
మైదానంలో ఒకవైపు భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల మధ్య చిటపటలు కొనసాగుతుంటే ఇది సరిపోదన్నట్లుగా ఇద్దరు టీమిండియా సహచరులే గొడవకు దిగారు. ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా తీవ్రంగా వాదులాడుకున్న దృశ్యాలను సిరీస్ ప్రసారకర్త ‘చానల్ 7’ బయటపెట్టింది. మ్యాచ్ నాలుగో రోజు సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆసీస్ బ్యాటింగ్ సమయంలో షమీ వేసిన బంతి హెల్మెట్‌కు తగలడంతో లయన్ చికిత్స తీసుకున్నాడు.
ఆ విరామంలో ఇషాంత్, జడేజా ఒకరి వైపు మరొకరు దూసుకొచ్చి తీవ్రంగా వాదించుకున్నారు. సరిగ్గా కారణం తెలియకపోయినా స్టంప్స్ మైక్‌లు రికార్డయిన మాటలను బట్టి చూస్తే ఇద్దరూ హిందీలో బూతులు తిట్టుకున్నారు. ఒకరి వైపు మరొకరు పదే పదే వేలు చూపించడం, హావభావాలు చూస్తే ఘాటుగానే గొడవ జరిగినట్లు కనిపించింది. చివరకు షమీ, కుల్దీప్ యాదవ్ జోక్యం చేసుకొని వీరిద్దరిని అడ్డుకున్నారు. అయితే ఈ ఘటన ఆధారంగా భారత ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉన్నాయని వచ్చిన వార్తలను బీసీసీఐ ఖండించింది. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని, జట్టులో అంతా బాగుందని బోర్డు స్పష్టం చేసింది.