బాల్ గర్ల్ పట్ల సోంగా ఉదారత!
మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టెన్నిస్ లో కోర్టులో ఆటగాళ్లతో పాటు బాల్ గర్ల్స్, బాల్ బాయ్స్ కూడా తమ సేవలను అందిస్తుంటారనేది అందరికీ తెలిసిన సంగతే. అయితే వారి పరిస్థితి ఎలా ఉన్నా కోర్టులో ఆటగాళ్లు పట్టించుకోవడమనేది చాలా అరుదు. ఈ తరహా సంఘటనే తాజాగా చోటు చేసుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్ మ్యాచ్ లో భాగంగా బుధవారం ఓమెర్ జాసికాతో మూడో సెట్ సందర్భంగా బాల్ గర్ల్ వద్దకు కొన్ని బంతులను తీసుకుని సోంగా వెళ్లాడు.
ఆ బంతులను బాల్ గర్ల్ కు ఇవ్వబోతుండగా అమ్మాయి ఎటువంటి స్పందనా రాలేదు. వణుకుతున్న చేతులతో ఆమె ఒక బొమ్మలా అలానే నిల్చుని ఉండిపోయింది. దాంతో సోంగానే బాల్ గర్ల్ వద్దకు వెళ్లి ఏమైంది అంటూ ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడు. దానికి సమాధానంగా బాల్ గర్ల్ తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో సోంగా ఓదార్చాడు. ఆ తర్వాత మ్యాచ్ నిర్వాహకులతో మాట్లాడి ఆ బాలికను అక్కడ్నుంచి బయటకు పంపించి వేశాడు. దీంతో సోషల్ మీడియాలో సోంగాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతను నిజంగా ఒక జెంటిల్మన్ వ్యవహరించాడని టెన్నిస్ అభిమానులు కొనియాడారు. దీనిపై సోంగా స్పందిస్తూ.. ఆ అమ్మాయికి తాను చేసిన సాయం ఏమీ లేదంటూ తన ఉన్నతిని చాటుకున్నాడు. కేవలం స్టేడియం బయటకు పంపడం వరకూ మాత్రమే ఆమెకు సాయ పడ్డాడని తెలిపాడు.