సోంగాకు బాల్గర్ల్ లేఖ!
సిడ్నీ: అవతలి వ్యక్తి కష్టసమయంలో ఉన్నప్పుడు ఆ విషయాన్ని తెలుసుకుని సాయం చేస్తే.. అది సాయం చేసిన మనిషి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. కష్టాల్లో మనిషిని అక్కున చేర్చుకుని ఓదారిస్తే అది వారి హుందాతనానికి అద్దం పడుతోంది. ఇదే విషయం గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్ జరుగుతున్న సమయంలో ఫ్రెంచ్ ఆటగాడు సోంగా విషయంలో నిజమైంది.
టెన్నిస్ లో కోర్టులో ఆటగాళ్లతో పాటు బాల్ గర్ల్స్, బాల్ బాయ్స్ కూడా తమ సేవలను అందిస్తుంటారనేది అందరికీ తెలిసిన సంగతే. అయితే వారి పరిస్థితి ఎలా ఉన్నా కోర్టులో ఆటగాళ్లు పట్టించుకోవడమనేది చాలా అరుదు. 2016 ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్ మ్యాచ్ లో భాగంగా బాల్ గర్ల్ వద్దకు కొన్ని బంతులను తీసుకుని సోంగా వెళ్లాడు. ఆ బంతులను బాల్ గర్ల్ కు ఇవ్వబోతుండగా అమ్మాయి నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. వణుకుతున్న చేతులతో ఆమె ఒక బొమ్మలా అలానే నిల్చుని ఉండిపోయింది. దాంతో సోంగానే బాల్ గర్ల్ వద్దకు వెళ్లి ఏమైంది అంటూ ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడు. దానికి సమాధానంగా బాల్ గర్ల్ తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో సోంగా అక్కున చేర్చుకుని ఓదార్చాడు. ఆ తర్వాత మ్యాచ్ నిర్వాహకులతో మాట్లాడి ఆ బాలికను అక్కడ్నుంచి బయటకు పంపించి ఆమెకు వైద్య సేవలు అందించాలంటూ స్పష్టం చేశాడు. ఆ సమయంలో సోంగా జెంటిల్మన్లా వ్యవహరించడంతో అతనిపై ప్రశంసల వర్షం కురిసింది. ఇదిలా ఉంచితే, ఆనాడు తనపై ఉదారతను చాటుకున్న సోంగాను గుర్తు చేసుకుంటూ ఆ బాలిక..ఈ సీజన్ ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా ఓ లేఖను రాసింది.
'నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రస్తుతం నేను మీకు గుర్తండకపోవచ్చు. గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్ సందర్బంగా గాయపడిన ఓ బాల్ గార్ల్కు సాయం చేశారు. ఆమెనే నేను. ఆ సమయంలో నాపై చూపిన సానుభూతికి కృతజ్ఞతలు చెబుతున్నాను. నాకు ఆ సమయంలో కోర్టు బయటకు వెళ్లేందుకు మనిషి అవసరం. ఆ విషయాన్ని మీరు గుర్తించి ఆ సాయం చేసినందుకు మిమ్ముల్ని, మీలోని వ్యక్తిత్వాన్ని అభినందిస్తున్నాను. ఆ రోజు మీరు అడిగిన వెంటనే సాయం చేయలేకపోయాను. వైరల్ ఫీవర్ కారణంగా ఆ రోజు నా పరిస్థితి దారుణంగా ఉంది. మీరు బంతి అడిగిన విషయాన్నిగుర్తించలేకపోయాను. అందుకు క్షమాపణలు చెబుతున్నాను. ఆ సమయంలో కళ్లు తిరుగుతుండటంతో ఏమీ కన్పించలేదు. నా విధుల్ని సరిగా నిర్వహించలేనందుకు నన్ను క్షమించండి. ఈ ఆస్ట్రేలియా ఓపెన్లో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా' బాల్ గర్ల్ గిలియాన లేఖలో పేర్కొంది. ఆ లేఖ చదివిని సోంగా ఉప్పొంగిపోయాడు. ఈ సందర్భంగా ఆ బాల్ గర్ల్ కు కృతజ్ఞతలు తెలియజేశాడు.
Thank you very much for your letter Giuliana !!! 👌🏾✨💙 #Remember #AustOpen2016 pic.twitter.com/0dBNXGUFxP
— Jo-Wilfried Tsonga (@tsonga7) 22 January 2017