త్వరలో ‘జ్వాల’ అకాడమీ!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల త్వరలో అకాడమీ ప్రారంభించనుంది. అకాడమీ నిర్వహణకు సంబంధించి ఆమె ఇచ్చిన ప్రతిపాదనలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. కొత్తగా భూమి కేటాయింపు తరహాలో కాకుండా, అందుబాటులో ఉన్న వనరులనే ఉపయోగించుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆమెకు సూచించినట్లు సమాచారం.
ఈ ప్రక్రియలో తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి కేటీఆర్, ఎంపీ కల్వకుంట్ల కవిత ఆమెకు సహకరించినట్లు తెలుస్తోంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియాన్ని లీజు ప్రాతిపదికన ప్రభుత్వం జ్వాలకు ఇస్తుంది. అక్కడే ఆమె చిన్నారులకు శిక్షణ ఇవ్వనుంది.
ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నా...జ్వాల పేరుతోని అకాడమీ నిర్వహణ సాగుతుంది. ‘నాకు పేరు తెచ్చిన ఆటలో కొత్త తరాన్ని తీర్చిదిద్దాలనేది నా ఆలోచన. త్వరలోనే నా అకాడమీ ప్రారంభం కావచ్చు. అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడకపోయినా ప్రభుత్వ పెద్దలతో టచ్‌లోనే ఉన్నాను. వారి నుంచి నాకు దాదాపుగా గ్రీన్ సిగ్నల్ లభించినట్లే. నేను ఇంకా ఆటలోనే కొనసాగుతున్నాను కాబట్టి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వను. కానీ కోచ్‌ల సహకారంతో అకాడమీ నిర్వహిస్తాను’ అని జ్వాల ‘సాక్షి’తో చెప్పింది.