
ఇషాంత్ కనీస ధర రూ.2కోట్లు
ఢిల్లీ: టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మ రెండు కోట్ల రూపాయిల కనీస ధరతో ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ వేలానికి రానున్నాడు. ఈసారి వేలంలో ఆటగాడి అత్యధిక కనీస ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించారు. ఇషాంత్ శర్మతో పాటు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా అత్యధిక ధర జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మరొకవైపు శ్రీలంక కెప్టెన్ ఎంజెలో మాథ్యూస్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కమ్మిన్స్, ఇంగ్లండ్ ఆల్ రౌండర్లు బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్లు కూడా రెండు కోట్ల బ్రాకెట్లో ఉండటం విశేషం.
కాగా, ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ సైతం అత్యధిక ధర జాబితాలో చోటు సంపాదించాడు. ఇదిలా ఉంచితే, కోటిన్నర జాబితాలో ఇంగ్లండ్ జానీ బెయిర్ స్టో, న్యూజిలాండ్ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు లయన్, బ్రాడ్ హాడిన్, దక్షిణాఫ్రికా క్రికెటర్లు కేల్ అబాట్, వెస్టిండిస్ ఆటగాడు జాసన్ హోల్డర్లున్నారు.ఈ నెల 20న జరిగే వేలంలో మొత్తం 799 మంది అందుబాటులో ఉంటుండగా, వీరిలో 76 మందిని మాత్రమే ఫ్రాంచైజీలు ఎంచుకుంటాయి.