
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వన్డే ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించడానికి ఒక్క పరుగు దూరంలో నిలిచాడు.
మాంచెస్టర్: న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ వన్డే ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించడానికి ఒక్క పరుగు దూరంలో నిలిచాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం లార్డ్స్‌లో జరిగే తుది సమరంలో అతడీ ఘనత సాధించే అవకాశముంది. మంచి ఫామ్‌లో ఉన్న విలియమ్సన్ తమ జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. తుదిపోరులోనూ రాణించి కివీస్ ప్రపంచ విజేతగా నిలపాలని న్యూజిలాండ్ క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించేందుకు విలియమ్సన్ ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. మరొక్క పరుగు సాధిస్తే ఈ ఘనత అతడి సొంతమవుతుంది. ఈ ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో 8 ఇన్నింగ్స్ ఆడి అతడు 2 సెంచరీలు, 2 అర్ధ శతకాలతో 548 పరుగులు చేసి మహేల జయవర్ధనేతో రికార్డును సమం చేశాడు. 2007 వరల్డ్‌కప్‌లో అప్పటి శ్రీలంక కెప్టెన్ జయవర్ధనే 11 మ్యాచ్‌లు ఆడి శతకం, నాలుగు హాఫ్ సెంచరీలతో 548 పరుగులు చేశాడు. ఇదే సిరీస్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ 9 ఇన్నింగ్స్‌లో 539 పరుగులు సాధించాడు. విలియమ్సన్ ఇంకొక్క పరుగు సాధిస్తే ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా కొత్త రికార్డు సృష్టిస్తాడు. ఒక వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విలియమ్సన్ ఇప్పటికే రికార్డుకెక్కాడు. తాజా వరల్డ్‌కప్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 9 మ్యాచ్‌ల్లో 648 పరుగులు చేసి టాప్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. ఐదు సెంచరీలతో రోహిత్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.