
పంజాబ్‌దే పై చేయి
ఫైనల్లో కింగ్స్ ఎలెవన్
24 పరుగులతో చెన్నైపై విజయం
సెహ్వాగ్ సూపర్ సెంచరీ
రైనా అద్భుత పోరాటం వృథా
ఆదివారం కోల్‌కతాతో తుదిపోరు
అద్భుతం...మహాద్భుతం...20 ఓవర్ల ఆటలో ప్రేక్షకులకు అపరిమిత ఆనందం... బ్యాట్స్‌మెన్ వీర విహారం ముందు బౌలర్లకు చుక్కలు కనిపించాయి. గెలుపోటముల తేడా 24 పరుగులే కనిపిస్తున్నా వాస్తవానికి జరిగిన పోరాటం వేరు. ఈ సీజన్‌కే ది బెస్ట్ అనదగ్గ ఆటను చూపిస్తూ ఆ రెండు జట్లు మరో సారి విధ్వంసాన్ని సృష్టించాయి.
తొలుత వీర విహారంతో పంజాబ్ భారీ స్కోరు నమోదు చేస్తే, తామేమీ తక్కువ కాదంటూ చెన్నై ఆఖరి వరకూ పోరాడింది. ఇరు జట్లు కొదమ సింహాల్లా తలపడ్డ పోరులో చివరకు కింగ్స్ ఎలెవన్ ముందు సూపర్ కింగ్స్ తలవంచింది. సెహ్వాగ్ సూపర్ సెంచరీ, రైనా అసాధారణ ఆట ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేశాయి. సీజన్ ఆసాంతం సంచలన విజయాలతో దూసుకుపోయిన బెయిలీ బృందం తుది పోరుకు అర్హత సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లాగే ఇదీ సంపూర్ణ వినోదాన్ని పంచింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా 428 పరుగులు నమోదు కావడం విశేషం.
ముంబై: పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మరో సారి జూలు విదిల్చింది. అద్భుత ప్రదర్శనతో తొలి సారి ఐపీఎల్ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ 24 పరుగుల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. వీరేంద్ర సెహ్వాగ్ (58 బంతుల్లో 122; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) సూపర్ సెంచరీ సాధించగా, మిల్లర్ (19 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్), మనన్ వోహ్రా (31 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్సర్లు) అండగా నిలిచాడు. ఆ తర్వాత సురేశ్ రైనా (25 బంతుల్లో 87; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుత ప్రదర్శనతో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 202 పరుగులు చేయగలిగింది. ధోని (31 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా లాభం లేకపోయింది.
సెహ్వాగ్ దూకుడు...
తొలి ఓవర్‌నుంచే సెహ్వాగ్, వోహ్రా జోరు ప్రదర్శించారు. చెన్నై బౌలర్లు ప్రభావం చూపలేకపోవడంతో పవర్ ప్లేలో జట్టు 70 పరుగులు చేయగా...9.1 ఓవర్లలో స్కోరు 100 పరుగులకు చేరింది. 21 బంతుల్లో సెహ్వాగ్ అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే వీరూ మాత్రం తన దూకుడు తగ్గించలేదు. అర్ధ సెంచరీ తర్వాత అతను మరింత వేగంగా దూసుకుపోయాడు.
మిల్లర్ అండగా నిలవడంతో 50 బంతుల్లో సెహ్వాగ్ ఐపీఎల్‌లో రెండో సెంచరీని అందుకున్నాడు. వీరూ వెనుదిరిగాక బెయిలీ (1), మిల్లర్, సాహా (6) తక్కువ వ్యవధిలో అవుటయ్యారు.
ఆకాశమే హద్దుగా...
అతి భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై రెండో బంతికే డు ప్లెసిస్ (0) వికెట్ కోల్పోయింది. అయితే ఆ ఆనందం పంజాబ్‌కు ఎంతో సేపు నిలవలేదు. సురేశ్ రైనా అత్యద్భుతమైన ఆటతో చెన్నై ఇన్నింగ్స్‌ను ఆకాశంలో నిలబెట్టాడు. మరో వైపు స్మిత్ (7) విఫలమయ్యాడు.
