సత్తాచాటిన కోహ్లీ, రహానే
ఇండోర్: న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరిదైన మూడోటెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ(366 బంతుల్లో 211: 20 ఫోర్లు)కి అజింక్యా రహానే(381 బంతుల్లో 188 పరుగులు: 18 ఫోర్లు, 4 సిక్సర్లు) క్లాస్ ఇన్నింగ్స్ తోడవడంతో భారత్ పటిష్టస్థితిలో నిలిచింది. చివర్లో రోహిత్ హాఫ్ సెంచరీ(63 బంతుల్లో 51 నాటౌట్: 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసిన తర్వాత జట్టుస్కోరు 557/5 వద్ద భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన కివీస్ రెండో రోజు ఆట నిలిపివేసే సమయానికి 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. భారత్ ఇంకా 529 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఓవర్ నైట్ స్కోరు 267/3తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ నిలకడగా బ్యాటింగ్ చేసింది. కోహ్లీ, రహానే రెండో రోజూ కివీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. డబుల్ సెంచరీ చేసిన తర్వాత జీతన్ పటేల్ బౌలింగ్ లో కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా నాలుగో వికెట్ రూపంలో నిష్ర్రమించాడు. కోహ్లీ, రహానే నాలుగో వికెట్ కు రికార్డు స్థాయిలో 365 పరుగుల భారీ భాగస్వామ్యంతో భారత్ పటిష్టస్థితిలో నిలిచింది. డబుల్ సెంచరీకి చేరువవుతున్న దశలో వ్యక్తిగత స్కోరు 188 వద్ద బౌల్ట్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచిచ్చి రహానే నిరాశగా వెనుదిరిగాడు. చివర్లో రోహిత్ మెరుపు హాఫ్ సెంచరీ చేయడంతో భారత్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. జడేజా(27 బంతుల్లో 17 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 557/5 వద్ద కోహ్లీ భారత్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ 17, లాథమ్ 6 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.