క్రికెటర్ల నాలుగు జట్లు సెమీస్‌కు
ఐఎస్‌ఎల్ ఫుట్‌బాల్
కోల్‌కతా: క్రికెటర్లు సహ యజమానులుగా ఉన్న నాలుగు జట్లు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో సెమీస్‌కు అర్హత సాధించాయి. బుధవారం ఎఫ్‌సీ గోవాతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న అట్లెటికో డి కోల్‌కతా పాయింట్ల పట్టికలో మూడో స్థానం (19 పాయింట్లు)లో నిలిచింది. కేరళతో కూడా 19 పాయింట్లతోనే ఉన్నా గోల్స్ తేడాలో వెనుకబడి నాలుగో స్థానంతో సంతృప్తిపడింది. సెమీస్‌కు అర్హత సాధించాలంటే కనీసం డ్రా చేసుకోవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు సత్తా చాటింది.
యువ భారతీ క్రీడాంగన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో... ప్రథమార్ధంలో 0-1తో వెనుకబడ్డా రెండో అర్ధభాగంలో చెలరేగి ఆడింది. కోల్‌కతా తరఫున 68వ నిమిషంలో లభించిన పెనాల్టీని ఫిక్రూ గోల్‌గా మల్చగా, ఎడ్గర్ మార్సెలినో (27వ ని.) గోవాకు గోల్ అందించాడు. నార్త్‌ఈస్ట్, ముంబైల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. 34వ నిమిషంలో కొకే (నార్త్‌ఈస్ట్) గోల్ చేయగా... 84వ నిమిషంలో సుశీల్ (ముంబై) గోల్ సాధించాడు.
ఈ మ్యాచ్‌తో ఐఎస్‌ఎల్‌లో లీగ్ దశ ముగిసింది. ఇంటా, బయటా పద్ధతిలో జరగనున్న సెమీస్ మ్యాచ్‌ల్లో... శనివారం కేరళ, చెన్నైయిన్‌లు కొచ్చిలో తలపడుతాయి. ఆదివారం కోల్‌కతా, గోవాలు కోల్‌కతాలో ఎదురుపడతాయి. మంగళవారం చెన్నైలో జరిగే మ్యాచ్‌లో చెన్నైయిన్, కేరళ; బుధవారం గోవాలో జరిగే మ్యాచ్‌లో గోవా, కోల్‌కతా అమీతుమీ తేల్చుకుంటాయి.