
విరాట్ కోహ్లి కంటే..
పుణె:ఇంగ్లండ్తో ఇక్కడ జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన కేదర్ జాదవ్పై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, అద్బుతమైన ఇన్నింగ్స్ తో భారత్ కు చారిత్రక విజయాన్ని అందించాడంటూ జాదవ్ను గంగూలీ కొనియాడాడు. ప్రత్యేకంగా కెప్టెన్ విరాట్ కొహ్లి ఆడిన ఇన్నింగ్స్ కంటే జాదవ్ ఆడిన ఇన్నింగ్స్ అత్యుద్భుతంగా ఉందని ప్రశంసించాడు.' జాదవ్ ప్రదర్శన నిజంగా అసాధారణం. భారీ పరుగుల ఛేజింగ్ లో జాదవ్ చూడ చక్కటైన ఇన్నింగ్స్ ఆడాడు. నా దృష్టిలో కోహ్లి కంటే జాదవ్నే మెరుగ్గా ఆడాడు. మన విజయాల్లో ఎప్పుడూ విరాట్ కోహ్లి గురించే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ మాత్రం జాదవ్ గురించి కచ్చితంగా మాట్లాడిల్సిన అవసరం ఉంది. భారత జట్టు ఒత్తిడిలో ఉన్న సమయంలో జాదవ్ కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతోనే భారత్కు విజయం సాధ్యమైంది. ఇక్కడ మొత్తం క్రెడిట్ జాదవ్ కు ఇవ్వాల్సిందే'అని గంగూలీ తెలిపాడు.
ఇదిలా ఉంచితే, భారత్ విజయంలో తన పాత్ర ఉండటంపై జాదవ్ హర్హం వ్యక్తం చేశాడు. భారత విజయాల్లో తన పాత్ర ఉండాలని ఎప్పుడూ కోరుకుంటానని, అందులోనూ సొంత గ్రౌండ్లో సెంచరీ చేసి జట్టుకు చక్కటి విజయాన్ని అందివ్వడం మరచిపోలేని అనుభూతిగా పేర్కొన్నాడు. తన కుటుంబ సభ్యులు సమక్షంలో కీలక ఇన్నింగ్స్ ఆడటం ఆనందంగా ఉందన్నాడు. తాను చాలాసార్లు విరాట్ కోహ్లి కలిసి బ్యాటింగ్ చేసే అవకాశాన్ని కోల్పోయానని, ఈ మ్యాచ్ ద్వారా అది తీరిందని మ్యాచ్ ముగిసిన తరువాత జాదవ్ పేర్కొన్నాడు.