పట్టుదలే పెట్టుబడిగా... | Jyotikasri new hopeful athletes | Sakshi
Sakshi News home page

పట్టుదలే పెట్టుబడిగా...

Published Thu, May 18 2017 1:46 AM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM

పట్టుదలే పెట్టుబడిగా...

పట్టుదలే పెట్టుబడిగా...

అథ్లెటిక్స్‌లో కొత్త ఆశాకిరణం జ్యోతికశ్రీ  

సౌకర్యాలు అంతంత మాత్రం. ఆర్థిక పరిస్థితి నామమాత్రం. ప్రాక్టీస్‌ కోసం సింథటిక్‌ ట్రాక్‌ కూడా లేదు. రోల్‌ మోడల్‌గా తీసుకోవాలంటే ఆ స్థాయిలో విజయాలు సాధించిన వారు కూడా లేరు. కానీ ఆ అమ్మాయి మాత్రం తన ప్రతిభనే నమ్ముకుంది. పట్టుదలే పెట్టుబడిగా తన నైపుణ్యానికి పదును పెట్టింది. ఆమె కృషికు సరైన మార్గదర్శకుడు కూడా లభించాడు. ఇంకేం ప్రతికూలతలను అధిగమిస్తూ ఒక్కో అడుగు ముందుకేస్తూ తన లక్ష్యం వైపు దూసుకెళుతోంది. ఆ అమ్మాయే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 16 ఏళ్ల అథ్లెట్‌ దండి జ్యోతికశ్రీ. ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన జాతీయ యూత్‌ చాంపియన్‌షిప్‌లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ జ్యోతికశ్రీ 400 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ  విజయంతో ఆసియా యూత్‌ అథ్లెటిక్స్‌లో పాల్గొనే భారత జట్టులో చోటు సంపాదించింది.

విజయవాడ స్పోర్ట్స్‌: అథ్లెటిక్స్‌లో తమ ప్రతిభకు తోడు కొన్ని అరుదైన శారీరక లక్షణాలు కూడా ఆటగాళ్లను ప్రత్యేకంగా నిలబెడతాయి. అలాంటిదే ‘హార్స్‌ నీ’. గుర్రాలకు ఉండే తరహా మోకాలుతో అథ్లెట్లకు పరుగెత్తడంలో అదనపు ప్రయోజనం ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన దండి జ్యోతికశ్రీ దీనిని సమర్థంగా ఉపయోగించుకొని సంచలనాలు సృష్టిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 14వ యూత్‌ నేషనల్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 16 ఏళ్ల ఈ అమ్మాయి 400 మీటర్ల పరుగులో (56.7సెకన్లు) స్వర్ణపతకాన్ని గెలుచుకుంది. దీంతో బ్యాంకాక్‌లో మే 20 నుంచి 23వ తేదీ వరకు జరిగే ఆసియా యూత్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికైంది.  జ్యోతిక తండ్రి శ్రీనివాసరావుకు తణుకులో ఇనుప బీరువాలు, కప్‌బోర్డులు తయారు చేసే చిన్న కార్ఖానా ఉంది. తల్లి లక్ష్మీనాగ వెంకటేశ్వరి గృహిణి. బాడీ బిల్డింగ్‌లో ఒకప్పుడు రాణించిన తండ్రి అథ్లెటిక్స్‌లో జ్యోతిక ఆసక్తిని చూసి ప్రోత్సహించారు. స్థానిక వ్యాయామ ఉపాధ్యాయుడు కె. సీతారామయ్య ఈ సమయంలో తగిన శిక్షణ అందించారు.

