క్రికెట్ లోకి వచ్చి.. మటాష్!
సునందా పుష్కర్, విజయ్ మాల్యా, శ్రీనివాసన్, ప్రీతి జింతా, రాజ్ కుంద్రా, వెంకటరామిరెడ్డి, సుబ్రతో రాయ్.. ఇంకా లలిత్ మోదీ. ఇంకొన్నాళ్లు ఆగితే ఈ జాబితా ఇంకాస్త పెద్దదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంతకీ మనం మాట్లాడుతున్నది దేని గురించో ఈ పాటికే అర్థమైంది కదా! అవును. 'క్రికెట్ కాసుల యంత్రం' ఐపీఎల్ గురించే!
అప్పటిదాకా వారివారి రంగాల్లో ఘనులైన ఈ బడాబాబులందరూ క్రికెట్ లోకి అడుగుపెట్టాకే.. కాలు జారి పతనం అంచుల వరకు వెళ్లిపోయారు. పైన చెప్పుకున్న జాబితాలో ఒకరిద్దరు జైలులో మగ్గుతుండగా, ఇంకొందరు పారిపోయి విదేశాల్లో తలదాచుకున్నారు. న్యాయవ్యవస్థపై అపార నమ్మకం వ్యక్తంచేస్తోన్న మరికొందరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఒకరు మాత్రం ఈ లోకంలో లేరు. క్రికెట్ వల్ల వీరికి శనిపట్టుకుందా? లేక వీళ్లే క్రీడలను భ్రష్టుపట్టించారా? అంటే..
ప్రొఫెషనల్ క్రికెట్ లోని మజాను ప్రేక్షకులకు అందించడంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో భాగంగా 2007లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను ప్రారంభించింది. భారత క్రికెట్ కంట్రలోల్ బోర్డు (బీసీసీఐ). ఇంగ్లాడ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో నిర్వహిస్తున్న ప్రొఫెషనల్ పోటీల నమూనాలో తయారైన ఐపీఎల్ ద్వారా ఎంతోమంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. అయితే ఆటకంటే ఎక్కువ అవినీతికే అందలం లభించిందని ఐపీఎల్ పై తీవ్రవిమర్శ. జట్లను కొనుగోలుచేసేందుకు సినీ, వ్యాపార, రాజకీయ రంగాల ప్రముఖులు విపరీతమైన ఆసక్తికనబర్చడం ఆ క్రమంలో భారీగా నల్లధనం తెల్లగా(సక్రమంగా) మారిపోవడం, నిజానికి ఆపని కోసమే ఐపీఎల్ ఉద్భవించిందని మాట్లాడుకోవటం అప్పట్లో హాట్ టాపిక్ లు. ఏళ్లు గడుస్తున్నకొద్దీ ఆరోపితులు నిందితులుగా మారుతుండటాన్నిబట్టి ఐపీఎల్ కచ్చితంగా జూదమేననే వాదనకు బలంచేకూరుతోంది. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ సాధారణ ప్రేక్షకులు, వీక్షకులు మాత్రం ఆటను ఆటలాగానే చూస్తున్నారు. ఆదరిస్తున్నారు.
అంతకు ముందరి ఆర్థిక వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ ఐపీఎల్ జట్లకు యజమానులైన తర్వాతే వ్యాపార దిగ్గజాలనుకున్నవారు ఒకొక్కరుగా కుప్పకూలిన వైనాన్ని పరిశీలిస్తే.. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు యజమాని విజయ్ మాల్యా వివిధ బ్యాంకుల్లో రూ. 9000 కోట్ల రుణం తీసుకుని ఎగవేసే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు బ్యాంకులపై ఒత్తిడి పెంచడంతో ఆయన దేశం విడిచి వెళ్లారనే వార్తలు వినవస్తున్నాయి. మాల్యా బ్యాంకులను బురిడీ కొట్టిస్తే.. పూణె వారియర్స్ జట్టు యజమాని, సహారా గ్రూప్ అధినేత సుబ్రతోరాయ్.. తన సంస్థలో చేరిన ముదుపుదారుల్ని దారుణంగా మోసంచేసి, మూడేళ్లుగా జైలులోనే ఉన్నారు. ఇక డెక్కన్ క్రానికల్ జట్టు యజమాని ,‘దక్కన్ క్రానికల్’ ఆంగ్ల దినపత్రిక చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డి తప్పుడు పత్రాలతో బ్యాంకుకు వందల కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టారనే ఆరోపణలపై అరెస్టయ్యారు.
ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై నిషేధం విధించిన దరిమిలా వాటి యజమానులైన శ్రీనివాసన్, మేయప్పన్, రాజ్ కుంద్రాలపై కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సతీమణి, దివంగత సునందా పుష్కర్.. కొచ్చి టస్కర్స్ జట్టును కొనుగోలుచేసినప్పుడు భారీ ఎత్తున నల్లధనం వినియోగంలోకి తెచ్చారనే విమర్శలున్నాయి. క్రికెట్ సంబంధిత ఆర్థిక వ్యవహారాలే ఆమె చావుకు కారణమన్నది జగమెరిగిన సత్యం. కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింతాది మరోరకం వివాదం. ఏళ్లుగా డేటింగ్ చేసి ఇంకొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతారనగా, అదే జట్టుకు మరో సహయజమాని నెస్ వాడియాతో ఆమె గొడవపడి విడిపోయారు. ఈ మధ్యే మరొక వ్యక్తిని పెళ్లిచేసుకున్నారు.
నీతి కథలో విపత్తును ముందే గ్రహించే సుమతి చేపలాగా.. అవినీతికి సుత్రధారి అయిన లలిత్ మోదీ విషయం ఇంతదాకా వస్తుందని ముందే ఊహించారు. అందుకే వీళ్లందరికంటే ముందే బిచాణా సర్దేసి ఎంచక్కా విదేశాల్లో సెటిల్ అయ్యారాయన! సుదూరాల్లో ఉంటూ కూడా భారత పార్లమెంట్ ను షేక్ చెయ్యగల సత్తాఉన్న లలిత్ మోదీ.. ఐపీఎల్ ముసుగులో భారీ జూదానికి తెరలేపారని అంటే, ఎవరైనా కాదంటారా?