
నేడు బెంగళూరుతో జరిగే మ్యాచ్ సన్నాహల్లో భాగంగా ముంబై పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బుధవారం జట్టుతో పాటు చిన్నస్వామి స్టేడియానికి వచ్చాడు. అయితే గాయం నుంచి కోలుకుంటున్న అతను బౌలింగ్ మాత్రం చేయలేదు. కానీ మైదానంలో మరో బుమ్రా అందరినీ ఆకర్షించాడు. సరిగ్గా అచ్చుగుద్దినట్లు అతనిలాగే రనప్, బౌలింగ్ యాక్షన్‌తో అతను బెంగళూరు టీమ్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. 22 ఏళ్ల ఈ కుర్రాడి పేరు మహేశ్ కుమార్. బెంగళూరులో లీగ్ స్థాయి క్రికెట్ ఆడుతూ రాష్ట్ర అండర్–23 జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్నాడు.
అసలు మ్యాచ్‌లో బుమ్రా తరహా బౌలింగ్‌కు కాస్త అలవాటు పడాలని ఆర్‌సీబీ ఏరికోరి ఈ బౌలర్‌ను తెచ్చుకుంది. ఆర్‌సీబీ బౌలింగ్ కోచ్ నెహ్రా అతడిని పదేపదే ప్రోత్సహిస్తూ బౌలింగ్ చేయించాడు. మహేశ్ వేసిన ఒక చక్కటి బంతి హెట్‌మైర్ స్టంప్స్‌ను పడగొట్టింది. అతని బౌలింగ్‌ను దూరం నుంచి గమనిస్తున్న బుమ్రానే స్వయంగా ‘థమ్స్ అప్’ అంటూ ప్రోత్సహించడం మహేశ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కొద్దిసేపటి తర్వాత నెహ్రా సంతకం చేసి ఒక జత షూస్ బహుమతిగా ఇవ్వగా... కోహ్లి ఫోటో దిగి ఆటోగ్రాఫ్ ఇవ్వడం, వెల్ బౌల్డ్ అంటూ డివిలియర్స్ ప్రశంసలు కలగలిసి మహేశ్‌కు అంతులేని ఆనందాన్ని పంచాయి!