వరుస విజయాలు...
అథ్లెటిక్స్‌లో ప్రాథమికాంశాలు నేర్చుకున్న తర్వాత ముుందుగా జూనియర్‌ స్టేట్‌ మీట్‌లో 200, 400 మీటర్ల విభాగాల్లో జ్యోతిక స్వర్ణపతకాలు సాధించింది. అనంతరం గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌లో కూడా అదే జోరును కొనసాగించి మరో రెండు స్వర్ణాలు అందుకుంది. 2015లో విశాఖపట్నంలో జరిగిన నేషనల్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో 1000  మీటర్ల పరుగులో కాంస్య పతకం పొందింది.

2015లో కాకినాడలో జరిగిన  సౌత్‌జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో అండర్‌–16 విభాగంలో 400 మీటర్ల పరుగులో స్వర్ణపతకం, అదే ఏడాది కృష్ణా జిల్లా గుడివాడలో  ‘పైకా’ నేషనల్స్‌లో 400 మీటర్లలో స్వర్ణపతకం కైవసం చేసుంది. 2015–16లో కేరళలో జరిగిన స్కూల్‌ గేమ్స్‌లో కూడా రజత పతకం సాధించింది. అనంతరం టర్కీలో జరిగిన వరల్డ్‌ స్కూల్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో  400 మీటర్ల ఈవెంట్‌లో సెమీస్‌ వరకు చేరుకుంది. 2016లో కరీంనగర్‌లో జరిగిన సౌత్‌జోన్‌ నేషనల్స్‌లో 400 మీటర్ల విభాగంలో స్వర్ణపతకం, రిలేలో కాంస్య పతకం సాధించింది.

మరింత సాధన...
నిలకడైన విజయాలతో రాణిం చిన జ్యోతికశ్రీ రెండు వారా ల పాటు జంషెడ్‌పూర్‌లోని టాటా స్పోర్ట్స్‌ అకాడమీలో ప్రత్యే క శిక్షణ పొందింది. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి  విజయవాడలోని ‘సాయ్‌’ అథ్లెటిక్స్‌ కోచ్‌ డీఎన్‌వీ వినాయక ప్రసాద్‌ను సంప్రదించారు. ఇక్కడినుంచి శిక్షణతో పాటు ఆమె చదువు కూడా కొనసాగింది. అథ్లెటిక్స్‌లో ప్రాక్టీస్‌తో పాటు చదువుకు కూడా ఆటంకం కలగకుండా ఆమె సాధన చేసింది. మార్చి లో పరీక్షల అనంతరం వెంటనే ఏప్రిల్‌లో యూత్‌ నేషనల్స్‌లో స్వర్ణం గెలుచుకోవడం జ్యోతిక పట్టుదలకు నిదర్శనం. ప్రాక్టీస్‌తో పాటు ఫిట్‌నెస్‌పై కూడా ఆమె ప్రత్యేక దృష్టి పెట్టింది. సీబీఆర్‌ స్పోర్ట్స్‌ అకాడమీ చైర్మన్‌  ప్రసాద్‌ ఈ దశలో ఆమెకు అండగా నిలుస్తున్నారు. ఆసియా యూత్‌ అథ్లెటిక్స్‌ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నానని, అక్కడ కూడా కచ్చితంగా పతకం గెలుచుకుంటానని జ్యోతిక ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో దేశం తరఫున మరిన్ని విజయాలు సాధించడమే తన లక్ష్యమని ఆమె చెప్పింది.

 జ్యోతికది తీవ్రంగా కష్టపడే స్వభావం. ఇదే ఆమెకు వరుస విజయాలు అందిస్తోంది. యూత్‌ అథ్లెటిక్స్‌లో విజయం పెద్ద ఘనతగా భావిస్తున్నాం. ఏపీ రాష్ట్రంలో ఒక్క సింథటిక్‌ ట్రాక్‌ లేకపోయినా మట్టిలో, రోడ్లుపై సాధన చేసి మరీ జ్యోతిక తన సత్తాను చాటింది. ఆమె ఆటలో చిన్న చిన్న లోపాలు సరిదిద్ది అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం.  
–కోచ్‌ డీఎన్‌వీ వినాయక ప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement