
మొహాలి : ప్రీతి జింటాది నలుగురితో కలివిడిగా ఉండే తత్వం. మైదానంలో నవ్వులు రువ్వుతూ.. నిత్యం సంతోషంగా కనిపిస్తారామె. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని అయిన ఆమె తమ జట్టు మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా.. అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ జట్టు సభ్యులను ఉత్సాహ పరుస్తుంటారు. ఆదివారం కింగ్స్ ఎలెవన్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మ్యాచ్ సందర్భంగా కూడా ప్రీతి ఉత్సాహంగా కనిపించారు. ఈ మ్యాచ్‌లో ధోనీ అద్భుతంగా ఆడి ఐపీఎల్‌లో కెరీర్ బెస్ట్ అయిన 79 పరుగులు చేసి.. నాటౌట్‌గా ఉన్నప్పటికీ చెన్నై జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది.
లక్ష్యఛేదనలో ధోనీ వీరోచితంగా ఆడుతున్నంతసేపు మైదానంలో ప్రీతి ఒకింత డల్‌గా కనిపించారు. మొదట క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ చెలరేగి ఆడి.. చెన్నైకి 198 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంతో ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆ తర్వాత ధోనీ ఆటతీరుతో చెన్నై జట్టు లక్ష్యం దిశగా సాగడం ఆమెలో కొంత టెన్షన్ రేపినట్టు కనిపించింది. కానీ, చివరకు పంజాబ్ జట్టు గెలుపొందడంతో ప్రీతి ఆనంద డొలికల్లో తేలియాడింది.
గెలిచిన అనంతరం ఆమె మైదానంలోని అభిమానులకు కింగ్స్ ఎలెవన్ జట్టు టీ షర్ట్‌లను పంచింది. ఈ సందర్భంగా ప్రీతి ఒక్కసారిగా సహనం కోల్పోయినట్టు కనిపించింది. ప్రేక్షకుల్లో కొందరు చేసిన వ్యాఖ్యలు ఆమెకు కోపం తెప్పించాయి. కోపంతో కొందరిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయడం.. ప్రేక్షకులకు ఆమెకు మధ్య కొంత వాగ్వాదం నడవడం వీడియోలో కనిపించింది. వెంటనే నార్మల్ అయిపోయిన ప్రీతి మళ్లీ యథావిధిగా అభిమానులకు టీషర్ట్‌లు పంచింది. అయితే, టీషర్ట్‌ల కోసం అభిమానులు ఎగబడటంతో చిన్నారులు కిందపడి నలిగిపోయే పరిస్థితి ఎదురైందని, అందుకే చిన్నారులకు ఇబ్బంది కలుగకుండా చూడాలంటూ ప్రేక్షకులను ఉద్దేశించి పేర్కొన్నట్టు ప్రీతి ట్విటర్‌లో వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment