
ముంబై: టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మకు ఊహించని అవకాశం దక్కింది. ప్రపంచకప్ కోసం స్టాండ్‌బైగా ఇషాంత్ శర్మను బీసీసీఐ అనూహ్యంగా ఎంపిక చేసింది. ఇషాంత్‌తో పాటు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు కూడా అవకాశం కల్పించింది. ఇప్పటికే వెటరన్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు, యువ ఆటగాళ్లు రిషభ్ పంత్, నవదీప్ సైనీలను స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఎంపికైన విషయం తెలిసిందే. దీంతో మొత్తం అయిదుగురు ప్లేయర్లు స్టాండ్‌బై లిస్టులో ఉన్నారు. ఇది వరకే ఎంపిక చేసిన భారత జట్టులో ఎవరైనా గాయపడినా లేక వీలునుబట్టి వీరు ఇంగ్లండ్‌కు పయనం అవుతారు.
‘ఇద్దరు బ్యాట్స్‌మెన్, ఇద్దరు పేసర్లు, ఒక స్పిన్నర్‌లతో స్టాండ్‌బై లిస్టును తయారు చేయాలనుకున్నాం. ఇప్పటికే ముగ్గురుని ఎంపికచేశాం. మరో పేసర్ కోసం చర్చించాం. గత కొంతకాలంగా ఇషాంత్ శర్మ టెస్టు ఫార్మట్‌లో విశేషంగా రాణిస్తున్నాడు. అనుభవాన్ని మార్కెట్‌లో కొనలేం కదా. అందుకే అనుభవజ్ఞుడైన అతడిని ఎంపిక చేశాం. స్పిన్నర్ కోటాలో అక్షర్ పటేల్‌ను తీసుకున్నాం’అంటూ బీసీసీఐకు చెందిన ఓ ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు. ఇక స్టాండ్‌బై ఆటగాడిగా తనను ఎంపిక చేయడం పట్ల ఇషాంత్ అనందం వ్యక్తం చేశాడు. గత కొంతకాలంగా టెస్టు ఫార్మట్‌కే పరిమితమైన ఇషాంత్.. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున అదరగొడుతున్నాడు. ఐపీఎల్‌లో ప్రదర్శన కారణంగానే ఇషాంత్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.