టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ పేరు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం మార్మోగిపోతుంది. క్రికెట్‌కు సంబంధించి ఎక్కడ డిస్కషన్ జరిగినా ఇతగాడి పేరే వినిపిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో ఫార్మాట్లకతీతంగా పరుగుల వరద పారిస్తూ, సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్న యశస్వి.. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో డబుల్ సెంచరీతో విరుచుకుపడి భారత క్రికెట్ అభిమానుల పాలిట ఆరాధ్య ఆటగాడిగా మారిపోయాడు. ఈ డబుల్‌తో యశస్వి క్రేజ్ ఒక్కసారిగా తారా స్థాయికి చేరింది. భారత క్రికెట్ సర్కిల్స్‌లో ఇతను ఓవర్‌నైట్ హీరో అయిపోయాడు. అతడు ఆడింది ఏడు టెస్ట్ మ్యాచ్‌లే అయినా.. 100 టెస్ట్‌ల అనంతరం లభించే పేరును సంపాదించాడు.
రాజ్‌కోట్ టెస్ట్‌లో డబుల్ సెంచరీతో చాలా రికార్డులను బద్దలు కొట్టిన యశస్వి.. రెండు భారీ రికార్డులను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. రాజ్‌కోట్ టెస్ట్‌కు ముందు జరిగిన విశాఖ టెస్ట్‌లోనూ డబుల్ సెంచరీ చేసిన యశస్వి.. దిగ్గజ ఆటగాడు, తన ఆరాధ్య క్రికెటర్ అయిన విరాట్ కోహ్లి సరసన చేరాడు. వినోద్ కాంబ్లీ, విరాట్ కోహ్లి తర్వాత వరుస టెస్ట్‌ల్లో డబుల్ సెంచరీలు చేసిన మూడో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అలాగే వినూ మన్కడ్, విరాట్ కోహ్లి తర్వాత ఒకే సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
రాజ్‌కోట్ టెస్ట్ డబుల్‌తో యశస్వి సాధించిన మరిన్ని రికార్డులు..
►టెస్టుల్లో ఇంగ్లండ్‌పై రెండు డబుల్ సెంచరీలు సాధించిన మొదటి భారత బ్యాటర్‌గా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు.
►అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన పాకిస్తాన్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ రికార్డును యశస్వి సమం చేశాడు. మూడో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో జైశ్వాల్ ఏకంగా 12 సిక్స్‌లు బాదాడు. 1996లో జింబాబ్వేపై వసీం అక్రమ్ కూడా 12 సిక్స్‌లు కొట్టాడు.
►భారత్ తరపున ఒక ఇన్నింగ్స్‌లో 10కిపైగా సిక్స్‌లు బాదిన మొదటి బ్యాటర్‌గా జైశ్వాల్ నిలిచాడు.
►టెస్టుల్లో సెకండ్ ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసిన ఏడో భారత బ్యాటర్‌గా జైస్వాల్ రికార్డులకెక్కాడు.
►సెకండ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలిచాడు.
► ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు (545) సాధించిన భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా రికార్డు.
ఇదిలా ఉంటే, రాజ్‌కోట్ టెస్ట్‌లో టీమిండియా 434 పరుగులు భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో యశస్వి అజేయ డబుల్ సెంచరీతో (214 నాటౌట్) విశ్వరూపం ప్రదర్శించాడు. దీనికి ముందు టెస్ట్‌లోనూ యశస్వి డబుల్‌తో చెలరేగాడు. వైజాగ్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 209 పరుగులు చేశాడు. రాజ్‌కోట్ టెస్ట్‌లో విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో వెళ్లింది. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లో గెలవగా.. భారత్ వరుసగా రెండు, మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రాంచీ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment