కుర్రాళ్లపైనా... కాసుల వర్షం!
స్పిన్నర్ కరణ్ శర్మకు జాక్‌పాట్
రూ. 3.75 కోట్లకు సన్‌రైజర్స్ సొంతం
రిషి ధావన్‌కు రూ. 3 కోట్లు వెచ్చించిన పంజాబ్
టేలర్‌ను కరుణించిన ఢిల్లీ
పెద్దగా అనుభవం లేకపోయినా... ఆటలో నైపుణ్యం ఉన్న కుర్రాళ్ల కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. రెండో రోజు జరిగిన వేలంలోనూ... జాతీయ, అంతర్జాతీయ స్టార్లతో సమానంగా దేశవాళీ ఆటగాళ్ల కోసం మంచినీళ్ల ప్రాయంగా డబ్బును ఖర్చు చేశాయి. దాదాపు తొమ్మిది మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లకు ఒక్కొక్కరికి కోటి రూపాయలకుపైగా చెల్లించి ఔరా అనిపించాయి. కళ్లు బైర్లుకమ్మే రీతిలో ఆల్‌రౌండర్ కరణ్ శర్మ జాక్‌పాట్ కొట్టేస్తే... రిషి ధావన్ అంచనాలను మించిపోయాడు. మొత్తానికి కుబేరునికి కూడా అసూయ పుట్టేలా
నోట్ల కట్టలతో క్రికెట్ ఆడుకున్నారు.
బెంగళూరు: అంతర్జాతీయ స్టార్లపై పెద్దగా ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు.. దేశవాళీ కుర్రాళ్లపై మాత్రం కాసుల వర్షం కురిపించాయి. ఓ స్థాయి మేరకు ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్ల కోసం పెద్ద మొత్తంలో వెచ్చించేందుకు కూడా వెనుకాడలేదు.
దీంతో గురువారం కొనసాగిన ఐపీఎల్-7 వేలంలో రైల్వేస్ లెగ్‌స్పిన్నర్ కరణ్ శర్మ జాక్‌పాట్ కొట్టేశాడు. రూ. 3.75 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు శర్మను సొంతం చేసుకుంది. రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన హిమాచల్ ప్రదేశ్ క్రికెటర్ రిషి ధావన్ కోసం తీవ్రమైన పోటీ నెలకొన్నా... పంజాబ్ రూ. 3 కోట్లకు దక్కించుకుంది. విదేశీ ఆటగాళ్లను రెండోసారి వేలంలో పెట్టినా ఒకరిద్దరిపై మాత్రమే ఫ్రాంచైజీలు ఆసక్తి చూపాయి. హైదరాబాద్ ఆటగాళ్లు తిరుమలశెట్టి సుమన్, విహారి ఈసారి అమ్ముడుపోలేదు.
వేలం విశేషాలు
వేలంలో మొదటగా ఎస్.అనిరుధ పేరును పిలవగా, ఎలాంటి పోటీ లేకుండా సన్‌రైజర్స్ కనీస ధరకే దక్కించుకుంది.
గురుకీరత్ సింగ్ (రూ. 1.3 కోట్లు) కోసం ముంబై, రాజస్థాన్, కోల్‌కతా పోటీపడినా.. పంజాబ్ సొంతమయ్యాడు.
మొదట ఉన్ముక్త్ చంద్ (రూ.65 లక్షలు)పై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. ఢిల్లీ ఆలస్యంగా స్పందిస్తే.. ముంబైతో పోటీపడి రాజస్థాన్ గెలుచుకుంది.
మనీష్ పాండే (రూ. 1.70 కోట్లు) కోసం ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది. అయితే కోల్‌కతా అత్యధికంగా చెల్లించింది.
రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన కేదార్ జాదవ్ (రూ. 2 కోట్లు)ను సన్‌రైజర్స్ కొనుక్కున్నా.. ఢిల్లీ ‘రైట్ టు మ్యాచ్’ కార్డు ద్వారా ఎగరేసుకుపోయింది.
ఆదిత్య తారే (రూ. 1.60 కోట్లు) కోసం ముంబై చివరి వరకు పోరాడి సొంతం చేసుకుంది.
గత సీజన్‌లో కోల్‌కతాకు ఆడిన రజత్ భాటియా (రూ. 1.70 కోట్లు)కు రాజస్థాన్ భారీ మొత్తాన్ని ఇచ్చింది.
మన్‌దీప్ (రూ. 80 లక్షలు)ను సన్‌రైజర్స్ సొంతం చేసుకున్నా... పంజాబ్ ‘రైట్ టు మ్యాచ్’ కార్డు ద్వారా తీసేసుకుంది.
పర్వేజ్ రసూల్ (రూ. 95 లక్షలు) కోసం ఢిల్లీ చివరి వరకు పోరాడినా... సన్‌రైజర్స్ ప్రయత్నం సఫలమైంది.
టెన్ డస్కెట్ (రూ. 1 కోటి), మిథున్ మన్హాస్ (రూ. 30 లక్షలు)ను వారి కనీస ధరలకే కోల్‌కతా, చెన్నైలు సొంతం చేసుకున్నాయి.
ధావల్ కులకర్ణి (రూ. 1.10 కోట్లు) కోసం ఢిల్లీ తీవ్రంగా పోరాడి... రాజస్థాన్ చేతిలో భంగపడింది.
గత సీజన్‌లో తమ జట్టుకు ఆడిన 20 ఏళ్ల జస్‌ప్రీత్ బుమ్రా (రూ. 1.20 కోట్లు) కోసం ముంబై భారీగా ఖర్చు చేసింది.
ప్రవీణ్ తాంబే (రూ. 10 లక్షలు)ను కనీస ధరకే పంజాబ్ కొనుక్కున్నా... రాజస్థాన్ ‘రైట్ టు మ్యాచ్’ కార్డును ఉపయోగించుకుంది.
సన్‌రైజర్స్ దక్కించుకున్న షాబాజ్ నదీమ్ (రూ. 85 లక్షలు)ను ఢిల్లీ ‘రైట్ టు మ్యాచ్’ కార్డు ద్వారా ఎగరేసుకుపోయింది.
ఇటీవల భారత జట్టుకు ఎంపికైన ఈశ్వర్ పాండే (రూ. 1.50 కోట్లు) కోసం సన్‌రైజర్స్ పోటీపడినా చెన్నై దక్కించుకుంది.
హైదరాబాద్ ఆటగాళ్లు విహారి, తిరుమల శెట్టి సుమన్ ఈసారి అమ్ముడుపోలేదు. ఆశిష్ రెడ్డి (రూ. 20 లక్షలు)ని సన్‌రైజర్స్ తీసుకుంది.
జలజ్ సక్సేనా (రూ. 90 లక్షలు)ను ముంబై సొంతం చేసుకుంది.
రాజస్థాన్ పట్టేసిన హర్షల్ పటేల్ (రూ. 40 లక్షలు)ను ‘రైట్ టు మ్యాచ్’ కార్డు ద్వారా బెంగళూరు దక్కించుకుంది.
రెండోసారి వేలంలోకి వచ్చిన రాస్ టేలర్ (రూ. 2 కోట్లు-ఢిల్లీ), దక్షిణాఫ్రికా ఆటగాడు బెరాన్ హెండ్రిక్స్ (రూ. 1.80 కోట్లు-పంజాబ్), క్రిస్ లిన్ (రూ. 1.30 కోట్లు-కోల్‌కతా), ప్యాట్ కమిన్స్ (రూ. 1 కోటి-కోల్‌కతా)లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.
జయవర్ధనే, గుప్టిల్, డారెన్ బ్రేవో, మార్లన్ శామ్యూల్స్, వైట్, టిమ్ పైన్, రోంచీ, బెహర్డిన్, హెన్రీ డేవిడ్, పాల్ వాల్తాటీ, డేవిడ్ హస్సీ, అజహర్ మహమూద్, మాథ్యూస్, బద్రీనాథ్‌లను ఎవరూ కొనలేదు.
చెన్నై సూపర్ కింగ్స్
మొత్తం ఆటగాళ్లు: 20
విదేశీ ఆటగాళ్లు: 8
ఖర్చు : రూ. 59.40 కోట్లు
ఢిల్లీ డేర్‌డెవిల్స్
మొత్తం ఆటగాళ్లు: 23
విదేశీ ఆటగాళ్లు: 7
ఖర్చు : రూ. 60 కోట్లు
పంజాబ్ కింగ్స్ ఎలెవన్
మొత్తం ఆటగాళ్లు: 23
విదేశీ ఆటగాళ్లు: 7
ఖర్చు : రూ. 55. 90 కోట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్
మొత్తం ఆటగాళ్లు: 21
విదేశీ ఆటగాళ్లు: 8
ఖర్చు : రూ. 59 కోట్లు
ముంబై ఇండియన్స్
మొత్తం ఆటగాళ్లు: 21
విదేశీ ఆటగాళ్లు: 8
ఖర్చు : రూ. 59.95 కోట్లు
రాజస్థాన్ రాయల్స్
మొత్తం ఆటగాళ్లు: 25
విదేశీ ఆటగాళ్లు: 8
ఖర్చు : రూ. 54.45 కోట్లు
బెంగళూరు రాయల్ చాలెంజర్స్
మొత్తం ఆటగాళ్లు: 21
విదేశీ ఆటగాళ్లు: 7
ఖర్చు : రూ. 60 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్
మొత్తం ఆటగాళ్లు: 24
విదేశీ ఆటగాళ్లు: 7
ఖర్చు : రూ. 59 కోట్లు
రూ. 467. 70 కోట్లు అన్ని ఫ్రాంచైజీలు కలిపి ఆటగాళ్ల కోసం చేసిన ఖర్చు (రిటైన్ చేసుకున్న వారితో కలిపి)
178 ఐపీఎల్ -7తుది జాబితాలో ఉన్న ఆటగాళ్ల సంఖ్య (రిటైన్ చేసిన ఆటగాళ్లతో కలిపి)
‘ఎవరో ఒకరు నాకోసం బిడ్ వేయాలని కోరుకున్నా. ఒక్కసారి బిడ్ వచ్చాక ఎంత మొత్తం అన్న విషయాన్ని పట్టించుకోలేదు. నాకు భారీ మొత్తం లభించినందుకు సంతోషంగా ఉంది. నా బాధ్యత మరింత పెరగనుంది. ’
- కరణ్ శర్మ