టీమిండియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఇవాళ (జూన్ 3) ప్రకటించాడు. వైవిధ్యభరితమైన ఆటగాడిగా పేరున్న కేదార్.. టీమిండియా తరఫున పలు మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేదార్ రిటైర్మెంట్ నేపథ్యంలో అతనాడిన ఓ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌పై ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతుంది.
2017లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేదార్ చేసిన మెరుపు శతకాన్ని జనాలు గుర్తు చేసుకుంటున్నారు. భారత ఫుల్ టైమ్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి అది తొలి మ్యాచ్. పూణే వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో కేదార్ సొంత అభిమానుల (కేదార్ స్వస్థలం పూణే) మధ్యలో పేట్రేగిపోయాడు. కేవలం 65 బంతుల్లోనే శతక్కొట్టి టీమిండియా విజయంలో ప్రధానపాత్ర పోషించాడు.
ఆ మ్యాచ్‌లో 351 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ సమయంలో బరిలోకి దిగిన లోకల్ బాయ్ కేదార్.. ఎవరూ ఊహించని రీతిలో చెలరేగిపోయాడు. 76 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేశాడు.
కేదార్‌కు జతగా మరో ఎండ్‌లో కోహ్లి కూడా శివాలెత్తిపోయాడు. కోహ్లి 105 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 122 పరుగులు చేశాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాను విజయపు అంచుల వరకు తీసుకెళ్లారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (40 నాటౌట్) లాంఛనంగా మ్యాచ్‌ను ముగించాడు. కేదార్, కోహ్లి చెలరేగడంతో ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది.
ఈ మ్యాచ్‌లో కేదార్ ఆడిన ఇన్నింగ్స్ వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. కేదార్, కోహ్లి శతక్కొట్టుడు ముందు 351 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. కేదార్ ఆడిన ఆ చిరస్మరణీయ ఇన్నింగ్స్ నెటిజన్లు ప్రస్తుతం గుర్తు చేసుకుంటున్నారు.
కేదార్ కెరీర్‌లో ఈ ఇన్నింగ్స్‌తో పాటు మరో మరపురాని ఇన్నింగ్స్ కూడా ఉంది. 2018 ఐపీఎల్‌లో సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహించిన కేదార్.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్‌లో గాయంతో బాధపడుతూనే ఆఖర్లో వచ్చి తన జట్టుకు అద్భుత విజయాన్నందించాడు.
ఆ మ్యాచ్‌లో గాయం బారిన పడిన కేదార్.. సీఎస్‌కే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి మ్యాచ్‌ను ముగించాడు. కేదార్ దేశవాలీ కెరీర్‌లో సైతం ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు చాలా ఉన్నాయి.
39 ఏళ్ల కేదార్.. టీమిండియా తరఫున 73 వన్డేలు, 9 టీ20లు ఆడి 2 సెంచరీలు (వన్డేల్లో), 7 అర్దసెంచరీల సాయంతో 1611 పరుగులు చేశాడు. కేదార్ ఖాతాలో 27 వన్డే వికెట్లు కూడా ఉన్నాయి.
ఐపీఎల్‌లో 2010 నుంచి 2023 సీజన్ వరకు వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన కేదార్.. తన కెరీర్‌లో 95 మ్యాచ్‌లు ఆడి 123.1 స్ట్రయిక్‌రేట్‌తో 4 అర్ద సెంచరీల సాయంతో 1208 పరుగులు చేశాడు.
కేదార్ దేశవాలీ ట్రాక్ రికార్డు విషయానికొస్తే.. పూణేలో పుట్టి మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించే కేదార్.. ఆ జట్టు తరఫున 87 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 186 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 163 టీ20లు ఆడాడు. ఇందులో 27 సెంచరీలు, 56 అర్ద సెంచరీల సాయంతో 14 వేల పైచిలుకు పరుగులు సాధించి, 65 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment