
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్‌లోనే కంగుతిన్నాడు. మహిళల విభాగంలో పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కెంటో మొమోటా (జపాన్) 12–21, 21–14, 21–15తో నాలుగో సీడ్ శ్రీకాంత్‌ను ఓడించాడు. గతవారం మలేసియా ఓపెన్ సెమీఫైనల్లోనూ మొమోటా చేతిలోనే శ్రీకాంత్ ఓడిపోవడం గమనార్హం.
మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో సింధు 21–15, 19–21, 21–13తో పార్న్‌పావి చొచువాంగ్ (థాయ్‌లాండ్)పై నెగ్గింది. జక్కా వైష్ణవి రెడ్డి 12–21, 10–21తో లిన్ హొజ్‌మార్క్ (డెన్మార్క్) చేతిలో ఓడింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జంట 12–21, 14–21తో జెంగ్ సీవె–హువాంగ్ యకివాంగ్ (చైనా) జోడీ చేతిలో, పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమిత్ రెడ్డి జోడీ 21–15, 15–21, 17–21తో లీ చెంగ్–జంగ్ నాన్ (చైనా) ద్వయం చేతిలో ఓడిపోయాయి.