కివీస్ కు కోహ్లి, రహానేల పరీక్ష
ఇండోర్: చివరిదైన మూడో టెస్టులో న్యూజిలాండ్ జట్టుకు భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లి, మిడిల్ ఆర్డర్ ఆటగాడు అజింక్యా రహానేలు పరీక్షగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్ లో ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలు నమోదు చేసి కివీస్ బౌలర్లకు గోడలా నిలిచారు. శనివారం ఆరంభమైన మ్యాచ్లో 100 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయినా, ఆ తరువాత కోహ్లి-రహానేల జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది.
ఈ జోడి వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి భారత్ ను పటిష్ట స్థితికి చేర్చింది. వీరిద్దరూ రాణించడంతో భారత తన తొలి ఇన్నింగ్స్ లో 78.0 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(83), రహానే(53) క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు మురళీ విజయ్(10),గౌతం గంభీర్(29), చటేశ్వర పూజారా(41)లు పెవిలియన్ కు చేరారు.