అవానా వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో రైనా రెండు సిక్స్‌లు, ఐదు ఫోర్లు (ఒక నోబాల్) కొట్టాడు. ఈ ఓవర్లో ఏకంగా 33 పరుగులు వచ్చాయి. రైనా రనౌట్ అయ్యాక... జడేజా జడేజా (21 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) , ధోని కొద్దిసేపు పోరాడినా... పంజాబ్ పట్టు విడవలేదు.
స్కోరు వివరాలు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) డు ప్లెసిస్ (బి) నెహ్రా 122; వోహ్రా (సి) రైనా (బి) పాండే 34; మ్యాక్స్‌వెల్ (సి) రైనా (బి) అశ్విన్ 13; మిల్లర్ (రనౌట్) 38; బెయిలీ (బి) నెహ్రా 1; సాహా (సి) స్మిత్ (బి) మోహిత్ 6; జాన్సన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 226.
వికెట్ల పతనం: 1-110; 2-148; 3-211; 4-218; 5-225; 6-226.
బౌలింగ్: నెహ్రా 4-0-51-2; పాండే 4-0-35-1; మోహిత్ 4-0-46-1; అశ్విన్ 4-0-44-1; జడేజా 4-0-48-0.
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (బి) సందీప్ 7; డు ప్లెసిస్ (సి) బెయిలీ (బి) జాన్సన్ 0; రైనా (రనౌట్) 87; మెకల్లమ్ (రనౌట్) 11; జడేజా (సి) జాన్సన్ (బి) అవానా 27; డేవిడ్ హస్సీ (సి) సెహ్వాగ్ (బి) అవానా 1; ధోని (నాటౌట్) 42; అశ్విన్ (స్టంప్డ్) సాహా (బి) అక్షర్ 10; మోహిత్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 202.
వికెట్ల పతనం: 1-1; 2-67; 3-100; 4-140; 5-140; 6-142; 7-167.
బౌలింగ్: జాన్సన్ 4-0-44-1; సందీప్ శర్మ 3-0-32-1; అవానా 4-0-59-2; కరణ్‌వీర్ 4-0-32-0; మ్యాక్స్‌వెల్ 1-0-4-0; అక్షర్ పటేల్ 4-0-23-1.
టర్నింగ్ పాయింట్...
పవర్‌ప్లే ముగిసే సరికి చెన్నై స్కోరు 100 పరుగులు. అందులో రైనా ఒక్కడే 87 చేశాడు. మ్యాచ్ పంజాబ్‌నుంచి చేజారుతున్నట్లే అనిపించింది. ఈ దశలో ఏడో ఓవర్ తొలి బంతిని కవర్స్ వైపు కొట్టి సింగిల్ కోసం ప్రయత్నించిన మెకల్లమ్ కాస్త సంకోచించినా...మరో ఎండ్‌లో ఉన్న రైనా పరుగు పూర్తి చేసుకోగలననే విశ్వాసంతో మెకల్లమ్‌ను పిలిచాడు. అయితే చురుగ్గా స్పందించి బెయిలీ విసిరిన త్రో నేరుగా స్ట్రైకర్ ఎండ్‌లో వికెట్లను తగిలింది. రైనా డైవ్ చేసినా లాభం లేకపోయింది. ఈ రనౌట్‌తోనే మ్యాచ్ మలుపు తిరిగింది.
ఆర్యా... సంతోషమేనా!
‘ఎందుకు డాడీ.. ఊరికే అవుట్ అవుతున్నావు? మీ డాడీకి పరుగులు చేయడం చేతకాదంటూ స్కూల్‌లో నా స్నేహితులు ఏడిపిస్తున్నారు’ కొద్ది రోజుల క్రితం సెహ్వాగ్‌కు ఫోన్ చేసిన అతని కొడుకు ఆర్యవీర్ వ్యక్తం చేసిన ఆవేదన ఇది. ‘చిన్నా బాధపడకు... కచ్చితంగా నేను భారీ స్కోరు చేస్తా’ అని సమాధానం చెప్పిన వీరూ... చెన్నైతో కీలక మ్యాచ్‌లో పెను విధ్వసం సృష్టించి తన కుమారుడు గర్వపడేలా చేశాడు. అంతేకాదు... పంజాబ్ జట్టు ఓనర్లలో ఒకరైన నెస్ వాడియాకు మరచిపోలేని బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చాడు.
వీరేంద్రుడి విశ్వరూపం
వీరేంద్ర సెహ్వాగ్ యుద్ధం ప్రకటించాడు..! ప్రత్యర్థిగా ఉన్న చెన్నై జట్టు బౌలర్లపైనా...తనను లెక్కే చేయని ఢిల్లీ జట్టు యాజమాన్యంపైనా...మాజీ సహచరుడు గంభీర్‌కు భారత జట్టులో చోటిచ్చి తనను కనీసం పట్టించుకోని సెలక్టర్లపైనా...వీరూ వీరావేశానికి స్ఫూర్తినిచ్చిన కారణం ఏదైనా కావచ్చు. కానీ చాన్నాళ్ల తర్వాత తనలోని అసలైన ఆటను బయట పెట్టాడు. మ్యాక్స్‌వెల్, పొలార్డ్, పఠాన్, అండర్సన్‌ల మత్తులో ఉన్న ఐపీఎల్ అభిమానులకు తానేంటో మళ్లీ గుర్తు చేశాడు. తానెంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదంటూనే వీరందరికీ విధ్వంసక ఆటలో తానే ‘బాప్’నని రుజువు చేసుకున్నాడు. కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా సెహ్వాగ్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం.
తనకు అలవాటైన రీతిలో తొలి బంతిని బౌండరీతో వీరూ ఆరంభించలేదు. కానీ ఆ తర్వాత అతని బ్యాట్ పదునెక్కింది. కవర్స్, పాయింట్, థర్డ్‌మ్యాన్‌ల దిశగా అద్భుతమైన టైమింగ్‌తో ఫోర్లు కొట్టిన వీరూ...తన ఫేవరేట్ అప్పర్ కట్‌తో సిక్సర్ల ఖాతా తెరిచాడు. నెహ్రా బౌలింగ్‌లో వరుసగా కొట్టిన మూడు ఫోర్లు క్లాసిక్‌గా కనిపించాయి. వీరూ వేగానికి జడేజా పెద్ద బాధితుడయ్యాడు. అతను వేసిన 15 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు రాబట్టాడు!
గత ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమైనసెహ్వాగ్ ఈ సీజన్‌లోనూ ఆరంభంలో అంతంతే అనిపించాడు. చాలా ఇన్నింగ్స్‌లో మెరుపు ఆరంభం చేస్తున్నా అది చివరి వరకు కొనసాగలేదు. అయితే కటక్‌లో కోల్‌కతాపై అర్ధ సెంచరీ చేసి టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినా...ఆ తర్వాత ఆరు ఇన్నింగ్స్ మళ్లీ తిరోగమనం వైపే వెళ్లాయి. అయితే శుక్రవారం ఇన్నింగ్స్‌తో అతను ఐపీఎల్‌లో రెండో సారి ‘సెంచరీ పంచ్’ విసిరాడు. ఎన్ని మారినా...ఎందరు ‘విలయకారులు’ వచ్చినా తన తర్వాతే అనే ఆనందం, ఆత్మవిశ్వాసం ఆ అద్దాల మాటున కనిపించింది. అన్నట్లు... కింగ్స్ ఎలెవన్ టీ షర్ట్ వేసుకొని వీరూ జోరుకు చప్పట్లతో ఊగిపోయిన అర్జున్ టెండూల్కర్‌ని చూస్తే తెలుస్తుంది ఈ ఇన్నింగ్స్‌పై సెహ్వాగ్ అభిమానుల స్పందన ఏమిటో!