
షిమోగా (కర్ణాటక): రంజీ ట్రోఫీలో తొలి విజయాన్ని సాధించాలని బరిలోకి దిగిన హైదరాబాద్ అసాధారణ రీతిలో పోరాడాల్సి ఉంది. కర్ణాటకతో జరుగుతోన్న మ్యాచ్‌లో విజయం సాధించాలంటే రాయుడు సేన శుక్రవారం మరో 288 పరుగులు సాధించాలి. గురువారం తమ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన హైదరాబాద్ జట్టు ఆట ముగిసే సమయానికి 32 ఓవర్లలో 2 వికెట్లకు 92 పరుగులు చేసింది. అక్షత్ రెడ్డి (15), కొల్లా సుమంత్ (9) అవుటయ్యారు. ప్రస్తుతం తన్మయ్ అగర్వాల్ (43 బ్యాటింగ్; 4 ఫోర్లు), కెప్టెన్ అంబటి రాయుడు (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 128/4తో మూడోరోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కర్ణాటక 105.4 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని ఓవరాల్‌గా హైదరాబాద్‌కు 380 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రధాన బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ (229 బంతుల్లో 134; 17 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా, స్టువర్ట్ బిన్నీ (72; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. హైదరాబాద్ బౌలర్లలో మెహదీ హసన్ 5 వికెట్లు దక్కించుకోగా, ఆకాశ్ భండారి 3, ప్రజ్ఞాన్ ఓజా, రవి కిరణ్ చెరో వికెట్ తీశారు. శుక్రవారం ఆటకు చివరిరోజు.
Comments
Please login to add a commentAdd a comment