
ఈసారి ఆర్సీబీకి కేదర్ జాదవ్!
న్యూఢిల్లీ:గత మూడు సీజన్ల నుంచి వరుసగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడుతున్నమహరాష్ట్ర ఆటగాడు కేదర్ జాదవ్.. రాబోవు సీజన్ కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో కలవనున్నాడు. ఈ మేరకు జాదవ్ ను ఆర్సీబీ కొనుగోలు చేసినట్లు భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
ఇటీవల పుణె, రాజ్ కోట్ జట్లుకు జరిగిన వేలం అనంతరం జాదవ్ జట్టు మార్పే మొదటిదిగా ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. దీనిపై ఆర్సీబీ ఓనర్ విజయ్ మాల్యా మాట్లాడుతూ.. ట్వంటీ 20ల్లో జాదవ్ చాలా విలువైన ఆటగాడని పేర్కొన్నారు. జాదవ్ తమ జట్టుతో కలవడంతో రాయల్ చాలెంజర్స్ మిడిల్ ఆర్డర్ మరింత బలపడుతుందన్నారు. 2016 సీజన్ లో జాదవ్ రాణిస్తాడని మాల్యా ఆశాభావం వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి ప్రముఖ క్రికెటర్లు ఉన్న తమ జట్టులో జాదవ్ కలవడం నిజంగానే తమకు అదనపు బలమని మాల్యా తెలిపారు.