చెలరేగిన దినేశ్ కార్తీక్
బిలాస్పూర్: రైల్వేస్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో తమిళనాడు ఆటగాడు దినేశ్ కార్తీక్ చెలరేగిపోయాడు. తమిళనాడు రెండో ఇన్నింగ్స్లో దినేశ్ కార్తీక్(163;145బంతుల్లో 24 ఫోర్లు) భారీ శతకం సాధించి జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. గ్రూప్-ఎలో భాగంగా రైల్వేస్ తో జరుగుతున్న మ్యాచ్లో ఇంద్రజ్ జిత్(52)తో కలిసి దినేశ్ కార్తీక్ 158 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అంతకుముందు కెప్టెన్ అభినవ్ ముకుంద్(100;181 బంతుల్లో 10 ఫోర్లు) శతకం సాధించాడు. వీరితో పాటు రంగరాజన్(51 నాటౌట్), కౌశిక్ గాంధీ(42) రాణించడంతో తమిళనాడు తన రెండో ఇన్నింగ్స్ ను ఎనిమిది వికెట్ల నష్టానికి 452 పరుగుల వద్ద ఉండగా డిక్లేర్ చేసింది.
తొలి ఇన్నింగ్స్ లో తమిళనాడు 121 పరుగులకు ఆలౌట్ కాగా, రైల్వేస్ మొదటి ఇన్నింగ్స్ లో 173 పరుగులు చేసింది. దాంతో రైల్వేస్ కు తమిళనాడు 401 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. ఈ భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రైల్వేస్ చివరి రోజైన నాల్గో రోజు లంచ్ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 175 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా రైల్వేస్ విజయానికి 226 పరుగులు అవసరం కాగా, తమిళనాడు గెలుపుకు ఏడు వికెట్లు అవసరం.