ మెరుపు విన్యాసాలకు తోడు పుజారా (35), సెహ్వాగ్ (30) రాణించారు. వీరూ, పుజారా 51 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం అందించారు. హైదరాబాద్ బౌలర్లు భువనేశ్వర్ మూడు, అమిత్ మిశ్రా రెండు వికెట్లు పడగొట్టారు.
194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ను పంజాబ్ బౌలర్లు 19.2 ఓవర్లలో 121 పరుగులకు కట్టడి చేశారు. హైదరాబాద్ బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. జట్టులో లోకేష్ రాహుల్ (27) టాప్ స్కోరర్. పంజాబ్ బౌలర్లు బాలాజీ నాలుగు, మిచెల్ జాన్సన్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు.