
'టీమిండియాదే భవిష్యత్ క్రికెట్'
న్యూఢిల్లీ:ఇటీవల కాలంలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న టీమిండియా పై మాజీ కోచ్ గ్యారీ కిరెస్టన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యంత పటిష్టంగా ఉన్న భారత క్రికెట్ జట్టు భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని కిరెస్టన్ కొనియాడాడు. ప్రత్యేకంగా విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియాదే భవిష్యత్ క్రికెట్ అని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం టీమిండియా జట్టులో మంచి వాతావరణం నెలకొని ఉండటమే ఆ జట్టు విజయాలకు ప్రధాన కారణమన్నాడు. విరాట్ లోని అసాధారణ ప్రతిభ టీమిండియాను ఉన్నతస్థానంలో నిలిపిందన్నాడు.
దాంతో పాటు గతంలో టీమిండియాకు కోచ్గా పని చేసిన జ్ఞాపకాల్ని కిరెస్టన్ గుర్తు చేసుకున్నాడు. టీమిండియాలో టర్బోనేటర్ గా పేరున్న హర్భజన్ సింగ్ చాలా సరదాగా ఉండేవాడన్నాడు. ఎటువంటి ఒత్తిడి సమయంలోనైనా హర్భజన్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేవాడని కొనియాడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ద్వారా భారత క్రికెట్ కు ఆణిముత్యాల్లాంటి యువ క్రికెటర్లు దొరుకుతున్నారన్నాడు.